ఏజీని నియమించకపోవడం రాజ్యాంగ విరుద్ధం

7 Aug, 2018 01:59 IST|Sakshi

హైకోర్టులో కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి పిల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) పోస్టు భర్తీకి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఏజీ పోస్టును వెంటనే భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిల్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ బి.రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఏజీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కాదని, ఏజీ పోస్టు రాజ్యాంగ పదవని, అటువంటి పదవిని భర్తీ చేసే విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని శశిధర్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఏజీ రాజ్యాంగ నిబంధనలకు లోబడి న్యాయపరమైన సలహాలిస్తుంటారని వివరించారు. తమకు కావాల్సిన రీతిలో విధులు నిర్వర్తించాలని ఏజీని గవర్నర్‌ లేదా రాష్ట్ర ప్రభుత్వం కోరలేదని తెలిపారు. రాజ్యాంగంలోని అధికరణ 177 ప్రకారం శాసనసభ, శాసనమండలిలో మంత్రితో సమాన స్థానం ఏజీకి ఉందని.. ఏజీ విధులను ఇతరులు నిర్వర్తించడానికి వీల్లేదని తెలిపారు. ఏజీని నియమించకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, తక్షణమే భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వ్యాజ్యంలో కోరారు.

మరిన్ని వార్తలు