ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు విఫలం

3 Oct, 2019 02:27 IST|Sakshi
బుధవారం ఆర్‌అండ్‌బీ ప్రధాన కార్యాలయంలో చర్చలు జరుపుతున్న ఐఏఎస్‌ అధికారుల కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు

ఆర్టీసీ కార్మిక సంఘాలతో త్రిసభ్య కమిటీ భేటీ

దసరా ప్రయాణాల సమయంలో సమ్మె సరికాదన్న అధికారులు

డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని వెల్లడి

స్పష్టత ఇస్తే తప్ప సమ్మె విరమించలేమన్న కార్మిక సంఘాలు

అసంపూర్తిగా ముగిసిన భేటీ...

నేడు మళ్లీ కార్మిక సంఘాలతో చర్చలు 

సరిగ్గా దసరా సమయంలో ఆర్టీసీ బస్సుల నిలుపుదల సరికాదు. మీ డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమ్మె ఆలోచన విరమించుకోండి. – ఐఏఎస్‌ అధికారుల త్రిసభ్య కమిటీ

నిర్దిష్ట హామీ లేకుండా సమ్మెను విరమించుకోమంటే ఎలా.. మా డిమాండ్లలో ఆర్టీసీ యాజమాన్యం పరిష్కరించ గలిగేవే ఎక్కువ. వాటిని తేల్చి మిగతావాటిపై హామీ ఇవ్వండి. – కార్మిక సంఘాలు 

సాక్షి, హైదరాబాద్‌ :  ఆర్టీసీ సమ్మెను తప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్‌ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య బుధవారం జరిగిన తొలిదశ చర్చలు విఫలమయ్యాయి. సమ్మెకు సిద్ధమైన కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందుంచిన 26 డిమాండ్లలో ఏ ఒక్కదానికి కూడా కమిటీ నుంచి నిర్దిష్ట హామీ రాకపోవటం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కండక్టర్, డ్రైవర్ల ఉద్యోగ భద్రతకు సంబంధించిన ప్రతిపాదన లాంటి కీలక అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందీలేనిదీ చెప్పకపోవటం, అసలు ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక ఎప్పట్లోగా ఇస్తుందో కాల పరిమితి వెల్లడించకపోవటంపై కార్మిక సంఘాలు ప్రశ్నించాయి. ఇలాంటివేమీ లేకుండా సమ్మె ఆలోచన విరమించుకోవాలని చెప్పడాన్ని తప్పు పడుతూ, సమ్మె విషయంలో తమ ఆలోచన మారదని పేర్కొన్నాయి. దీంతో ఈ చర్చలు విఫలమైనట్లు స్పష్టమవుతోంది. దీంతో గురువారం మధ్యాహ్నం మరోసారి చర్చలకు రావాల్సిందిగా కార్మిక సంఘాలకు సూచించాయి. ఆ చర్చలకు తాము హాజరవుతామని, అందులో కొన్ని డిమాండ్లకైనా హామీ రావటంతో పాటు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వానికి నివేదిక ఎప్పట్లోగా ఇస్తారు.. వాటిపై ప్రభుత్వం ఎప్పట్లోగా స్పష్టత ఇస్తుందో వెల్లడిస్తే సమ్మె విరమణకు సిద్ధమని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. 

హడావుడి చర్చలతో.. 
మంగళవారం రాత్రి పొద్దు పోయేవరకు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ సమ్మె అంశంపై ప్రధాన చర్చ జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి సూచనతో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు సోమేశ్‌కుమార్, రామకృష్ణారావు, సునీల్‌శర్మలతో కమిటీని ఏర్పాటు చేసిన మంత్రివర్గం.. కార్మిక సంఘాలతో చర్చించాలని ఆదేశించింది. దీంతో పాటు ఆర్టీసీ పరరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక కోరింది. ఈ మేరకు కమిటీ ప్రతినిధులు బుధవారమే రంగంలోకి దిగారు. 5వ తేదీ ఉదయం షిఫ్ట్‌ నుంచే సమ్మె చేయనున్నట్లు కార్మిక సంఘాలు ఇప్పటికే తేల్చి చెప్పినందున వెంటనే చర్చలకు సిద్ధమయ్యారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు రోడ్లు భవనాల శాఖ ప్రధాన కార్యాలయంలో చర్చలకు గుర్తింపు కార్మిక సంఘంతో కూడిన జేఏసీని ఆహ్వానించారు. అందులో భాగస్వామ్యం ఉన్న నాలుగు సంఘాల ప్రతినిధులు చర్చలకు హాజరయ్యారు. దాదాపు గంట సేపు అధికారులు చర్చలు జరిపారు.

‘కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందుంచిన 26 డిమాండ్లను పరిశీలించాం. వాటి విషయంలో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అందులో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం లాంటి చాలా కీలకమైన అంశాలున్నాయి. వాటిపై వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేయటం సబబు కాదు. అందుకు కొంత సమయం అవసరం. మరోవైపు ప్రజలు దసరా పండుగ కోసం ఊళ్లకు పయనమవుతున్న తరుణంలో సమ్మె చేస్తామనటం కూడా సబబు కాదు. ప్రభుత్వం ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల డిమాండ్లపై చర్యలు తీసుకునేందుకు సానుకూలంగానే ఉన్నందున సమ్మె యోచన విరమించుకోండి. తాము అన్ని విషయాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి కూలంకషంగా నివేదిక ఇస్తాం. ఆ సమయంలో చర్యలు తీసుకోని పక్షంలో సమ్మెపై నిర్ణయం తీసుకోండి’అని కమిటీ సభ్యులు కార్మిక సంఘాల దృష్టికి తెచ్చారు. అయితే కమిటీ ఏర్పాటైన వెంటనే ఈ చర్చలకు సిద్ధం కావటంతో.. డిమాండ్లపై హామీ ఇవ్వాలా వద్దా అన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. అందులో స్వయంగా ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ ఉన్నా.. క్లారిటీ లేకుండా పోవటంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

ఎలాంటి హామీ లేకుండానే.. 
గతంలో ఆర్టీసీ అంశాలకు సంబంధించి ఇలాగే కొన్ని కమిటీలు వేశారని, అందులో కొన్ని నివేదికలు ఇచ్చినా చర్యల్లేవని, అసలు కొన్ని నివేదికలే ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో ఈ కమిటీని ఎలా పరిగణనలోకి తీసుకోవాలని కార్మిక సంఘాలు అసహనం వ్యక్తం చేశాయి. ‘ప్రభుత్వం ముందుంచిన 26 డిమాండ్లలో 22 డిమాండ్లకు ఆర్టీసీ యాజమాన్యమే హామీ ఇచ్చే అవకాశముంది. అవి అధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకోదగ్గవి.. అయినా కూడా ఒక్క హామీ కూడా ఇవ్వకుండా సమ్మెకు వెళ్లొద్దని చెప్పటం సరికాదు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతనాల సవరింపు, ఆర్టీసీ బలోపేతం లాంటి కీలక అంశాలు ప్రభుత్వానికి వదిలేసి, మిగతా వాటిపై స్పష్టమైన హామీ ఇవ్వాలి. డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగ భద్రతకు సంబంధించి ఏపీ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని అనుసరించి సర్క్యులర్‌ ఇచ్చేందుకు అర గంట సమయం చాలు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు వెంటనే రూ.600 కోట్లు విడుదల చేయండి. అసలు కమిటీ ఎన్నిరోజుల్లో నివేదిక ఇస్తుంది.. దానిపై ప్రభుత్వం ఎంత కాలంలో చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయండి.. సమ్మె విషయాన్ని పునరాలోచించుకుంటాం’అని సంఘాలు పేర్కొన్నాయి. 

మరోసారి పిలిచిన సునీల్‌శర్మ.. 
చర్చల అనంతరం కార్మిక సంఘాలు నిష్క్రమించిన అనంతరం సాయంత్రం ఆరు గంటలకు మరోసారి రావాల్సిందిగా వారికి సమాచారం అందింది. దీంతో మరో దశ చర్చలుంటాయని భావించి సంఘాల ప్రతినిధులు వచ్చారు. కేవలం కమిటీలోని సునీల్‌శర్మ ఒక్కరే వారితో చర్చించారు. డిమాండ్లపై సీఎం సానుకూలంగా ఉన్నారని, సమ్మెకు వెళ్తే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉందని, సమ్మె యోచన విరమిస్తే, తొందర్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిర్ధిష్ట హామీ ఇస్తే తప్ప సమ్మె యోచన విరమించబోమని, డిమాండ్ల పరిష్కానికి పట్టే సమయం కూడా స్పష్టం చేయాలని మరోసారి పేర్కొని కార్మిక సంఘాల నేతలు బయటకొచ్చేశారు. చర్చల్లో టీఎంయూ నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి, తిరుపతి, ఈయూ నేత రాజిరెడ్డి, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ నేత వీఎస్‌రావు, సూపర్‌వైజర్స్‌ అసోసియేషన్‌ నేత వాసుదేవరావు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు