‘డబుల్‌’ నిర్మిస్తామని డబ్బులు కాజేశారు!

29 May, 2019 08:42 IST|Sakshi
సంస్థ వారు ఇచ్చిన రశీదు

 గ్రామీణ ప్రాంత ప్రజలనే టార్గెట్‌ చేసుకుంది ఆ సంస్థ. పేదల బాగు కోసమే పనిచేస్తుందని నమ్మించారు. పేదల అవసరాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తక్కువ ధరలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టిస్తామని నిండా ముంచింది ఆ  ప్రైవేట్‌ సంస్థ.   ముందుగా యజమాని వాటా కింద కొంత డబ్బు చెల్లిస్తే మెటీరియల్‌ తెప్పించి పనులు ప్రారంభిస్తామని నమ్మబలికారు. దీంతో జగదేవ్‌పూర్‌ మండల పరిధిలో 70 మంది తమ వాటా కింద ఒక్కొక్కరు రూ. 30వేలు చెల్లించారు. డబ్బు చెల్లించి ఐదు నెలలవుతున్నా.. ఉలుకూపలుకు లేకపోవడంతో ఫోన్‌ చేశారు. అయినా స్పందన లేదు. దీంతో మోసపోయామని గ్రహించిన వారు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.                                 – జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌)

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌) : రాష్ట్రంలో సంచలనం రేపుతున్న  మాల్యవి కరుణోదయ సంస్థ వారి మోసాలు జగదేవ్‌పూర్‌ మండలంలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోజు రోజు బయటకు వస్తున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. మండలంలోని పది గ్రామాల ప్రజల నుంచి సంస్థ వారు సుమారు రూ. 20 లక్షలకు పైగా వసూల్‌ చేసినట్లు  తెలుస్తోంది.  మునిగడప గ్రామంలోని ఆ సంస్థ కో ఆర్డినేటర్‌ ప్రభుదాసు గతేడాది నవంబర్‌లో మునిగడప గ్రామానికి వచ్చి డబుల్‌బెడ్రూం ఇళ్ల స్కీం వివరించారు. లబ్ధిదారుడి వాటా 2.80 లక్షలు చెల్లించాలని, అయితే  ముందుగా కేవలం రూ.30 వేలు చెల్లిస్తే మెటీరియల్‌ తెప్పించి నాలుగు నెలలో ఇల్లు పూర్తి చేస్తామని చెప్పాడు. ఇల్లు మొత్తం ఖర్చు 7.50 లక్షలని, అయితే ఈ  సంస్థ పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ  కార్యక్రమం చేపడుతున్నామని నమ్మించారు. దీంతో గ్రామంలో 18 మంది పేదలు 30 వేల చొప్పున చెల్లించారు. ఇలా సంస్థ కో ఆర్డినేటర్‌లు రెండు మూడు గ్రామాలకు ఇద్దరు ముగ్గురు చొప్పున ఇన్‌చార్జిలు తీసుకుని మోసానికి ఒడిగట్టారు చుట్టారు.  ఇలా జగదేవ్‌పూర్‌ 12 మంది, లింగారెడ్డిపల్లి 9 మంది, అలిరాజ్‌పేటలో 7 మంది, నిర్మల్‌నగర్‌లో 7 మంది, వట్టిపల్లిలో ఇద్దరు, బస్వాపూర్, అనంతసాగర్, రాంచంద్రాపూర్‌లో మరికొందరు రూ. 30 వేల చొప్పున చెల్లించారు.

కొంతమందికి  మెటీరియల్‌...
సంస్థ వారు ముందుగా డబ్బలు చెల్లించిన కొంత మందికి మిగితావారిని నమ్మించడానికి కంకర, సిమెంట్, స్టీల్‌ సరఫరా చేసినట్లు తెలుస్తోంది. నిర్మల్‌నగర్‌లో ఇద్దరికి కంకర పోశారు. ఇలా అక్కడక్కడ స్టీల్‌ సరఫరా చేసిన ఆ ఫొటోలను మిగతా గ్రామాల్లో ప్రజలకు చూపడంతో ఒకరు చూసి ఒకరు సంస్థకు డబ్బులు చెల్లించారు. డబ్బులు కట్టి ఐదు నెలలు కావస్తున్నా కొంత మందికి మెటీరియల్‌ కూడా రాకపోవడంతో సంస్థ వారు ఇచ్చిన సెల్‌ నంబర్‌కు ఫోన్‌ చేయగా స్వీచ్ఛాప్‌ వచ్చిందని లబ్ధిదారులు వాపోతున్నారు.   మాల్యవి సంస్థ మోసాలు బయట పడడంతో మండలంలోని బాధితులు గ్రామాల వారీగా జగదేవ్‌పూర్‌ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మాల్యవి కరుణోదయ సంస్థ వారిని నమ్మి మోసపోయామని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. జగదేవ్‌పూర్, అలిరాజ్‌పేట, మునిగడప, వట్టిపల్లి, లింగారెడ్డిపల్లి, బస్వాపూర్, అనంతసాగర్, రాంచంద్రాపూర్, నిర్మల్‌నగర్‌ గ్రామాల్లో 70 మందికి పైగా బాధితులు సంస్థకు డబ్బులు చెల్లించినట్లు తెలుస్తుంది.  మునిగడప, అలిరాజ్‌పేట, నిర్మల్‌నగర్, లింగారెడ్డిపల్లి గ్రామాల బాధితులు మంగళవారం గజ్వేల్‌రూరల్‌ సీఐ శివలింగంకు ఫిర్యాదు చేశారు.

నాలుగు నెలల్లో పూర్తి చేస్తామన్నారు..
మాకు చిన్న రేకుల ఇల్లు ఉంది. తక్కువకే డబుల్‌బెడ్రూం ఇళ్లు కట్టిస్తామంటే నమ్మిన. నాతో పాటు మా ఊరిలో 18 మంది రూ. 30 వేల చొప్పున చెల్లించాం. గతేడాది నవంబర్‌లో డబ్బులు కట్టిన. నెల రోజుల్లో స్టీల్, ఇసుక, సిమెంట్‌ వేస్తామన్నారు. నాలుగు నెలల్లో ఇల్లు పూర్తి చేస్తామని చెప్పడంతో నమ్మి డబ్బు చెల్లించాను. తీరా చూస్తే మోసపోయినట్లు తెలిసింది. ఎలాగైనా మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి.             –మల్లమ్మ, బాధితులు, మునిగడప

మా డబ్బులు ఇప్పించాలి..
తక్కువ డబ్బలకే డబుల్‌ బెడ్రూం ఇల్లు అంటే రూ. 30 వేలు చెల్లించాను. మా గ్రామంలో నాతో పాటు ఏడు మంది కట్టారు. ఇద్దరికి కంకర కూడా పోశారు.  దీన్ని చూసి ఇల్లు కట్టిస్తారని నమ్మినం. ఇటీవల పేపర్లలో, టీవీలల్లో ఈ సంస్థ మోసాలను చూసి నివ్వెరపోయాం. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. ఎలాగైనా మా డబ్బలు మాకు ఇపించాలి.        –కుమారస్వామి, బాధితుడు, నిర్మల్‌నగర్‌

మరిన్ని వార్తలు