మంత్రివర్గంలో మహిళలెందరు..?

28 May, 2014 01:07 IST|Sakshi
మంత్రివర్గంలో మహిళలెందరు..?

గెలిచిన ఎమ్మెల్యేల్లో ఆరుగురు మహిళలు  కేసీఆర్ కూర్పుపై ఆసక్తి..
 
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్‌లో ఎంతమంది మహిళలు ఉంటారు? ఏయే జిల్లాల నుంచి మహిళలకు ప్రాతినిధ్యం దక్కనుంది? కేసీఆర్ మదిలో ఏముంది? అన్నది ప్రస్తుతం ఆ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలు, నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన 63 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు మహిళలున్నారు. రేఖానాయక్(ఖానాపూర్), కోవ లక్ష్మి (ఆసిఫాబాద్), బొడిగె శోభ(చొప్పదండి), పద్మా దేవేందర్‌రెడ్డి(మెదక్). గొంగిడి సునీత(ఆలేరు), కొండా సురేఖ(వరంగల్ తూర్పు)లు టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వీరిలో ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కనుందనే విషయమై పార్టీ శ్రేణులకూ అంతుచిక్కడం లేదు.

గతంలో పనిచేసిన అనుభవం, సామాజికవర్గం, జిల్లాల మధ్య సమతూకం, జిల్లాల్లోని రాజకీయ వర్గాల మధ్య సమన్వయం, విధేయత వంటివాటిని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముంది. రెండు లేదా అంతకన్నా ఎక్కువసార్లు ఎన్నికైనవారిలో కొండా సురేఖ, పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు. గొంగిడి సునీత, బొడిగె శోభ, కోవా లక్ష్మి, రేఖా నాయక్ అసెంబ్లీలో తొలిసారి అడుగుపెడుతున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన కొండా సురేఖకు అవకాశం ఇవ్వాలంటే వరంగల్ జిల్లాలో సీనియర్లు ఎక్కువమంది మంత్రివర్గంలో బెర్త్ కోసం పోటీ పడుతున్నారు.

చందూలాల్, డాక్టర్ టి.రాజయ్య, మధుసూదనాచారి, దాస్యం వినయ్ భాస్కర్ పోటీలో ఉన్నారు. వీరిలో చందూలాల్‌కు తప్పనిసరిగా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. బీసీ వర్గాలకే చెందిన వినయ్‌భాస్కర్ , మధుసూదనాచారి కూడా మంత్రి వర్గంలో బెర్త్ కోసం పోటీ పడుతుండగా, కొండా సురేఖకు అవకాశం దక్కుతుందా? లేదా అనేది ఆ పార్టీలో ఉత్కంఠను కలిగిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ మెదక్ జిల్లాలోని గజ్వేల్ నుంచి, ఆయన మేనల్లుడు టి.హరీశ్‌రావు సిద్దిపేట నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ముఖ్యమంత్రిగా కేసీఆర్, ముఖ్యమైన పోర్టుఫోలియోలోనే హరీశ్‌రావు ఒకే రెవెన్యూ డివిజన్ నుంచి మంత్రివర్గంలో ఉంటున్నారు. అందువల్ల మరో రెవెన్యూ డివిజన్‌కు చెందిన పద్మా దేవేంద ర్ రెడ్డికి అవకాశం ఉండొచ్చునని పార్టీ ముఖ్యులు అంచనా వేస్తున్నారు. నల్లగొండ జిల్లా నుంచి జి.జగదీశ్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఖాయమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ జిల్లా నుంచి ఒకవేళ మరొకరికి కేబినెట్‌లో అవకాశం కల్పిస్తే జిల్లాలో మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో గొంగిడి సునీతకే చోటు దక్కనుంది.

ఆదిలాబాద్‌లో ఇద్దరూ కొత్తవారే అయినా రేఖానాయక్, కోవా లక్ష్మిలో ఒకరికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈటెల, కొప్పుల ఈశ్వర్, కేటీఆర్‌కు కేబినెట్‌లో చోటు ఖాయమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ జిల్లా నుంచి మరొకరికి అవకాశం అనుమానమేనని తెలుస్తోంది. ఇదే జరిగితే మంత్రి వర్గంలో బొడిగె శోభకు స్థానం లేనట్టే.

>
మరిన్ని వార్తలు