కుంగదీసిన కలహాలు

25 Nov, 2014 03:59 IST|Sakshi
కుంగదీసిన కలహాలు

తిమ్మాజీపేట: ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికితోడు తాగొచ్చిన భర్త నిత్యం గొడవ పడుతున్నాడు. మనస్తాపానికి గురైన ఓ ఇల్లాలు తనతో పాటు తన ముగ్గురు పిల్లలపై కిరోసిన్‌పోసి నిప్పంటించి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ సంఘటన సోమవారం మండలంలోని మరికల్‌లో చోటుచేసుకుంది. బాధితురాలు, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గొల్ల భీమమ్మను కొడంగల్ చెందిన బాల్‌రాజుకు ఇచ్చి వివాహం చేశారు.

కొద్దికాలం తర్వాత భీమమ్మ(28) తన భర్తతోపాటు మరికల్ గ్రామానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త వికలాంగుడు కావడంతో అన్నింటికీ తానై కుటుంబాన్ని పోషిస్తోంది. భర్త అడపాదడపా మేస్త్రీ పనికి వెళ్లి కుటుంబానికి ఆసరా ఉంటున్నాడు. వీరికి నందిని, విజయలక్ష్మి, శ్రీలక్ష్మి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారి పోషణ భారంగా మారింది. దీనికితోడు భర్త బాల్‌రాజు తరుచూ మద్యం తాగొస్తూ ఇంట్లో గొడవకు దిగుతున్నాడు. ఈ క్రమంలో మరోవారు ఆదివారం రాత్రి భర్త తాగొచ్చాడు.

ఇలా తాగితే బతుకుదెరువు ఎట్టా? అని అతనితో వాదనకు దిగింది. పూట గడవక రోజూ ఇబ్బందులు పడుతున్నాం.. ఇలా అయితే ఎలాగని భర్తతో గొడవకు దిగింది. మనస్తాపానికి గురైన భీమమ్మ భర్త ముందే కిరోసిన్ డబ్బా తీసుకుని తన ఒంటిపై పోసుకుంది. అక్కడే ఉన్న కూతుళ్లపై కూడా పోసి నిప్పంటించింది. పెద్ద కూతురు నందిని మంటలతోనే గడియ తీయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను ఆర్పివేశారు.

ఈ ఘటనలో భీమమ్మతో పాటు కూతుళ్లు నందిని, జయలక్ష్మి, శ్రీలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. భర్త బాలరాజుకు మంటలు అంటుకోవడంతో కొద్దిపాటి గాయాలయ్యాయి. చికిత్సకోసం వీరిని జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైనవైద్యం కోసం మహబూబ్‌నగర్‌లోని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో భీమమ్మ చిన్నకూతురు శ్రీలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది.

 బాధితులకు మెరుగైన వైద్యం
 పాలమూరు: జిల్లా ఆస్పత్రిలో బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శామ్యూల్ వివరిస్తూ.. భీమమ్మకు 45 శాతం శరీరం కాలిందని, ఆమె పెద్దకూతురు నందిని, చిన్న కూతురు శ్రీలక్ష్మి శరీరం 40శాతం కాలిందని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. వారంరోజుల తర్వాత వీరి ఆరోగ్యపరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు. వీరికి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. 

మరిన్ని వార్తలు