కిట్‌.. కట్‌..! 

30 Jan, 2019 10:56 IST|Sakshi

సాక్షి, యాదాద్రి : రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో ఒక్కటైన కేసీఆర్‌ కిట్‌ జిల్లాలో కొంతకాలంగా ఆగిపోయింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ పథకం ద్వారా చేకూరే లబ్ధి అక్టోబర్‌ నుంచి నిలిచిపోయింది. జిల్లాలోని భువనగిరి, రామన్నపేట ఏరియా ఆస్పత్రులు, చౌటుప్పల్, ఆలేరు సీహెచ్‌సీల్లో కాన్పులు జరిగిన వారికి కేసీఆర్‌ కిట్లు ఇస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడంతోపాటు తల్లీబిడ్డల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా కేసీఆర్‌ కిట్‌ను సీఎం కేసీఆర్‌ 2017 జూన్‌ 2న ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ప్రవేశపెట్టిన ఈపథకంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే రెండు నెలలుగా కేసీఆర్‌ కిట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో లేవు. దీంతో ప్రసవం అయిన వెంటనే ఇవ్వాల్సిన కిట్‌ ఇవ్వకపోవడంతో బాలింతలు, శిశువుల కోసం బహిరంగ మార్కెట్‌లో వస్తువులను కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈవిషయంలో స్టాక్‌ లేదని వచ్చిన తర్వాత ఇస్తామని అధికారులు చెబుతున్నారు.

అందని నగదు సాయం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకున్న వారికి కేసీఆర్‌ కిట్‌లతో పాటు  మూడు నెలలుగా ఆర్థిక సాయం అందడం లేదు. అమ్మఒడి పథకంలో భాగంగా ఇస్తున్న మొత్తం కూడా అందడం లేదు. మూడు విడతల్లో ఇచ్చే మొత్తం నిలిచిపోయింది. ఆడపిల్ల పుడితే రూ.13,000, మగ పిల్లవాడు పుడితే రూ.12,000 అమ్మ ఒడి పథకంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. కానీ నిధుల లేమి కారణంగా ఆర్థిక సహాయం కూడాఆగిపోయింది.

పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల వివరాలు
అక్టోబర్‌లో 255, నవంబర్‌లో 232, డిసెంబర్‌లో 262, జనవరిలో 221 ప్రసవాలు జరిగినా డబ్బులు రాలేదు. డిసెంబర్‌ నుంచి జనవరి వరకు సుమారు 292 మందికి కేసీఆర్‌ కిట్లు అందలేదు.
కేసీఆర్‌ కిట్‌లో ఇచ్చే వస్తువులుతల్లి, పిల్లల సంరక్షణకు సబ్బు, బేబీ బేడ్‌షీట్, బేబీ ఆయిల్, దోమ తెర, తల్లిచీర, బ్యాగ్, టవల్, నేప్కిన్లు, బేబీ డ్రెస్, బేబీ పౌడర్, డ్రైపర్స్, షాంపో, ఆట బొమ్మలు. 

కేసీఆర్‌ కిట్‌ ఇవ్వలేదు
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం జరిగితే కేసీఆర్‌ కిట్‌ ఇవ్వలేదు. ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఇక్కడి వచ్చాం. కానీ, ప్రసవం జరిగిన మూడు రోజులైనా కేసీఆర్‌ కిట్‌ ఇవ్వలేదు. ప్రసవం అయిన వెంటనే ఇవ్వాల్సిన వస్తువులు కూడా అందకపోవడంతో బయట నుంచి కొనుగోలు చేస్తున్నాం. బహిరంగ మార్కెట్‌లో వస్తువుల ధర ఎక్కువగా ఉంది. స్టాక్‌ లేదని చెబుతున్నారు. –ప్రియాంక, చౌళ్లరామారం, అడ్డగూడూరు మండలం

ప్రభుత్వానికి ఇండెంట్‌ పంపాం
అమ్మ ఒడి, కేసీఆర్‌ కిట్‌ పథకాల్లో భాగంగా రావాల్సిన నగదు, కిట్లు కొంతకాలంగా నిలిచిపోయాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగిన వెంటనే లబ్ధిదారులకు కేసీఆర్‌ కిట్లతోపాటు ఆర్థిక సాయం అందజేయాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల ఆలస్యమవుతుంది. ప్రతిరోజూ ప్రభుత్వానికి ఇండెంట్‌ పంపిస్తున్నాం. కిట్లు రాగానే  లబ్ధిదారులందరికీ అందజేస్తాం. –డాక్టర్‌ కోట్యానాయక్, డీసీహెచ్‌ఎస్‌

మరిన్ని వార్తలు