భీమ్‌గల్‌గా మారిన వేముగల్లు

12 Jan, 2020 11:44 IST|Sakshi
భీమ్‌గల్‌ పట్టణ ముఖ చిత్రం

నాడు సంస్థానం.. నేడు పురపాలక సంఘం

1975లో భీమ్‌గల్‌ పంచాయతీగా ఆవిర్భావం 

2019లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌

సాక్షి, మోర్తాడ్‌(బాల్కొండ): ఎక్కువగా వేప చెట్లు ఉండడంతో వేముగల్లుగా పిలువబడిన ఆ నాటి సంస్థానమే నేటి భీమ్‌గల్‌గా గుర్తించబడింది. సరైన వైద్యం అభివృద్ధి చెందని సమయంలో తమకు అందుబాటులో ఉన్న వేప చెట్ల ఆకులు, గింజలతో మందులను తయారు చేసి రోగులను బతికించుకున్న సంస్థానంగా చరిత్రలో చోటు సంపాదించుకున్న వేముగల్లు సంస్థానం కాలక్రమంలో భీమ్‌గల్‌గా ప్రసిద్ధిగాంచింది.

15వ శతాబ్దంలో వేముగల్లు సంస్థానాధీశుడైన రాణామల్ల నరేంద్రుడు పల్లికొండను రాజధానిగా చేసుకుని పాలన సాగించినట్లు చరిత్రకారులు వివరించారు. వేముగల్లు సంస్థాన ఆస్థాన కవి కొరవి గోపరాజు ఈ సంస్థానం పాలన గురించి చాలా గొప్పగా వివరించారు. వేముగల్లు సంస్థానంపై తెలుగు యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా పని చేసిన హన్మాండ్ల భూమేశ్వర్‌ పరిశోధన చేశారు. అలాగే సిరికొండ మండలం కొండూర్‌కు చెందిన సల్లావచ్చల మహేశ్‌బాబు కూడా కొరవి గోపరాజు రచించిన సింహాసన ధ్వాతృంశిఖపై పరిశోధనలను కొనసాగించారు. ఇలా వేముగల్లు సంస్థానానికి చరిత్రలో ఎన్నో విధాలుగా ప్రాధాన్యత లభించింది.

కస్బా నుంచి కస్పా.. 
వేముగల్లు పేరు భీమ్‌గల్‌గా మారక ముందు కస్బా అని పిలిచేవారు. ఉర్దూలో కస్బా అంటే పెద్ద నగరం, పట్టణం అని అర్థం. అలా భీమ్‌గల్‌ను మొదట కస్బా అని ఆ తరువాత వాడుకలో కస్పాగా మారింది. తరువాత భీమ్‌గల్‌ అని పలికేవారు. ప్రస్తుతం భీమ్‌గల్‌ అని పలుకుతూ రాస్తున్నారు. భీమ్‌గల్‌ 1975లో గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. పంచాయతీ సమితిగా, తాలుకా కేంద్రంగా కూడా భీమ్‌గల్‌ ప్రసిద్ధికెక్కింది. 

‘గాడి’ కుటుంబానికి ఎక్కువ మార్లు అవకాశం 
భీమ్‌గల్‌ మున్సిపాలిటీగా మారక ముందు గ్రామ పంచాయతీగా కొనసాగింది. ఈ పంచాయతీకి ఎక్కువ మార్లు ‘గాడి’ కుటుంబీకులే సర్పంచ్‌లుగా ఎంపికయ్యారు. 1975లో మొదటి సర్పంచ్‌గా ఇమాంభ„Š ఎంపికయ్యారు. ఆ తరువాత 1980 నుంచి గాడి సుదర్శన్‌రావు నాలుగుమార్లు సర్పంచ్‌గా ఎంపికయ్యారు. ఆయన 1998 వరకు 18 ఏళ్ల పాటు సర్పంచ్‌గా బాధ్యతలను నిర్వహించారు. ఆయన మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో గాడి సుదర్శన్‌రావు సోదరుడు రాజేశ్వర్‌రావు సర్పంచ్‌గా ఎంపికయ్యారు. 2000 సంవత్సరంలో మరోసారి రాజేశ్వర్‌రావు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

2005లో గాడి భూపతిరావు, 2010లో గాడి భూపతిరావు సతీమణి శోభ సర్పంచ్‌గా ఎంపికై భీమ్‌గల్‌పై తమ పట్టును నిరూపించుకున్నారు. 2014లో సర్పంచ్‌ పదవి ఎస్టీలకు రిజర్వు చేయబడడంతో రవినాయక్‌ ఎన్నికయ్యారు. 2019లో మున్సిపాలిటీగా భీమ్‌గల్‌ అప్‌గ్రేడ్‌ చేయబడింది. ఈ ఎన్నికల్లో చైర్‌పర్సన్‌ పదవిని బీసీ మహిళలకు రిజర్వు చేశారు. భీమ్‌గల్‌ తొలి మున్సిపల్‌ చైర్మన్‌గా ఎవరు ఎంపికైతారో వేచి చూడాలి. 

మరిన్ని వార్తలు