కోలుకున్న కరోనా బాధితులు

10 Apr, 2020 09:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జిల్లాలో 4 పాజిటివ్‌ కేసులు నమోదు

చికిత్స అనంతరం ముగ్గురికి నెగెటివ్‌ రిపోర్టు, డిశ్చార్జి

మరొకరికి కొనసాగుతున్న వైద్యసేవలు 

సాక్షి, కొత్తగూడెం: జిల్లాలో నలుగురు కరోనా పాజిటివ్‌ బాధితులు ఉండగా, ముగ్గురికి నయమైంది. దీంతో వారిని డిశ్చార్జి చేయగా.. జిల్లా ప్రజలు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. అశ్వాపురానికి చెందిన యువతికి గత మార్చి 12న, కొత్తగూడేనికి చెందిన పోలీస్‌ ఆఫీసర్‌ కుమారుడికి 22న కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు గుర్తించారు. వారు కలిసిన వారిని కూడా హైదరాబాద్‌ తరలించి పరీక్షించగా.. పోలీస్‌ ఆఫీసర్‌కు, వారి పని మనిషికి కూడా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. నలుగురికి కరోనా పాజిటివ్‌ రావటంతో భద్రాద్రి జిల్లాను కేంద్ర ప్రభుత్వం రెడ్‌జోన్‌గా ప్రకటించింది. (కరీంనగర్‌లో కరోనా కేసులు ఇలా...)

పాల్వంచ: ఏ రాష్ట్రం నుంచైనా సరుకులను వాహనాల్లో తెచ్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎంవీఐ జైపాల్‌ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక లారీ అసోసియేషన్‌ హాల్‌లో వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యావసర సరుకులను దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా వాహనాల్లో తెచ్చుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం కల్పించాయని, వాహనాల్లో వెళ్లేప్పుడు డ్రైవర్, క్లీనర్‌ మాత్రమే ఉండాలని సూచించారు. ఇబ్బందులుంటే 08744–244900 నంబరులో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ పి.నవీన్, ఎస్‌ఐ జె.ప్రవీణ్, వర్తక సంఘం కన్వీనర్‌ చలవాది ప్రకాశ్, ప్రెసిడెంట్‌ పెండ్యాల కృష్ణమూర్తి, మానస అకాడమీ డైరెక్టర్‌ ప్రభుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.(కరోనా: మరో 5 పాజిటివ్‌లు)


కొత్తగూడెంలోని ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డు

పోలీస్‌ అధికారి డిశ్చార్జి.. 
కొత్తగూడేనికి చెందిన పోలీస్‌ అధికారిని చికిత్స అనంతరం కరోనా నెగెటివ్‌ రిపోర్టు రావడంతో గురువారం డిశ్చార్జి చేశారు. దీంతో ఆయన హైదరాబాద్‌ నుంచి కొత్తగూడెం వచ్చారు. చికిత్స పొందిన తర్వాత నెగెటివ్‌ రావడంతో ఆయన కుమారుడిని ఈ నెల 4న, అశ్వాపురానికి చెందిన యువతిని ఈ నెల 2న డిశ్చార్జి చేసిన విషయం విదితమే. ప్రస్తుతం వారంతా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా పోలీస్‌ అధికారి ఇంట్లో పని మనిషికి చికిత్స కొనసాగుతోంది. కాగా అశ్వాపురం యువతి ఇటలీలో, పోలీస్‌ ఆఫీసర్‌ కుమారుడు ఇంగ్లాండ్‌లో విద్యాభ్యాసం చేస్తూ, కరోనా నేపథ్యంలో స్వదేశానికి వచ్చిన విషయం విదితమే. 

విదేశాల నుంచి వచ్చిన వారు 241 మంది..
విదేశాల నుంచి వచ్చిన వారు జిల్లాలో  241 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 86 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో 28 రోజులపాటు ఉన్నారు. అధికారులు 149 మందిని మణుగూరు క్వారంటైన్‌ కేంద్రంలో 28 రోజులపాటు ఉంచి, ఇళ్లకు పంపించారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో 42 మంది కరోనా అనుమానితులు ఉన్నారు. వారిలో విదేశాల నుంచి వచ్చిన ఆరుగురు, ఇటీవల ఢిల్లీకి మత సభలకు వెళ్లిన వారు 10 మంది ఉన్నారు. ఈ 16 మందికి పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ రిపోర్టు వచ్చినా.. జాగ్రత్తగా ఉండేందుకు క్వారంటైన్‌లో ఉంచారు. 

57 మంది నుంచి శాంపిళ్లు
జిల్లాలో ఇప్పటివరకు 57 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో 32 మందిని పరీక్షల నిమిత్తం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హైదరాబాద్‌కు తరలించారు. 29 మంది నుంచి కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోనే శాంపిళ్లు సేకరించి హైదరాబాద్‌కు పంపారు. వారిలో నలుగురికి మాత్రమే కరోనా పాజిటివ్‌ రాగా, ముగ్గురు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. (మృతదేహం వద్ద ఫోటోలా? )

యువకుడి రాకతో ‘కరోనా’ కలకలం
సుజాతనగర్‌: మహారాష్ట్ర నుంచి ఓ యువకుడి రాకతో మండలంలోని హరిజనవాడ గ్రామంలో కలకలం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొంతకాలం క్రితం మహారాష్ట్రకు వెళ్లాడు. అక్కడి అధికారులు ఇతనిని క్వారంటైన్‌లో ఉంచారు. తరువాత అక్కడి నుంచి నేరుగా ఖమ్మంలోని తన బంధువుల ఇంటికి వచ్చి, గురువారం హరిజనవాడ గ్రామానికి వచ్చాడు. యువకుని చేతిపై ఉన్న క్వారంటైన్‌ ముద్రను గమనించిన గ్రామస్తులు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్సై, వైద్యాధికారి అక్కడకు చేరుకుని యువకుని వివరాలు సేకరించి అతనిని మణుగూరులోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. యువకుడు గ్రామంలో తిరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. 

పకడ్బందీ చర్యలు.. 
జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు అధికారులు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్‌ ఎంవీరెడ్డి, జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ, వైద్యవిధానపరిషత్, రెవెన్యూ అధికారులు, మున్సిపల్‌ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తగిన జాగత్ర్తలు తీసుకుంటున్నారు. అశ్వాపురం, కొత్తగూడెం ప్రాంతాల్లో ఇంటింటా సర్వే నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారిని హోమ్‌ ఐసోలేషన్‌కు పరిమితం చేశారు. కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, ఎస్పీ సునీల్‌ దత్‌లు జిల్లా సరిహద్దుల వద్ద నిఘా పెంచారు. లాక్‌ డౌన్‌ నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్నారు.

వైద్యులకు, నర్సులకు చేతులెత్తి మొక్కాలి
కరోనా వైరస్‌ వ్యాధి అంటే ప్రజలు భయపడనవసరంలేదని, ప్రభుత్వం చికిత్స అందిస్తూ నయం చేస్తోందని కొత్తగూడేనికి చెందిన పోలీస్‌ ఆఫీసర్‌ తెలిపారు. చికిత్స అందించే వైద్యులకు, నర్సులకు చేతులెత్తి మొక్కాలని అన్నారు. ఇతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో గత మార్చి 23న హైదరాబాద్‌లోని చెస్ట్‌ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. 16 రోజుల అనంతరం కరోనా నెగిటివ్‌ రావడంతో డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టితో బాధితులకు ఎప్పటికప్పుడు మెరుగైన వైద్యసేవలు, పౌష్టికాహారం అందుతున్నాయని, దీంతో వ్యాధి నయమవుతోందని తెలిపారు. రోజూ ఉదయం అల్పాహారం, 11.30 గంటలకు డ్రై ఫ్రూట్స్, మధ్యాహ్నం 1 గంటకు భోజనం, సాయంత్రం 4 గంటలకు తిరిగి డ్రైఫ్రూట్స్, రాత్రిపూట భోజనం, రోజులో మూడుసార్లు టీ అందించారని తెలిపారు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటించాలని, ముఖానికి మాస్క్‌లు ధరించాలని కోరారు.

మరిన్ని వార్తలు