ఇచట దొంగలకు శిక్షణ ఇవ్వబడును!

5 Dec, 2017 10:38 IST|Sakshi

దొంగతనం చేయడంలో వారికి పెట్టింది పేరు. చోరీలు ఎలా చేయాలో నేర్పేందుకు ఇక్కడ శిక్షణ పాఠశాలలే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. దొంగతనం చేస్తూ బతకడమే ఈ బస్తీవాసుల జీవనం. వీరిలో మార్పు తెచ్చేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. కరడుగట్టిన 25 మంది మాన్గార్‌ బస్తీ నేరగాళ్లు పోలీసుల  ఎదుట సోమవారం లొంగిపోయారు. ఈ నేపథ్యంలో అసలీ బస్తీ కథేంటి? చోర కళలో ఆరితేరడంలో అంతర్యమేమిటి? వీరి జీవనంలో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసులు చేస్తున్న కృషి తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.     

  • మాన్గార్‌ బస్తీలో దొంగల బడులు
  • చోర కళలో శిక్షణనిస్తున్న పాఠశాలలు
  • ఇక్కడి వారికి ఇదే వృత్తి
  • మార్పు కోసం పోలీసుల ప్రయత్నం
  • స్వచ్ఛంద సంస్థల సహకారంతో సేవా కార్యక్రమాలు  

సాక్షి, నాంపల్లి: రెండు శతాబ్దాల క్రితం మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 500 కుటుంబాలు హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మాన్గార్‌ బస్తీలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాయి.  ఇక్కడి పిల్లలు చదువుకునేందుకు ఇష్టపడరు. పెద్దలు సైతం వీరిని బడికి పంపించరు.  కానీ దొంగతనాలు నేర్పే బడికి మాత్రం పంపిస్తారు. బస్తీలో పదుల సంఖ్యలో ఈ  పాఠశాలలున్నాయి. ఇక్కడ చోర కళ మాత్రమే నేర్పిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల మెడలోని గొలుసు ఎలా తెంచుకోవాలి? జేబులు కత్తిరించి, ఎలా బయటపడాలో ప్రాక్టీస్‌ చేయిస్తారు.

‘నాయకుడి’ నరకం..  
ప్రతిరోజూ ఈ దొంగల ముఠాలు ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లలో, ర్యాలీలు, పాదయాత్రలలో సంచరిస్తాయి. కొన్ని ముఠాలు జాతరలు, దేవాలయాల వద్ద తిష్టవేస్తాయి. దొంగలించిన సొమ్మంతా ముఠా నాయకుడికి అం దజేస్తారు. ఈ క్రమంలో దొంగ పోలీసులకు చిక్కితే విడిపించడానికి అవసరమయ్యే ఖర్చు, తల్లిదండ్రుల పోషణ, వైద్య ఖర్చులు అన్నీ ముఠా నాయకుడే చెల్లిస్తాడు. చెల్లించిన పైకానికి  30 శాతం వడ్డీ వసూలు చేస్తాడు. అసలు, వడ్డీ చెల్లించకుంటే పిల్లలు వారి అధీనంలోనే ఉండాలంటాడు. ఇలా తీసుకున్న డబ్బు చెల్లించలేక, ఇచ్చిన మాటను కాదనలేక, ఎదురించినా బస్తీలో ఇవ ుడలేక ఎంతో మంది తమ కుటుంబాలను చేతులారా నిర్వీర్యం చేసుకుంటున్నారు.  

ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కృషి..
నేరాలను అదుపు చేయడానికి రెండేళ్ల క్రితం ఈ బస్తీ నుంచే పోలీసులు కట్టడి ముట్టడి (కార్డన్‌ సెర్చ్‌)కి శ్రీకారం చుట్టారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో 70 శాతం చైన్‌ స్నాచింగ్‌  కేసులు తగ్గాయి.  పోలీసుల వరుస దాడులు, కేసుల నమోదు, పీడీ యాక్టులతో సగం మంది నేరాలు మానేసి, ఉపాధి పనుల బాట పట్టారు. బస్తీ ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసులు నిరంతరం  తపిస్తున్నారు. ఇందులో భాగంగానే మాన్గార్‌ బస్తీలో లయన్స్‌ క్లబ్, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సామూహిక అన్నదానాలు, దుస్తుల పంపిణీ, అవగాహన సదస్సులు, హెల్త్‌ క్యాంపులు, ఉద్యోగ మేళాలు  చేపడుతున్నారు.    

జీవితాలు నాశనం చేసుకోవద్దు..
తరతరాలుగా దొంగతనాలు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దొంగతనాలు చేస్తూ ఫైనాన్సియర్లను బతికిస్తున్నారు. తాతముత్తాతల వృత్తినే మళ్లీ ఎంచుకుని జీవించడం సరికాదు. నేర ప్రవృత్తిని  వీడనాడాలి. పిల్లలను బాగా చదివించుకోవాలని బస్తీవాసులను కోరుతున్నాం.   
    – వెంకటేశ్వరరావు, డీసీపీ

నేరగాళ్ల చిట్టా ఇదీ..
మాతంగి సునీల్‌..
మాతంగి సునీల్‌ అలియాస్‌ మదన్‌ 40 కేసుల్లో నిందితుడు. జంటనగరాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఇతనిపై కేసులున్నాయి. చాలాసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా పద్ధతి మార లేదు.
   
కాంబ్లే దీపక్‌..
మాన్గార్‌ బస్తీకి చెందిన కాంబ్లే దీపక్‌ అలియాస్‌ బోకుడు. ఇతనిపై 50 కేసులున్నాయి. కరడుగట్టిన నేరస్తుడిగా పేరుంది. ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నా ఫలితం లేకుండాపోతోంది.  
 
ఆకాష్‌..

ఆకాష్‌ అలియాస్‌ బాండియా నేరాలు చేయడంలో సిద్ధహస్తుడు. 50 కేసులున్నాయి. క్షణాల్లోనే మెడలోని గొలుసులు తెంచేస్తాడు. అనేకసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా ఎలాంటి మార్పులేదు.

 నర్సింహ..
హెచ్‌. నర్సింçహ అలియాస్‌ మొగిలి 60 కేసుల్లో నిందితుడు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తిష్ట వేసి  ప్రయాణికుల బ్యాగులు, లగేజీలు దోచుకెళ్తాడు. పలుమార్లు జైలుశిక్ష అనుభవించి బయటకు వ చ్చాడు. పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు.
 
నాడె గోపి..
నాడె గోపి అలియాస్‌ ఫయాజ్‌ 25 కేసుల్లో నిందితుడు. దోపిడీ కేసుల్లో నేరస్తుడు. నగరంలోని పలు పోలీస్‌స్టేషన్‌లలో కేసులు న్నాయి. పోలీసులకు చిక్కకుండా సవాల్‌గా నిలిచాడు.

మాన్గార్‌బస్తీ మారుతోంది!

  • కరుడుగట్టిన 25 మంది నేరగాళ్ల లొంగుబాటు
  • నగర పోలీసు చరిత్రలో తొలిసారిగా సరెండర్లు
  • లొంగిపోయిన వారిపై 32 ఠాణాల్లో 200 కేసులు

సాక్షి,సిటీబ్యూరో: మాన్గార్‌బస్తీ... ఈ పేరు చెబి తే పోలీసులు సైతం ఉలిక్కిపడతారు. చైన్‌ స్నాచింగ్, పిక్‌ పాకెటింగ్, దోపిడీ, దొంగతనాలు చేసే నేరగాళ్ళకు కేరాఫ్‌ అడ్రస్‌. ఎన్నిసార్లు జైలుకు  వెళ్ళినా, చివరకు పీడీ యాక్ట్‌లు ప్రయోగించినా వీరిలో మార్పు కనిపించేది కాదు. ఈ ప్రాంతంలో రైడింగ్‌కు వెళ్లి సురక్షితంగా తిరిగి వచ్చిన పోలీసులు లేరనే చెప్పవచ్చు. హబీబ్‌నగర్‌ పోలీసులు ఆరు నెలల కృషి ఫలితంగా ఇలాంటి ఘరానా నేరచరిత్ర ఉన్న ఆ ప్రాంతంలో మార్పు వస్తోంది. నగర పోలీసు చరిత్రలోనే తొలిసారిగా 25 మంది కరుడుగట్టిన మాన్గార్‌బస్తీ నేరగాళ్ళు సోమవారం  పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరికి పునరావాసం కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. వీరంతా కేవలం లొంగిపోవడం మాత్రమే  కాదని... ఇకపై నేరాలు సైతం చేయమంటూ పోలీసుల ఎదుట ప్రమాణం చేశారు. ఈ ఘనత హబీబ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ పరవస్తు మధుకర్‌స్వామికే దక్కుతుంది.

కొన్నేళ్ళ క్రితం మహా రాష్ట్ర, కర్నాటకల నుంచి వచ్చి ఈ బస్తీలో స్ధిరపడిన వారిలో అత్యధికులు నేరప్రవృత్తినే ఎంచుకున్నారు. వీరిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ ఇవ్వడం ప్రారంభించారు. ప్రవర్తన మార్చుకున్న వారికి ఉపాధి కల్పించడానికి ‘జాబ్‌ కనెక్ట్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తద్వారా ఇప్పటికే అనేక  మందికి కార్పొరేట్‌ కంపెనీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉద్యోగాలు ఇప్పించారు. మాన్గార్‌బస్తీ నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నేరాలు చేస్తున్న ఎనిమిది ప్రధాన గ్యాంగులను గుర్తించిన పోలీసులు వాటినే ‘టార్గెట్‌’గా చేసుకున్నారు. వివిధ నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న వీటిలోని 25 మంది సభ్యులను సన్మార్గంలోకి తీసుకురావాలని నిర్ణయించు కున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాలు అవలంభిస్తూ వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తూ తమపై నమ్మకం పెంచుకున్నారు. ప్రవృత్తిని మార్చుకుంటే భవిష్యత్తులోనూ పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బం దులు ఉండవంటూ భరోసా ఇచ్చారు. ఫలితంగా ఆ 25 మందీ సోమవారం డీసీపీ ఎదుట లొంగిపోయారు.

వీరు ఇప్పటికే సిటీలోని 32 ఠాణాల పరిధిలో నమోదైన 200 కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్ళివ చ్చారు. వివిధ పోలీసుస్టేషన్లలో 106 నాన్‌–బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 194 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నారు. ఒక్కొక్కరి పై పదుల సంఖ్యలోనే కేసులు ఉన్నాయి. వీటిలో  జేబు దొంగతనాల నుంచి దోపిడీల వరకు వివిధ నేరాలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రస్తుతం వీరందరినీ కోర్టు ముందు హాజరుపరునున్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులను పరిష్కరించడంతో పాటు సొత్తు రికవరీ చేసి బాధితులకు అందించనున్నారు. వీరికి ఉద్యోగాలతో పాటు జీవనోపాధి కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ విధానాన్ని కోనసాగిస్తూ మిగిలిన నేరగాళ్ళు సైతం  మారేందుకు ఆస్కారం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేవలం మావోయిస్టుల విషయంలో మాత్రమే అనుసరించే సరెండర్‌ పాలసీని మాన్గార్‌బస్తీ నేరగాళ్ళకూ వర్తిం చడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా