ఆబ్కారీ బోణీ రూ.80.26 కోట్లు

18 Oct, 2019 10:14 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : నూతన ఎక్సైజ్‌ పాలసీ అమలులోకి రాకముందే ఆబ్కారీ శాఖ గణమైన బోణీ కొట్టింది. 2019–21 కింద రెండేళ్ల కాలానికి మద్యం దుకాణాల(ఏ–4 షాప్స్‌) నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానించగా, ఉమ్మడి జిల్లాలోని 266 దుకాణాలకు ఏకంగా 4,013 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుం రూపంలోనే ఎక్సైజ్‌ శాఖ ఏకంగా రూ.80.26 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఉమ్మడి జిల్లాలో ఒక్కో దుకాణానికి సగటున 15.01 దరఖాస్తులు అందగా, జగిత్యాల జిల్లాలో పోటీపడ్డ వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మద్యం దుకాణాలు ఏర్పాటుకు వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. 2019–21 సంవత్సరాల కోసం(రెండేళ్ల పాటు) మద్యం దుకాణాల లైసెన్స్‌ కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉమ్మడి జిల్లాలో దరఖాస్తు చేసుకు న్నారు. దరఖాస్తుల దాఖలుకు బుధవారంతో గడువు ముగియగా, అర్ధరాత్రి వరకు దరఖాస్తులను స్వీకరించారు. శుక్రవారం ఆయా జిల్లా కేంద్రాల్లో దరఖాస్తుదారులకు లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయిస్తారు. అదృష్టం కలిసి రాకపోతే దరఖాస్తుకు వెచ్చించిన రూ.2లక్షలు తిరిగిరావు.

కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 266 మద్యం దుకాణాల ఏర్పాటుకు అవకాశం ఉండగా, ఎన్నడూ లేని విధంగా 4,013 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే సగటున ఒక్కో దుకాణానికి 15 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. జగిత్యాల, కరీంనగర్‌తో పోలిస్తే పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లల్లో పోటీ కొంత తక్కువగా ఉంది. వీరిలో 480 మంది మహిళలు కావడం గమనార్హం. ఒక్కో దరఖాస్తుకు నాన్‌ రిఫండబుల్‌(తిరిగి చెల్లించని) రుసుం రూ.2 లక్షలు కాగా, ఈ దరఖాస్తుల ద్వారా ఆబ్కారీ శాఖకు వచ్చిన ఆదాయం రూ.80.26 కోట్లు.

ఈసారి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మద్యం వ్యాపారులు కూడా తెలంగాణలో దుకాణాలు దక్కించుకునేందుకు స్థానికుల భాగస్వామ్యంతో దరఖాస్తు చేయించినట్లు తెలిసింది. ఈ తరహాలో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఏపీకి చెందిన వారు స్థానికుల భాగస్వామ్యంతో దరఖాస్తులు అందజేశారు. దీంతో దరఖాస్తుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. అదే సమయంలో జిల్లాకు చెందిన వ్యాపారులు ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది రింగ్‌ అయి, డిమాండ్‌ ఉన్న షాపులకు దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక్కో షాపు కోసం సగటున 15 మంది దరఖాస్తు చేయడంతో 266 షాపులకు గాను ఎక్సైజ్‌ శాఖకు ఏకంగా రూ.80.26 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ దరఖాస్తుల్లో సగానికి పైగా చివరిరోజైన బుధవారం నాడు దరఖాస్తు చేసుకున్నవే. 

జగిత్యాలలో సగటున 20 దరఖాస్తులు
మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవడంలో కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్‌ జిల్లాలో 87 షాపులు ఉండగా, వీటిని దక్కించుకునేందుకు 1346 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో షాపు కోసం సగటున 15.5 దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ మహిళా దరఖాస్తుదారులే 170 మంది ఉండడం విశేషం. ఈ ఒక్క జిల్లా నుంచే దరఖాస్తులను విక్రయించడం ద్వారా రూ.26.92 కోట్లు ఆబ్కారీ శాఖకు ఆదాయం సమకూరింది. ఇక జగిత్యాల జిల్లాలో 64 దుకాణాలే ఉండగా, 1285 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే సగటున ఒక దుకాణానికి 20 దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లాలో దరఖాస్తుల ద్వారా  ఎక్సైజ్‌ శాఖకు రూ.25.70 కోట్లు ఆదాయం సమకూరింది.

161 మంది మహిళలు అదృష్టాన్ని నమ్ముకోవడం గమనార్హం. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రాఘవపేట మద్యం దుకాణం కోసం ఏకంగా 48 మంది దరఖాస్తులు దాఖలు చేశారు. కరీంనగర్‌ జిల్లాలో మానకొండూరు మండలం 48వ దుకాణానికి 41 దరఖాస్తులు అందాయి. కరీంనగర్‌ పట్టణంలో లైసెన్స్‌ ఫీజు ఎక్కువగా ఉండడం, ఇక్కడ పాతుకుపోయిన ఒకటి రెండు దుకాణాలతో పోటీ పడి విక్రయాలు జరపలేమని పలువురు వ్యాపారులు ఆదాయం అధికంగా ఉండే ఇతర ప్రాంతాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. 

అంచనాలు తప్పిన పెద్దపల్లి
మద్యం విక్రయాల్లో పెద్దపల్లి జిల్లా ముందంజలో ఉంటుంది. సింగరేణి కాలరీస్‌ నెలవై ఉన్న రామగుడం కార్పొరేషన్‌ , పెద్దపల్లి జిల్లా కేంద్రాలతోపాటు రాష్ట్ర, జిల్లాల సరిహద్దు ప్రాంతాలు కూడా ఈ జిల్లాలో అధికం. గోదావరి ఖని కోల్‌బెల్ట్‌ ఏరియాలోనే రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరుగుతాయి. ఈ కొత్త లైసెన్సుల కోసం దరఖాస్తులు మాత్రం సింగరేణి కోల్‌బెల్ట్‌ నుంచి తక్కువగా రావడం గమనార్హం. దీనిని బట్టి ఇక్కడి వ్యాపారులు రింగ్‌ అయి పరస్పర ఒప్పందంతో కలిసి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మద్యం దుకాణాలు నడుపుతున్న వ్యాపారులే సిండికేట్‌ అయి దరఖాస్తులు దాఖలు చేసినట్లు తెలిసింది. ఒక్కో దుకాణానికి రెండు లేదా మూడు మాత్రమే దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ జిల్లాలో ఓదెల మండలం పొత్కపల్లి, ఎలిగేడ్‌ మండల కేంద్రం దుకాణాలకు మాత్రమే 28 మంది చొప్పున దరఖాస్తు చేసుకోగా, గర్రెపల్లి దుకాణానికి 27 మంది పోటీ పడ్డారు. జిల్లాలో 61 మంది మహిళలు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోగా, సుల్తానాబాద్‌ సర్కిల్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోనే 34 మంది పోటీ మహిళలు పోటీ పడడం విశేషం. 

సిరిసిల్లలో 41 దుకాణాలకు  648 దరఖాస్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 41 దుకాణాలకు గాను 648 దరఖాస్తులు అందాయి. వీటిలో 88 మంది మహిళా దరఖాస్తుదారులు ఉన్నారు. కాగా ఈ దరఖాస్తుదారుల ద్వారా ఎక్సైజ్‌ శాఖకు 12.96 కోట్లు ఆదాయంగా సమకూరనుంది.    సిరిసిల్లలోని 6వ నెంబర్‌ దుకాణానికి అత్యధికంగా 36 మంది దరఖాస్తు చేసుకోగా రుద్రంగి మండలంలోని మానాల మద్యం దుకాణానికి అత్యల్పంగా కేవలం 2 దరఖాస్తులు వచ్చాయి. 

నేడు లక్కీ డ్రా ద్వారా కేటాయింపులు
ఎక్సైజ్‌ శాఖకు జిల్లాల వారీగా వచ్చిన సీల్డ్‌ దరఖాస్తులను శుక్రవారం ఆయా జిల్లా కేంద్రాలలో తెరవనున్నారు. జిల్లా కలెక్టర్‌ లేదా జాయింట్‌ కలెక్టర్‌ సమక్షంలో దుకాణాల వారీగా విభజించి, లక్కీ డ్రా ద్వారా కేటాయింపులు జరపనున్నారు. ఈ మేరకు ఎంపిక చేసిన ఆడిటోరియాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా