పెద్దలకు చెప్పలేక.. ప్రేమను చంపుకోలేక..

22 Apr, 2017 07:18 IST|Sakshi
పెద్దలకు చెప్పలేక.. ప్రేమను చంపుకోలేక..

► ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
► చావుబతుకులతో పోరాటం

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ఒకరంటే ఒకరికి ఇష్టం.. మతాలు వేరైనా మనసులు ఒక్కటయ్యాయి.. ఒకరికొకరు ప్రేమించుకుని పెళ్లిచేసుకుందామనుకున్నారు.. విషయాన్ని పెద్దలకు చెప్పలేకపోయారు. ప్రేమను చంపుకోలేక మదనపడ్డారు. కనీసం చావుతోనైనా ఒకటవుదామనుకున్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారంలో శుక్రవారం వేకువజామున జరిగింది.

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వొల్లాల రవి(26), అదే గ్రామానికి ఎండీ సమ్రీన్‌(20) ప్రేమించుకుంటున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన ఓ విందులో రవి తన స్నేహితులతో పాల్గొన్నాడు. ఈ విందులో స్నేహితులు.. రవి ప్రేమ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇద్దరి మతాలు వేరుకావడంతో వివాహానికి రెండు కుటుంబాలు ఒప్పుకోరని చెప్పారు. ఇదేవిషయాన్ని రవి, సమ్రీన్‌తో చర్చించాడు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోతే చావే పరిష్కారమని నిర్ణయించుకున్నారు.

తొలుత సమ్రీన్‌ తన ఇంట్లో శుక్రవారం వేకువజామున 3 గంటలకు పురుగుల మందు తాగింది. అదే సమయంలో రవి తన వ్యవసాయబావి వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన ఇరువురి కుటుంబసభ్యులు వారిని కరీంనగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించారు. వారిద్దరూ ప్రస్తుతం ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎస్సై లక్ష్మారెడ్డి ఆస్పత్రికి చేరుకుని ఇద్దరితో మాట్లాడారు. ఆత్మహత్యా యత్నాకి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు