సాగునీటి సవాళ్లు

3 Nov, 2016 00:26 IST|Sakshi
సాగునీటి సవాళ్లు

- ప్రాజెక్టులకు సేకరించాల్సిన భూమి ఇంకా లక్ష ఎకరాలు
- 14 వేల ఎకరాలకు రావాల్సిన అటవీ అనుమతులు
- భారీగా విద్యుత్, ఇసుక అవసరాలు
- నేడు ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్ సమీక్ష
- మైనింగ్, అటవీ, భగీరథ, భూసేకరణ, విద్యుత్ అధికారులతో భేటీ
 
 సాక్షి, హైదరాబాద్: ఇంకా లక్ష ఎకరాలకుపైగా భూసేకరణ.. 14 వేల ఎకరాలకు అటవీ అనుమతులు.. దాదాపు 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక.. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టుల అవసరాలివీ! ఈ భారీ అవసరాలు తీర్చేదెలా? ఇప్పటిదాకా పెండిం గ్‌లో ఉన్న సమస్యలేంటి? ఈ అంశాలన్నింటిపై గురువారం నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు. భూసేకరణ, పరిహారం, అటవీ అనుమతులు, విద్యుత్ చార్జీల చెల్లింపు అంశాలపై చర్చించనున్నారు. రెవెన్యూ, అటవీ, ట్రాన్స్‌కో, మిషన్ భగీరథ, మైనింగ్ అధికారులు ఇందులో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 వరకు శాఖల వారీగా సమీక్ష చేయనున్నారు.

 సమన్వయమే అసలు సమస్య
 రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ప్రాజెక్టులకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తోంది. మొత్తం 32 భారీ, మధ్య తరహా ప్రాజెక్టు పనులకు రూ.95,717 కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకోగా.. ఇందులో ఇప్పటివరకు రూ.35,416 కోట్లు ఖర్చయ్యాయి. అందులో 2004లో చేపట్టిన ప్రాజెక్టుల కింద 29.19 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం ఉంది. అందులో ఇప్పటివరకు 8 నుంచి 9 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే సాగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్ భీమా, కోయిల్‌సాగర్, నల్లగొండలోని ఏఎమ్మార్పీ, వరంగల్‌లోని దేవాదుల, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండలకు సాగునీరు ఇచ్చే ఎస్సారెస్పీ-2, వరద కాలువ, కరీంనగర్‌లోని ఎల్లంపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలు 80 శాతం పూర్తయ్యాయి. అయితే భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యల కారణంగా పూర్తి ఆయకట్టుకు నీరివ్వలేకపోతున్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయ లేమితో ఈ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులను సైతం భూసేకరణ సమస్య వేధిస్తోంది. కాళేశ్వరం కింద వచ్చే ఏడాది డిసెంబర్ నాటికే నీళ్లివ్వాలంటే ఇంకా 45 వేల ఎకరాల భూమి సేకరించాలి. పాలమూరులో భూసేకరణ జాప్యంతో పనులు కదలడం లేదు.

 అటవీ అనుమతులేవి?
 రాష్ట్రంలో 8 ప్రాజెక్టుల పరిధిలో అటవీ భూముల సమస్య నెలకొంది. ఈ ప్రాజెక్టుల కింద 14,331 ఎకరాలకు అటవీ అనుమతులు పొందాల్సి ఉంది. ఇందులో దేవాదుల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ వంటి ప్రాజెక్టులు దాదాపు ఎనిమిదేళ్ల కిందటే మొదలుపెట్టినా.. ఇంతవరకు అనుమతులు లభించలేదు. చాలా ప్రాజెక్టుల పరిధిలో డీజీపీఎస్ సర్వే పూర్తి కాకపోవడం, అటవీ భూమికి సమానమైన భూమిని చూపకపోవడం, కొన్నిచోట్ల ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచే ప్రతిపాదనలు రాకపోవడం, మరికొన్ని చోట్ల ప్రత్యామ్నాయంగా చూపిన భూమి ఇదివరకే ప్రభుత్వం ఇతరులకు కట్టబెట్టి పట్టాలివ్వడం వంటి  సమస్యలున్నాయి. దీంతో ఆ ప్రాజెక్టులు ముందుకు కదలడం లేదు. ఇక ప్రాజెక్టుల నిర్మాణానికి ఇసుక అవసరాలు ఏకంగా 1.87 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర ఉన్నాయి. ఈ మేరకు ఇసుక అనుమతులు పొందడానికి తంటాలు పడాల్సి వస్తోంది. దీంతో ఇటీవలే మైనింగ్ శాఖ నేరుగా నీటి పారుదల శాఖే ఇసుకను తీసుకునే వెసులుబాటు ఇచ్చింది.








 

మరిన్ని వార్తలు