మధ్యవర్తిత్వం

12 Oct, 2014 03:43 IST|Sakshi

జిల్లాకేంద్రానికి కూతవేటు దూరంలో ఉంది ఆ మండలం. ఈ మండలంలోని ఓ గ్రామంలో వైన్స్, బెల్టుషాపు నిర్వాహకుల మధ్య ఇటీవల అమ్మకాల విషయంలో గొడవ జరిగింది. దీంతో ఎక్సైజ్ అధికారులు ఈ నెల రెండో తేదీన ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో ఆ రెండు వర్గాల వారిని కూర్చోబెట్టి సెటిల్‌మెంట్ చేశారు. వైన్‌షాపుల వారు బాటిల్‌కు అదనంగా  10 రూపాయలు వసూలు చేస్తారని.. బెల్ట్ దుకాణాల వారు గ్రామాల్లో రూ. 20 అదనంగా వసూలు చేసుకోవచ్చని తేల్చి చేప్పేశారు.
 
 సాక్షి, మహబూబ్‌నగర్ :
 జిల్లాలో మందు గొడవ మొదలైంది. వైన్‌షాపు, బెల్టుషాపుల నిర్వాహకుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. బెల్టుషాపులకు అమ్మకాలు జరిపే మద్యం సీసాలను వైన్‌షాపులు ఎమ్మార్పీ కంటే రూ.10 అదనంగా అమ్ముతుండడంతో బెల్టుషాపుల యజమానులు ఎదురు తిరుగుతున్నారు. దీంతో గ్రామాల్లో నేరుగా బెల్టుషాపులు నిర్వహించేందుకు వైన్‌షాపు యజమానులు మొగ్గుచూపుతున్నారు.

ఈ చర్యలపై గ్రామాల్లోని బెల్టుషాపుల యజమానులు ఒక్కటై తిరగబడుతున్నారు. ఇలాంటి పంచాయితీలు ఎక్సైజ్ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. నేరుగా ప్రజాప్రతినిధుల ఇళ్లలోనే మకాం వేసి ఇరువర్గాలకు మధ్యేమార్గం చూపుతున్నారు. గ్రామాల్లోని బెల్టుషాపులు మద్యం సీసాను రూ.20 అదనంగా అమ్ముకోండంటూ అబ్కారీ అధికారులు సలహా ఇస్తున్నారు.

 పంచాయితీ ఇక్కడే మొదలు...!
 మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్ ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో 199వైన్‌షాపులు, 9బార్‌అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. జిల్లాలోని 1313 పంచాయతీల పరిధిలో దాదాపు 5వేల వరకు మద్యం దుకాణాలు వెలిసినట్లు అంచనా. అయితే వైన్‌షాపు యజమానులు ఎక్సైజ్ అధికారుల మద్దతుతో గ్రామాల్లోని బెల్టుషాపుల నుంచి అధికంగా వసూలు చేయడం మొదలుపెట్టారు. ఒక్కొక్క మద్యం సీసాకు అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారు.

ఇదేమని ప్రశ్నిస్తే... ‘అబ్కారొళ్లకు నెలనెలా మామూళ్లు ఇయ్యాలే’ అంటూ సమాధానం ఇస్తున్నారు. మరీ గట్టిగా నిలదీస్తే... ‘మీకు మద్యం అమ్మం. కావాలంటే మేమిచ్చే రేటుకు తీసుకోవాల్సిందే. లేదంటే దిక్కున్న చోట పోయి చెప్పుకోండి’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. మరికొన్ని చోట్ల వైన్‌షాపుల యజమానులు మరొక అడుగు ముందుకేసి నేరుగా గ్రామాల్లో వారి మనుషుల చేత ప్రత్యేకంగా షాపులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో బెల్టుషాపుల యజమానులు అంతా ఒక్కటై తిరగబడుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే ఎక్సైజ్ అధికారులు రంగప్రవేశం చేస్తున్నారు.

ఇరువురిని ఒక దగ్గర సమావేశపరిచి మార్గే మధ్యంగా సలహాలిస్తున్నారు. వైన్‌షాపులు కచ్చితంగా ఎమ్మార్పీ కంటే రూ.10 అదనంగా అమ్ముతాయని, గ్రామాల్లో ఎమ్మార్పీ కంటే రూ.20 అదనంగా అమ్ముకోండంటూ అధికారులు సలహా ఇస్తున్నారు. ఇలా చేస్తే గ్రామాల్లో దాడులు, కేసులు ఉండవంటూ హామీ ఇస్తున్నారు. కాదు కూడదని తోక జాడిస్తే మీ సంగతి చూస్తాం అంటూ అధికారులే హెచ్చరిస్తున్నారు. దీంతో కంగుతిన్న బెల్టుషాపుల యజమానాలు పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల గాంధీ జయంతి రోజున ఒక రాజకీయ ‘ముఖ్యనేత’ ఇంట్లో వైన్‌షాపు యాజమానులు, బెల్టుషాపుల యాజమాన్యం పంచాయితీ పెట్టి ఒక్కతాటిపైకి తెచ్చినట్టు సమాచారం.

 ఎక్సైజ్ అధికారులపై విమర్శలు
 ఎక్సైజ్ అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రతి నెల ‘మామూళ్లు’ అందుకుంటూ నిబంధనలకు తిలోదకాలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. పైగా నెలనెలా మామూళ్లు ఇవ్వని గ్రామాలపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తామంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. అంతేకాదు షాపుల మీద దాడులు చేసి అందినకాడికి సీసాలు లాక్కెళ్తున్నారు. గ్రామాల్లో క్కో బెల్టుషాపు నుంచి రూ.3వేలు, కల్లు దుకాణాల నుంచి రూ.2వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తలు