జోసెఫ్‌ సీనియార్టీపై అసంతృప్తి | Sakshi
Sakshi News home page

జోసెఫ్‌ సీనియార్టీపై అసంతృప్తి

Published Tue, Aug 7 2018 1:57 AM

Supreme Court judges unhappy as Centre lowers Justice KM Joseph's seniority - Sakshi

న్యూఢిల్లీ: జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ సీనియారిటీని తగ్గించడంపై సుప్రీంకోర్టు జడ్జీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మిశ్రాను కలిసి తమ నిరసన తెలియజేశారు. మంగళవారం జస్టిస్‌ జోసెఫ్‌తోపాటు జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ వినీత్‌ సరన్‌లు బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో ఈ నిరసన వ్యక్తమైంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం యథావిధిగా జరపాలని, సీనియర్‌ జడ్జి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌తో మాట్లాడాక నిర్ణయం తీసుకుందామని సీజేఐ హామీ ఇచ్చినట్లు తెలిసింది. సీజేఐని కలిసి నిరసన తెలిపిన వారిలో కొలీజియంలోని ఇద్దరు సీనియర్‌ జడ్జీలు జస్టిస్‌ మదన్‌ బీ లోకుర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్, జస్టిస్‌ ఏకే సిక్రీ ఉన్నారు.  

కేంద్ర నోటిఫికేషనే ఫైనల్‌!
కేంద్రం శుక్రవారం ముగ్గురు జడ్జీల పేర్లతో విడుదల చేసిన నియామకపు నోటిఫికేషన్‌లో జస్టిస్‌ జోసెఫ్‌ పేరును ప్రకటించినప్పటికీ ఆయన సీనియారిటీని తగ్గిస్తూ మూడోస్థానంలో పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు సీజే జస్టిస్‌ వినీత్‌ సరన్‌ల తర్వాత మూడో స్థానంలో ఉత్తరాఖండ్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ పేరును పేర్కొంది. దీనిని రాష్ట్రపతి ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జడ్జీల వరుస క్రమం ఆధారంగానే సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు.

జనవరి 10న కొలీజియం సీనియర్‌ న్యాయవాది ఇందు మల్హోత్రాతోపాటుగా జస్టిస్‌ జోసెఫ్‌ పేరును సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రతిపాదించింది. అయితే, ఇందు మల్హోత్రా పేరును అంగీకరించిన కేంద్రం.. జోసెఫ్‌ పేరును తిరస్కరించింది. మే 16న మరోసారి కొలీజియం జస్టిస్‌ జోసెఫ్‌ పేరును ప్రతిపాదనల్లో పెట్టింది. జూలైలో దీన్ని కూడా కేంద్రం తిరస్కరించింది. శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో జోసెఫ్‌ పేరును పేర్కొనడంతో కొలీజియం, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదానికి తెరపడ్డట్లేనని అర్థమవుతోంది.  

షెడ్యూల్‌ ప్రకారమే బాధ్యతల స్వీకరణ
ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ బాధ్యతల స్వీకరణ మంగళవారం జరగనుంది. కేంద్రం నోటిఫికేషన్‌ విడుదల చేయడం, రాష్ట్రపతి ఆమోదం అయిపోయిన తర్వాత ఈ దశలో ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని కోర్టు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.  

ఆలిండియా జాబితాలో జోసెఫ్ః39
‘హైకోర్టు జడ్జీల ఆలిండియా సీనియారిటీ లెక్కల్లో జస్టిస్‌ బెనర్జీ 4వ స్థానంలో, జస్టిస్‌ సరన్‌ 5వ స్థానంలో, జస్టిస్‌ జోసెఫ్‌ 39వ స్థానంలో ఉన్నారు’ అని న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ముగ్గురు జడ్జీలూ సీజేఐ కాలేరని.. ఎందుకంటే ఇప్పటికే సుప్రీం జడ్జీలుగా ఉన్న వారు వీరికంటే సీనియర్లని తెలిపాయి. ఈ ముగ్గురిలో జస్టిస్‌ జోసెఫ్‌ 2023లో రిటైరవుతుండగా.. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నవంబర్‌ 2024 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉంటారన్నాయి. అప్పటికి ఆయనే సీజేఐగా ఉండొచ్చన్నాయి. కాగా, సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తలచుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, జాబితాను మార్చేందుకు వీలుందని మాజీ సీజేఐ జస్టిస్‌ లోధా పేర్కొన్నారు. అయితే, కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ స్వాగతించారు. హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న సీనియారిటీ ఆధారంగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సీనియారిటీని పొందుతారని ఆయన వ్యాఖ్యానించారు.

నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్‌: కేంద్రం
జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ సీనియారిటీని తగ్గించారంటూ నెలకొన్న వివాదంపై కేంద్రం స్పందించింది. నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్‌లో సీనియారిటీ (హైకోర్టు సీనియారిటీ ఆధారంగా) నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ సరన్‌లతో పోలిస్తే జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ రెండేళ్లు జూనియర్‌ కాబట్టే ఆయన్ను సీనియారిటీలో మూడోస్థానం కల్పించినట్లు పేర్కొంది. జస్టిస్‌ జోసెఫ్‌ 2004 అక్టోబర్‌ 14న హైకోర్టు న్యాయమూర్తిగా.. 2014, జూలై 31న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన 2023 జూన్‌ 16న రిటైరవుతారు.

జస్టిస్‌ ఇందిరా బెనర్జీ 2002, ఫిబ్రవరి 5న హైకోర్టు జడ్జిగా 2017, ఏప్రిల్‌ 5న హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పదోన్నతి పొందారు. ఈమె 2022, సెప్టెంబర్‌ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైరవుతారు. జస్టిస్‌ సరన్‌ 2002, ఫిబ్రవరి 14న హైకోర్టు న్యాయమూర్తిగా, 2016 ఫిబ్రవరి 26న ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2022, మే 10న ఈయన పదవీ విరమణ చేస్తారు. జోసెఫ్‌తో పోలిస్తే మిగిలిన ఇద్దరు రెండేళ్ల ముందుగానే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన అంశాన్ని కేంద్రం ప్రాతిపదికగా తీసుకుంది.  

Advertisement
Advertisement