జేసీ ప్రీతిమీనా బదిలీ

24 Dec, 2014 03:02 IST|Sakshi
జేసీ ప్రీతిమీనా బదిలీ

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా బదిలీ అయ్యారు. ఆమెను చేనేత, జౌళి శాఖ డెరైక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో  కొత్త జేసీగా డాక్టర్ ఎన్.సత్యనారాయణ నియమితులయ్యారు. గతంలో జిల్లాలో ట్రెయినీ కలెక్టర్‌గా పనిచేసిన ఆయన ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో సెంట్రల్ జోన్  కమిషనర్‌గా ఉన్నారు. కొత్త జేసీగా వస్తున్న ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, జేసీ ప్రీతిమీనా ఐదునెలల కాలంలోనే బదిలీ కావడం జిల్లా అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు హాజరుకాకపోవడంతోపాటు కొద్దిరోజులుగా ఆమె వ్యవహారశైలి కూడా బదిలీకి కారణమైన ట్టు సమాచారం.
 
 జేసీ ఎక్కడ?
 దామరచర్ల  మండలంలో మంగళవారం సీఎం పర్యటించిన సమయంలో జేసీ ప్రీతిమీనా గురించి కేసీఆర్ అడిగినట్టు సమాచారం. భూముల వివరాలను అధికారులు చెబుతున్న సమయంలో ‘మీ జేసీ ఎక్కడ?’ అని సీఎం కలెక్టర్‌ను ప్రశ్నించారని, ఆమె ఆరోగ్యం బాగాలేనందున సెలవు తీసుకున్నారని కలెక్టర్ చెప్పినట్టు తెలుస్తోంది. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించిన సమయంలో కూడా ఈమె ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, గత బుధవారం సీఎం యాదగిరిగుట్టలో పర్యటించినప్పుడు కూడా ఆమె హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సీఎం ఆమెపై ఆగ్రహంతోనే బదిలీ చేశారని అధికారవర్గాలు చర్చించుకుంటున్నాయి.
 
 అయితే, కొద్ది రోజులుగా ఆమె పనితీరు గురించి కూడా సీఎం అసంతప్తితో ఉన్నారని తెలుస్తోంది. జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని జిల్లాలో కీలకమైన రెవెన్యూ అంశాలను డీల్ చేయడంలో ఆమె కొంత అనాసక్తిగా ఉన్న విషయం కూడా సీఎం దష్టికి వెళ్లినట్టు సమాచారం. ముఖ్యమైన సమావేశాలు, వీడియోకాన్ఫరెన్స్‌లకు కూడా ఆమె గైర్హాజరయ్యేవారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే, జిల్లాలో రాచకొండ గుట్టలు, యాదగిరిగుట్ట అభివద్ధి, దామరచర్ల మండలంలో పవర్‌ప్లాంటు ఏర్పాటులాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉన్నందున ఆమెను బదిలీ చేశారని, ఆమె స్థానంలో జిల్లా గురించి అవగాహన ఉన్న సత్యనారాయణను జేసీగా నియమించినట్టు సమాచారం. ఆయన గురువారం బాధ్యతలు తీసుకునే అవకాశాలున్నాయి.
 
 పొరుగు జిల్లావాసే...
 జేసీగా వస్తున్న డాక్టర్ ఎన్.సత్యనారాయణ స్వస్థలం ఖమ్మం జిల్లా భద్రాచలం. కొత్తగూడెంలో ఇంటర్ చదవిన ఆయన కామారెడ్డిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆపై  ఉస్మానియా వర్సిటీ జూవాలజీలో మాస్టర్ డిగ్రీ చదివారు. నెట్ క్వాలిఫై అయిన ఆయన అక్కడే పీహెచ్‌డీ పూర్తి చేశారు. కొంతకాలం ఆయన లెక్చరర్‌గా పనిచేశారు. అంతేకాదు ఉస్మానియాలోనే లా పూర్తిచేశారు. అనంతరం పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యి 1995లో గ్రూప్-1 ఎంపికయ్యారు. కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఎల్‌బీనగర్‌లలో మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు.
 
 ఆపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్‌బీనగర్ సర్కిల్‌కు డిప్యూటీ మున్సిపల్ కమినసర్‌గా పనిచేశారు. ఆపై రామగుండం మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఆయన 2008లో కన్‌ఫర్డ్ ఐఏఎస్ అయ్యారు. వెంటనే నల్లగొండలో ట్రెయినీ కలెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిం చారు. పురపాలకశాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ప్రసుత్తం సెంట్రల్‌జోన్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. గోల్కొండలో స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహించడంతోపాటు బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
 

మరిన్ని వార్తలు