ఇనుప కంచెలో చిక్కిన చిరుత

29 May, 2020 01:45 IST|Sakshi
మర్రిగూడ సీఐ శ్రీనివాస్‌రెడ్డి పైకి దూసుకొస్తున్న చిరుత 

ఆరు గంటల పాటు శ్రమించి పట్టుకున్న అధికారులు

పట్టుకునే క్రమంలో ఇద్దరిపై చిరుత దాడి.. స్వల్ప గాయాలు

నల్లగొండ జిల్లా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి

చండూరు/ బహదూర్‌పురా (హైదరాబాద్‌): నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం రాజుపేట తండా సమీపంలో ఓ చిరుతపులి అధికారులను హడలెత్తించింది. తోట చుట్టూ ఉన్న ఇనుప కంచె లో చిక్కుకున్న ఈ చిరుతను బంధించేందుకు అటవీ, పోలీసు శాఖ సిబ్బంది హైరానా పడాల్సి వచ్చింది. ఆరు గంటలపాటు కష్టపడి దానిని పట్టు కున్నా.. హైదరాబాద్‌ తీసుకెళుతుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. రాజుపేట తండా సమీపంలో ఓ రైతు తన తోట చుట్టూ ఇనుప ఫెన్సింగ్‌ వేశారు. గురువారం తెల్లవారుజామున నల్లమల అటవీప్రాంతం నుంచి వచ్చిన చిరుత.. పరిసర ప్రాంతంలో ఓ గొర్రెను తిని తోట దగ్గరకు చేరుకున్న సమయంలో ఫెన్సింగ్‌లో కాలు పడటంతో అందులో చిక్కుకుపోయింది.

ఉదయం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అయితే మత్తు మం దు ఇచ్చే ప్రయత్నంలో చిరుత ఫెన్సింగ్‌ నుంచి తప్పించుకుని సిబ్బందిపై దాడి చేసింది. ఈ ఘట నలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. అనంతరం చెట్ల పొదల్లోకి దూరింది. కాగా, మత్తు మందు ప్రయోగించే ఆయుధం సరిగా పనిచేయలేదని తెలుస్తోంది. చిరుతకు ఏడు సార్లు మత్తు మందు ఇచ్చేందుకు ఆయుధాన్ని వాడగా వారి ప్రయత్నా లు ఫలించలేదు. చివరికి 8వ సారి వాహనం దగ్గర చిరుత పడిపోవడంతో దగ్గరగా వెళ్లి మత్తు మందు ఇవ్వడంతో అది స్పృహ కోల్పోయింది. అనంతరం దానిని బోనులో బంధించారు. అయితే, చిరుతను బంధించే క్రమంలో మర్రిగూడ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. చిరుతను పట్టుకునే క్రమంలో ఒక్కసారిగా అది సీఐ మీదకు దూసు కొచ్చింది. వెంటనే ఆయన పక్కనే ఉన్న జీపు పైకి ఎక్కడంతో అది పక్కనుంచి వెళ్లిపోయింది.

హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి  
చిరుతను బంధించిన అనంతరం హైదరాబాద్‌లో ని జూకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయి నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. కాళ్లు ఇనుప ఫెన్సింగ్‌లో ఇరుక్కుపోవడంవల్ల ఏర్పడిన గాయాలకు తోడు అడవిలో అటూ ఇటూ పరుగెత్తడంవల్ల చిరుతకు గాయాలైనట్లు తెలిసింది. జూ ఆసుపత్రిలో జూపార్కు వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.ఎ.హకీం, విశ్రాంత డాక్టర్‌ నవీన్‌ కుమార్, జూ వెటర్నరీ అసిస్టెంట్‌ వైద్యులు శంభులింగం, కోటి నాడుతో పాటు వీబీఆర్‌ఐ డాక్టర్లు చిరుతపులి కళేభరానికి పోస్టుమార్టం నిర్వహించారు. గాయాల వల్ల రక్తస్రావం, షాక్, అక్సెషియా (ఉక్కిరిబిక్కిరి) తదితర కారణాలవల్ల చిరుత మృతి చెందినట్లు జూ వెటర్నరీ వైద్యులు తెలిపారు. మృతి చెందిన చిరుతపులి నమూనాలను సేకరించి బీవీఆర్‌ఐకు పంపించామని జూపార్కు క్యూరేటర్‌ క్షితిజా తెలిపారు.

మరిన్ని వార్తలు