విపక్ష శిబిరంలో లుకలుకలు

5 Jun, 2019 01:48 IST|Sakshi

ఎన్నికల ఫలితాలు వెల్లడై పక్షం రోజులు కాకుండానే ప్రజలిచ్చిన తీర్పు ఎంత సహేతుకమైనదో విప క్షాలు నిరూపిస్తున్నాయి. మొదటగా కాంగ్రెస్‌ అయోమయావస్థలో చిక్కుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పదవి నుంచి తప్పుకుంటానని మొత్తుకుంటుంటే ‘వల్లకాదు..మీరే మా నేత’ అంటూ నాయకశ్రేణి అంతా ప్రాధేయపడుతోంది. ఇది తేలేవరకూ పార్టీ అధికార ప్రతినిధులు, నాయకులు మౌనముద్ర దాల్చాలన్న నిర్ణయం కూడా తీసుకున్నారు. వందేళ్ల పైబడి చరిత్ర గలిగి, అనేక ఎన్నికల యుద్ధాల్లో ఓడుతూ, గెలుస్తూ సుదీర్ఘకాలం పాలించిన ఒక పార్టీ నుంచి ఈ మాదిరి ప్రవర్తనను ఎవరూ ఊహించరు. ఈ అంతర్గత పోరు పర్యవసానాలు కూడా తీవ్రంగానే ఉన్న దాఖలా కనబడు తోంది.

ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో లుకలుకలు బయల్దేరగా... కర్ణాటకలో కాంగ్రెస్‌–జేడీ (ఎస్‌) కూటమి చిక్కుల్లో పడింది. మహారాష్ట్రలో కీలక నేతలు బీజేపీకి క్యూ కడుతున్న సూచనలు కన బడుతున్నాయి. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ)–బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ)ల నేతృత్వం లోని మహాకూటమి వంతు వచ్చింది. అయిదు నెలలక్రితం ఆర్భాటంగా మొదలైన ఆ కూటమికి బీఎస్‌పీ అధ్యక్షురాలు మాయావతి స్వస్తి పలికారు.  కనీసం భాగస్వామికి చెప్పాలన్న నియమం కూడా పాటించకుండా ‘ప్రస్తుతానికి’ ఆ పొత్తు నిలిచిపోతుందని ప్రకటించారు. ఈ కూటమి ఇకపై కూడా కొనసాగుతుందంటూ గంభీరంగా చెప్పుకుపోతున్న ఎస్‌పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ను మీడియా ప్రతినిధులు ఆపి మాయావతి నిర్ణయాన్ని చెప్పవలసి వచ్చింది.

దాంతో వెంటనే ఆయన కూడా స్వరం మార్చారు. ఏతా వాతా ఇద్దరూ త్వరలో జరగబోయే 11 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తారు. భవిష్యత్తులో మళ్లీ కూటమి ఉనికిలోకి రావొచ్చునని మాయావతి చెప్పినా అదంత సులభం కాదు. ‘నీకు నీ గురించి, నీ శత్రువు గురించి సంపూర్ణ అవగాహన ఉంటే వంద యుద్ధాలకు కూడా భయపడనవసరంలేద’ని ‘యుద్ధ కళ’ను రచించిన ప్రాచీన చైనా యుద్ధ నిపుణుడు సన్‌ జూ అంటాడు. ‘నీ గురించి తెలిసినా శత్రువును తెలుసుకోవడంలో విఫలమైతే ప్రతి విజయం వెంటా అపజయం ఎదురవుతుంటుంద’ని హెచ్చరిస్తాడు. ‘నీ గురించి, నీ శత్రువు గురించి కూడా తెలుసుకోలేని స్థితిలో పడితే నీకు శాశ్వతంగా ఓటమే రాసిపెట్టి ఉంటుంద’ని చెబుతాడు. విప క్షాలన్నీ ఈ మూడో అవస్థతో సతమతమవుతున్నాయి. వాటికి స్వస్వరూప జ్ఞానమూ శూన్యమే... తమ ప్రత్యర్థి గురించిన అవగాహనా అంతంత మాత్రమే. 

మొన్న జనవరిలో మహాకూటమిగా ఏర్పడినప్పుడు మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు. లోక్‌సభలో మాయావతికి ఎస్‌పీ మద్దతుగా నిలబడటానికి, అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ అఖిలేష్‌కు ఆసరా ఇవ్వడానికి ఆ రెండు పార్టీల మధ్యా అంగీకారం కుదిరింది. మరో మాటలో చెప్పాలంటే ప్రధాని పదవిని మాయావతి, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవిని అఖిలేష్‌ యాదవ్‌ ‘పంచుకున్నారు’. కానీ ఓటర్లు మాత్రం వేరేవిధంగా ఆలోచించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ కూటమిని ఓడించి, బీజేపీకి పట్టంగట్టారు. 80 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 62 గెల్చు కోగా, ఆ పార్టీ మిత్రపక్షం అప్నాదళ్‌కు 2 స్థానాలొచ్చాయి. మహాకూటమి కేవలం 15 (బీఎస్‌పీ10, ఎస్‌పీ–5) స్థానాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది.

కూటమి నుంచి కాంగ్రెస్‌ను దూరం పెట్టినందు వల్ల 10 స్థానాలు చేజారాయని లెక్కలు చెబుతున్నాయి. దానికి గెలిచే సత్తా లేకపోయినా కూటమి అవకాశాలను బాగా దెబ్బతీసింది. కేవలం కులాన్ని నమ్ముకుని, పరస్పరం ఓట్లు బదిలీ అవుతా యన్న విశ్వాసాన్ని పెట్టుకుని కూటమి బరిలోకి దిగింది. బీజేపీ విధానాలకు ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుంచడంలో ఘోరంగా విఫలమైంది. ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకోవడానికి ఏం చేయాలన్న విషయంలో దానికి స్పష్టత లేదు. కేవలం వేదికలపై నేతలు చేతులు కలిపినంత మాత్రాన ఏ ప్రయోజనమూ ఉండదని ఫలితాలు వచ్చాకగానీ అర్ధం కాలేదు. ఎన్నికల అనంతరం రెండు పార్టీలూ కూర్చుని వైఫల్యానికి గల కారణాలు చర్చించుకుని ఉంటే వేరుగా ఉండేది.

పొత్తులో తమకు యాదవుల ఓటు బదిలీ కాలేదని మాయావతి ఆరోపిస్తున్నారు. బీఎస్‌పీ తరఫున తాము నిలబెట్టిన అభ్యర్థుల్లో 10మంది యాదవులకు మినహా దళితులతోసహా ఇతర కులాల అభ్య ర్థులెవరికీ యాదవుల ఓట్లు రాలేదని ఆమె అభియోగం. మొత్తంగా చూస్తే మహాకూటమికి జాతవ్‌ దళితులు(74 శాతం), ముస్లింలు(76 శాతం), యాదవులు(72 శాతం) గణనీయంగా ఓట్లేశారు. కానీ యాదవేతర ఓబీసీలు(72 శాతం), ఎస్టీలు(61శాతం), జాతవేతర దళితులు(57 శాతం), ఆధిపత్య కులాలు(74 శాతం), జాట్‌లు(55 శాతం) బీజేపీవైపు మొగ్గారు. అందువల్లే బీజేపీకి అధిక స్థానాలు లభించాయి.
దళితులు, ఓబీసీల్లో బీఎస్‌పీ, ఎస్‌పీ అధినేతలకు చెందిన సామాజిక వర్గాలు తప్ప మిగిలిన వారెవరూ కూటమికి ఎందుకు ఓట్లేయలేదన్న ఆత్మ పరిశీలన చేసుకుని ఉంటే చాలా అంశాలు వెలుగులోకొచ్చేవి.

సామాజిక న్యాయం పేరుతో దేశంలో నూతన రాజకీయాలకు శ్రీకారం చుట్టిన ఈ రెండు పార్టీలూ కాలక్రమంలో కుల రాజకీయాల్లో కూరుకుపోయాయి. మాయావతి తన సామా జిక వర్గానికి అందుబాటులో ఉంటారు తప్ప, దళితుల్లోని ఇతరులను పట్టించుకోరన్న అపవాదు మూటగట్టుకున్నారు. ఇటు అఖిలేష్‌పైనా ఇదే ముద్ర ఉంది. ఆయన యాదవ సామాజిక వర్గం మినహా ఓబీసీల్లో ఇతర సామాజిక వర్గాలను నిర్లక్ష్యం చేస్తారన్న విమర్శ ఉంది. దానికితోడు గెలవాలన్న ఏక సూత్ర కార్యక్రమం తప్ప మరేవిధమైన సైద్ధాంతిక ప్రాతిపదిక ఈ పార్టీలకు లేదు. ఈ లోటుపాట్లను సరిదిద్దుకోవాలన్న స్పృహ కూడా వాటికి ఉండటం లేదు. ఈ మాదిరి రాజకీయా లకు తమ మద్దతు ఉండబోదని మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు చాటిచెప్పారు. ఆ తీర్పులోని సారాంశాన్ని సక్రమంగా అవగాహన చేసుకుంటేనే విపక్షాలకు భవిష్యత్తు ఉంటుంది. లేనట్టయితే అవి క్రమేపీ కొడిగట్టడం ఖాయం. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు