7 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

5 Jun, 2019 01:47 IST|Sakshi

పరీక్షలకు హాజరుకానున్న 4,63,236 మంది విద్యార్థులు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 7 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. ప్రధాన పరీక్షలు ఈ నెల 12తో ముగుస్తాయన్నారు. బోర్డు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తొలి ఏడాది పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 వరకు, రెండో ఏడాది పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయన్నారు. గంటముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు.

పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు 040–24601010, 040–247 32369 నంబర్లతో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు తెలి పారు. పరీక్షలకు 4,63,236 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫెయిలైన విద్యార్థులు 3,14,773 మంది ఉండగా, ప్రథమ సంవత్సరంలో ఇంప్రూవ్‌మెంట్‌ రాసే వారు 1,48,463 మంది ఉన్నట్లు వివరించారు. పరీక్షల నిర్వహణకు 857 కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. 

వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు... 
విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లను పంపించామని, అయినా ఇంకా అందకుంటే bie.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అశోక్‌ సూచించారు. వాటిపై కాలేజీ ప్రిన్సిపాళ్ల సంతకాలు లేకపోయినా అనుమతించాలని చీఫ్‌ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఓంఆర్‌ఎర్‌ షీట్లలో విద్యార్థులకు సంబంధించిన వివరాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే విద్యార్థులు చూసుకొని ఇన్విజిలేటర్‌ దృష్టికి తీసుకెళ్లాలని, ఒకవేళ సరిగ్గా చూసుకోకపోతే ఆ తరువాత విద్యార్థులదే బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు