మాట తప్పుతారా

6 Jun, 2014 03:51 IST|Sakshi
మాట తప్పుతారా

ఉద్యమ పార్టీగా ఎన్నో ఆందోళనలు చేసి, ప్రజల ఆకాంక్షకు అద్దంలా నిలిచిన టీఆర్‌ఎస్.. అధికార పార్టీగా మారిన తర్వాత ఆ ప్రజల నుంచే నిరసనలను ఎదుర్కొంటోంది. పంట రుణాల మాఫీపై నిబంధనలను విధించడాన్ని నిరసిస్తూ అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. ఇచ్చిన హామీ అమలులో వెనుకంజ వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా అంతటా నిరసనలు కొనసాగాయి. మంథనిలో టీఆర్‌ఎస్ నేతలే పార్టీ జెండా గద్దెను కూల్చేయడం గమనార్హం. రుణాల మాఫీకి ఎలాంటి నిబంధనలు పెట్టవద్దని, పంట రుణాలన్నింటినీ మాఫీ చేయాలని కర్షకులు విజ్ఞప్తి చేశారు.
 
 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ / న్యూస్‌లైన్, నిజాంసాగర్: 2013 ఖరీఫ్, రబీ సీజన్లలో తీసుకున్న పంటరుణాలకే రుణ మాఫీ పథకాన్ని వర్తింప చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఇందూరు రైతులు ఆందోళన బాట పట్టారు. జిల్లా అంతటా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిబంధనలను సాకుగా చూపి రైతులకు అన్యాయం చేయవద్దని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోవాలని ప్రతిపక్ష పార్టీల నేతలు ధర్మపురి శ్రీనివాస్, పల్లె గంగారెడ్డి, వీజీ గౌడ్‌లు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. పంటరుణాల మాఫీపై రైతులు ఆందోళన చెందవద్దని, రుణమాఫీపై ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.
 
కట్టలు తెంచుకున్న కర్షకుల ఆగ్రహం
రుణమాఫీలో నిబంధనలు వద్దంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్మూర్ మండలంలోని మంథనిలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ జెండా గద్దెను కూల్చి వేసి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంథని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రైతులు సమావేశమై ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల రైతుల ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్‌లో రాస్తారోకో చేయాలని తీర్మానించారు. అన్ని గ్రామాభివృద్ధి కమిటీలకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

 జుక్కల్, నిజాంసాగర్ మండలాల్లో రైతులు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ధర్పల్లి, వేల్పూరు మండలం మోతె, జాన్కంపేట్‌లలో సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టారు. కామారెడ్డి నియోజకవర్గంలో పలు చోట్ల రాస్తారోకోలు చేశారు. గాంధారి మండలం మాతుసంగెం గ్రామంలో గ్రామస్తులు టీఆర్‌ఎస్ గద్దెను కూల్చేశారు.
 
  సిరికొండ, కమ్మర్‌పల్లిలలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. ఎల్లారెడ్డి, తాడ్వాయి మండలాల్లో ధర్నాకు దిగారు. రెంజల్ మండలంలోని దూపల్లిలో కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. నీల, తాడ్‌బిలోలి, రెంజల్ గ్రామాల రైతులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అందరికీ రుణమాఫీ పథకాన్ని వర్తింప చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
 
 మోర్తాడ్‌లో పంట రుణాల మాఫీ విషయంలో కేసీఆర్ తీరుకు నిరసనగా రైతులు ఆందోళన చేశారు. ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా వెంటనే పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భిక్కనూరు, దోమకొండ, లింగంపల్లిలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు