‘సఖి’.. ప్రైవేటు పరం!

12 Mar, 2018 01:55 IST|Sakshi

ఎన్జీవోల చేతికి సఖి కేంద్రాల నిర్వహణ 

కీలక చట్టాల అమలు ప్రైవేటు చేతికి  

ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ పరిధిలోనే.. 

ఓ ఉన్నతాధికారి హస్తమున్నట్లు ఆరోపణలు 

సాక్షి, హైదరాబాద్‌: సఖి.. దాడులు, వేధింపులకు గురైన ఆడబిడ్డకు అండగా ఉండి అన్ని రకాల సేవలు అందించే భరోసా కేంద్రం. నిర్భయ చట్టం, పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, పొక్సో చట్టంతో పాటు మహిళల పట్ల అసభ్య ప్రవర్తనపై క్రిమినల్‌ కేసుల నమోదు బాధ్యతంతా ఈ కేంద్రాలదే. ఒక మహిళ తనపై దాడి జరిగిందని సఖి కేంద్రాన్ని సంప్రదిస్తే ఆమెకు తక్షణ వైద్య సాయంతో పాటు బాధ్యులపై కేసు నమోదు చేయించడం, బాధితురాలికి అండగా న్యాయ సాయం అందించడం, కౌన్సెలింగ్, ఆర్థిక చేయూత, వసతి వంటి చర్యలన్నీ అందిస్తారు. ఇలాంటి కీలక సఖి కేంద్రాలు స్వచ్ఛంద సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రభుత్వ శాఖలు నిర్వహించాల్సిన ఈ బాధ్యతలు కాస్తా ప్రైవేటు వ్యక్తుల పాలవుతున్నాయి. 

పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ శాఖలతోనే.. 
మహిళల కోసం ప్రత్యేకంగా ఉన్న చట్టాల అమలుకు కేంద్ర ప్రభుత్వం సఖి కేంద్రాలను జిల్లాకొకటి చొప్పున మంజూరు చేసింది. రాష్ట్రంలో హైదరాబాద్‌ మినహా ఉమ్మడి 9 జిల్లాలకు సఖి కేంద్రాలను తొలివిడతగా మంజూరు చేసింది. రెండోవిడతలో తాజాగా మరో 8 కొత్త జిల్లాల్లోనూ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. తొలివిడతలోని కేంద్రాల్లో ఒక్కోదాని ఏర్పాటుకు రూ.48 లక్షల చొప్పున మంజూరు చేసిన కేంద్రం.. నిర్వహణ కోసం రూ.20 లక్షలు విడుదల చేసింది. అయితే ఆ సఖి కేంద్రాల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏకంగా స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో)లకు కట్టబెట్టింది. వాస్తవానికి ఈ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ అంతా ప్రభుత్వ శాఖలే నిర్వహించాలి. అప్పుడే చట్టాల అమలు, నిఘా సమర్థవంతంగా ఉంటుంది. ఈ సఖి కేంద్రాల నిర్వహణ పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ శాఖలే నిర్వహిస్తుండగా, ఇక్కడ మాత్రం ఎన్జీవోలకు అప్పగించడం పట్ల తీవ్ర విమర్శలకు తావిస్తోంది. 

అంతా రహస్యమే... 
సఖి కేంద్రాల నిర్వహణ బాధ్యతల అప్పగింత ప్రక్రియ రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలను ప్రైవేటుకు అప్పగించాల్సి వస్తే నోటిఫికేషన్‌ ఇవ్వడం, దరఖాస్తుల ఆధారంగా పరిశీలించి బాధ్యతల్ని అప్పగిస్తారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా, కనీసం జిల్లా సంక్షేమాధికారికి కూడా సమాచారం లేకుండా ఎన్జీఓల ఎంపిక జరిగిందని సమాచారం. ఈ వ్యవహారం మొత్తం ఓ ఉన్నతాధికారి వెనకుండి నడిపించారనే ఆరోపణలన్నాయి. సఖి కేంద్రాల నిర్వహణ బాధ్యతలను దక్కించుకున్న ఎన్జీవోలు.. వాటిలో పనిచేసే సిబ్బంది ఎంపిక ప్రక్రియ ముమ్మరం చేశాయి. ఇప్పటికే మెజార్టీ సంస్థలు నియామకాల ప్రక్రియను పూర్తిచేశాయి. ఈ చట్టాల అమలుకు సంబంధించి నిపుణులనూ ఏకపక్షంగా ఎంపిక చేశారని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతి ఫిర్యాదును తప్పకుండా పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే బాధ్యతల నుంచి ఎన్జీఓలను తప్పిస్తామని అధికారులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు