కరీంనగర్, ఖమ్మంలో వైద్య కాలేజీలు!

9 Aug, 2019 01:59 IST|Sakshi

మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ : కరీంనగర్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరగా కేంద్రం సానుకూలంగా స్పందించిందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. గురువారం ఢిల్లీలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్దన్, సహాయ మంత్రి అశ్వనీకుమార్‌ చౌబేలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణలో భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.  తెలంగాణ వైద్యరంగంలో కొత్త సంస్కరణలకు, పథకాలకు కేంద్ర సహకారం, సాయం కావాలని కోరగా.. సంపూర్ణ సహకారం ఇస్తామని హర్షవర్ధన్‌ హామీ ఇచ్చారన్నారు. కాకతీయ మెడికల్‌ కాలేజ్‌లో సూపర్‌ స్పెషాలిటీ బ్లాకు, ఆదిలాబాద్‌లో మరో సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ నిర్మాణం జరుగుతోంది. వీటికి నిధులివ్వాలని కోరామన్నారు. కేంద్ర ప్రభుత్వం కంటే ముందే పలు ఆదర్శ పథకాలు అమలు చేస్తున్నందున ఆర్థికంగా ప్రోత్సాహం అందించాలని కేంద్ర మంత్రికి విన్నవించినట్టు ఈటల తెలిపారు.

కొత్తగా ఏర్పడిన జిల్లాలో జిల్లా ఆస్పత్రులను అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉన్నందున కేంద్ర పథకం కింద ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు.  అనంతగిరి కొండల్లో ఆయుష్‌ విభాగం పరిధిలో ఆయుర్వేదం, యునానీ, హోమియోపతి, నేచురల్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని విన్నవించినట్టు పేర్కొన్నారు. పేదలకు వైద్యం అందించే విషయంలో తెలంగాణలో గొప్పగా పనిచేస్తున్నారని హర్షవర్ధన్, చౌబే ప్రశంసించారన్నారు. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌  బిల్లు విషయంలో దేశవ్యాప్తంగా డాక్టర్లకు ఆందోళన ఉందని మంత్రి ఈటల పేర్కొన్నారు. పీజీ సీట్లు వచ్చేంత వరకు సంబంధిత ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని అడిగినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు