జాదవ్‌.. ఓ గ్రీన్‌ చాలెంజ్‌

9 Aug, 2018 01:38 IST|Sakshi

గ్రీన్‌ చాలెంజ్‌..ఈ మధ్య దీనికి బాగా క్రేజ్‌ పెరిగింది.. మూడు మొక్కలు నాటడం.. సెల్ఫీ తీసుకుని పోస్ట్‌ చేయడం..   అస్సాంకు చెందిన జాదవ్‌ పాయెంగ్‌ కూడా గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించాడు.. మొక్కలు నాటాడు. కానీ సెల్ఫీ తీద్దామంటేనే ఫోన్‌లో రావడం లేదు.. ఇందుకోసం హెలికాప్టర్‌నే తేవాల్సి వచ్చింది..  ఎందుకో తెలుసా? అతడు నాటింది మొక్కలను కాదు.. ఏకంగా ఓ అడవిని..

1979.. అస్సాంలోని మాజులీ ద్వీపం.. బ్రహ్మపుత్ర నది వరుస వరదల వల్ల తరచూ భూమి కోతకు గురయ్యేది. దీనికితోడు అడపాదడపా కరువు కూడా.. తాను పుట్టిన నేలను కాపాడుకోవాలని 16 ఏళ్ల జాదవ్‌ అప్పుడే నిర్ణయించుకున్నాడు. ప్రకృతి విసిరిన సవాలును స్వీకరించాడు.. పచ్చదనమంటూ లేని ప్రాంతంలో రోజుకొక మొక్క నాటాడు. అలాఅలా.. మొక్కంటూ మొలవని నేలపై ఓ అడవి ఆవిష్కృతమైంది. 1,360 ఎకరాల్లో విస్తరించింది. పులులు, ఏనుగులు వంటి ఎన్నో రకాల వన్యప్రాణులకు నివాస కేంద్రమైంది.  

2007 వరకూ..
మీకో విషయం తెలుసా? జాదవ్‌ ఓ వనాన్నే సృష్టించాడన్న విషయం 2007 వరకు బయటి ప్రపంచానికి తెలియదు.. ఓ రోజున ఫొటోజర్నలిస్ట్‌ జీతూ కలితా అనుకోకుండా ఈ ప్రాంతానికి రావడంతో ఈ విషయం బయటపడింది. వాళ్లు కలవడమే చాలా చిత్రంగా జరిగిందట. ‘‘పక్షుల ఫొటోలు తీయడానికి ఓ బోటు తీసుకుని.. బ్రహ్మపుత్ర నదిలో వెళ్తున్నా. మాజులీ ద్వీపం వద్దకు రాగానే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

నా కళ్లను నేనే నమ్మలేకపోయాను.. మొక్క మొలకెత్తడానికే సందేహించే ఈ నేలపై పచ్చని అడవి’అని జీతూ నాటి సంఘటనను గుర్తు చేస్తున్నారు. ఇక జాదవ్‌ అయితే.. ఎవరూ రాని ఆ ప్రదేశానికి జీతూ రావడంతో వన్యప్రాణుల వేటగాడు అని అనుకున్నాడట. ఈ సందర్భంగా జాదవ్‌ భగీరథ యత్నం గురించి తెలుసుకున్న జీతూకు నోట మాట రాలేదు. కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. జాదవ్‌ గొప్పతనాన్ని తన కథనం ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. ఒక్క వ్యక్తి తలుచుకుంటే ఏం చేయగలడన్న దానికి ఉదాహరణ జాదవేనని చెబుతారు.  

తొలి మొక్క ఇప్పటికీ జ్ఞాపకమే..
జాదవ్‌కు తాను మొదటిసారి నాటిన మొక్క ఎక్కడుందో కూడా తెలుసు.. ఓ మహారణ్యానికి బీజం వేసిన ఆ వృక్షం వద్దకు రోజుకు ఒక్కసారైనా వెళ్లి.. సేదతీరుతాడు.. నీవు లేనిదే నేను లేను అంటాడు.. ఉదయం 3 గంటలకు నిద్రలేవగానే.. తన వనం వద్దకు వెళ్తాడు. మొక్కలు నాటే పనిలో మునిగిపోతాడు. సమీప గ్రామాల్లో పాలు అమ్మి.. జీవనం కొనసాగించే జాదవ్‌ నిజంగా హరిత సంపన్నుడే. ఇతడి కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

సమీప వనాల నుంచి ఏనుగులు, పులులు వంటివి జాదవ్‌ సృష్టించిన అడవికి వస్తూ పోతుంటాయట. అంతేకాదు.. జాదవ్‌కు అప్పుడప్పుడు వన్యప్రాణి వేటగాళ్లు, కలప అక్రమ రవాణాదారుల నుంచి బెదిరింపులు కూడా వస్తుంటాయి.. అయినా.. మనోడు వెనకడుగు వేయడు. తన చివరి శ్వాస వరకూ మొక్కలు నాటుతునే ఉంటానని.. వాటిని అనుక్షణం కాపాడుతునే ఉంటానని చెబుతాడు.. ఓ అడవినే సృష్టించానని అతడు అక్కడితో ఆగిపోలేదు.. మరో గ్రీన్‌ చాలెంజ్‌కు సిద్ధమయ్యాడు.. ఆ అడవిని 5 వేల ఎకరాలకు విస్తరిస్తాడట..  

అదిగో బయలుదేరాడు జాదవ్‌.. మరో మహాకార్యానికి బీజం వేయడానికి.. మరో మహారణ్యమై మొలకెత్తడానికి..


1979లో తాను తొలిసారిగా నాటిన మొక్క వద్ద జాదవ్‌. (ఇన్‌సెట్‌లో) ఇలాంటి భూముల్నే జాదవ్‌ అడవిలా మార్చాడు.

– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు