పురపాలికల్లో కానరాని ఎన్నికల సందడి 

13 Oct, 2019 11:36 IST|Sakshi

13 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే 

ఇప్పటికీ వెలువడని న్యాయస్థానం తీర్పు  

ఎన్నికల నిర్వహణలో జాప్యం 

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మున్సిపాలిటీల్లో రాజకీయ సందడి తగ్గింది. రెండు నెలల క్రితం పురపాలికల్లో నెలకొన్న ఎన్నికల హడావిడి ఇప్పుడు ఎక్కడా కన్పించడం లేదు. అన్నీ వదులుకుని ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమైన ఆశావహులందరూ ఇప్పుడు మళ్లీ తమ పనుల్లో నిమగ్నమయ్యారు. మొన్నటి వరకు ‘పుర’ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చిన రాజకీయ పార్టీల్లో ఇప్పుడు స్తబ్దత నెలకొంది.

సాక్షి, మహబూబ్‌నగర్‌: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం జూన్, జూలైలో చేపట్టిన వార్డుల పునర్విభజన.. కులాల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, అధికారులు నిర్లక్ష్యంగా ఏకపక్షంగా ప్రక్రియను పూర్తి చేశారంటూ ఒకరి తర్వాత మరొకరు మొత్తం 13మున్సిపాలిటీల నుంచి ఆశావహులు, రాజకీయ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అందిన ఫిర్యాదులు.. అధికారుల తప్పిదాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర హైకోర్టు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 13 మున్సిపాలిటీల్లో ఎన్నికలపై స్టే విధించింది. తప్పులన్నీ సరి దిద్ది.. ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అందుకు ప్రభుత్వమూ పలుమార్లు ఎన్నికల నిర్వహణపై చేపట్టిన కసరత్తుపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించింది. ప్రభుత్వ వివరణ విన్న హైకోర్టు ఇప్పటి వరకు ప్రక్రియపై సంతృప్తి చెందలేదు. ఎన్నికల నిర్వహణపై తుది తీర్పును కూడా ప్రకటించలేదు. దీంతో హైకోర్టు తీర్పు వస్తుంది.. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందని ఆశావాహులు, పార్టీలు రెండు నెలల తరబడి ఉత్కంఠతో ఎదురుచూశారు.

ఇంత వరకు వెలువడని హైకోర్టు తీర్పు.. ఎన్నికల నిర్వహణపై నీలినీడల్ని చూసి ఎన్నికల్లో పోటీపై ఆశలు వదులుకున్నారు. అవకాశం వస్తే పార్టీ గుర్తు మీద.. లేకుంటే స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలవాలనే లక్ష్యంతో తమ తమ పనుల్ని వదిలేసి వార్డుల్లో ప్రచారానికి తెరలేపిన ఆశావహులందరూ ఇప్పుడు మళ్లీ సొంత పనులపై దృష్టిసారించారు. ఇటు అదే స్థాయిలో స్పందించిన రాజకీయ పార్టీల ప్రభావమూ మున్సిపాలిటీల్లో ఇప్పుడు తగ్గింది. నెలన్నర రోజుల క్రితం వార్డుల వారీగా అభ్యర్థుల అన్వేషణపై దృష్టిపెట్టిన అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ నేతలందరూ ప్రక్రియను నిలిపేశారు. గత పాలకవర్గంలో కౌన్సిల్‌లో ఉన్న బలాబలాలు లెక్కలేసుకోవడంతో పాటు ఈ సారి ఆయా ‘పుర’ పీఠాలు దక్కించుకునే విధంగా వ్యూహాలకు పదునుపెట్టిన నేతలు కోర్టు తీర్పు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సభలు, సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల ఎంపికలో పాటించాల్సిన విధి విధానాలు, అంశాలపై చర్చించుకున్న నాయకులకూ నిరీక్షణ తప్పడం లేదు. 

13 పురాల్లో ఎన్నికపై స్టే..  
ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, బాదేపల్లి, నారాయణపేట, గద్వాల, అయిజ, వనపర్తి, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, అమరచింత, పెబ్బేరు, కోస్గి, మక్తల్, అలంపూర్, వడ్డేపల్లి, కొత్తకోట, ఆత్మకూరు, భూత్పూర్‌ మున్సిపాలిటీలున్నాయి. ఇందులో అచ్చంపేట మున్సిపాలిటీకి మార్చి 6, 2016న ఎన్నికలు జరగగా.. ఆ పాలకవర్గం పదవీ కాలం 2021 మార్చి వరకు ఉంది. బాదేపల్లి మున్సిపాలిటీ ఇప్పటికీ గ్రామ పంచాయతీలో కొనసాగుతోంది. దీంతో అచ్చంపేట, బాదేపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగని పరిస్థితి నెలకొంది. కాగా.. వార్డుల పునర్విభజన... కులాల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రి యలో అక్రమాలు జరిగాయంటూ మహబూబ్‌నగర్, భూత్పూర్, కోస్గి, మక్తల్, ఆత్మకూరు, అమరచింత, కొత్తకోట, పెబ్బేరు, వనపర్తి, గద్వాల, అయిజ, కల్వకుర్తి, కొల్లాపూర్‌ మున్సిపాలిటీలకు చెందిన పలువురు ఆశావాహులు, పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించడంతో మొత్తం ఎన్నికల నిర్వహణకు బ్రేక్‌పడింది.   

ఎదురుచూస్తున్న..  
నా పేరు ఆనంద్‌గౌడ్, మాది మహబూబ్‌నగర్‌ పట్టణం లోని 12వ వార్డు. స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్న. పన్నెండేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఈ సారి మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకుంటున్న. మున్సిపల్‌ పాలక మండలి పదవి కాలం పూర్తి అయినప్పటి నుంచి ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని చూసున్న. కచ్చితంగా వార్డు రిజర్వేషన్‌ నాకే అనుకూలంగా వస్తుందనే ధీమాతో ఉన్న. ఆరు నెలల నుంచి పనులన్నీ మానేసి.. వార్డుల్లో అందరినీ కలుస్తున్న. కానీ కొందరు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికల నిర్వహణపై స్టే వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూసి..నెల రోజుల నుంని మళ్లీ నా పనిలో నిమగ్నమయ్యాను.  

ఎన్నికలపై స్టే ఉన్న పురపాలికలు 
మహబూబ్‌నగర్‌ 
భూత్పూర్‌ 
కోస్గి 
మక్తల్‌ 
ఆత్మకూరు 
అమరచింత 
కొత్తకోట 
పెబ్బేరు 
వనపర్తి 
గద్వాల 
అయిజ 
కల్వకుర్తి 
కొల్లాపూర్‌  

మరిన్ని వార్తలు