‘ఉపాధ్యాయ’ మార్గదర్శకాలపై కమిటీ!

3 Mar, 2017 01:46 IST|Sakshi
‘ఉపాధ్యాయ’ మార్గదర్శకాలపై కమిటీ!

ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో ఏర్పాటుకు నిర్ణయం
నియామక అర్హతలు, నిబంధనలపై పరిశీలన
అభ్యర్థులకు తరగతిలో ‘డెమో’ బోధన పరీక్ష!
ఈ అంశాలన్నింటినీ పరిశీలించనున్న కమిటీ
కమిటీ ప్రతిపాదనల పరిశీలన అనంతరమే నోటిఫికేషన్‌!


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టుల భర్తీ అంశంపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఇప్పటికే ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి ప్రాథమిక అంచనాకు వచ్చిన విద్యాశాఖ.. నియామకాలపై మార్గదర్శకాల రూపకల్ప నకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ కిషన్‌ నిర్ణయించారు. ఇటీవల గురుకుల పోస్టుల భర్తీకి నిర్ణయించిన నిబం ధనలు వివాదాస్పదం కావడం, ఆ నోటిఫికే షన్‌ను రద్దు చేసిన నేపథ్యంలో... ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్‌ పోస్టుల భర్తీకి పక్కాగా నిబంధనలను రూపొందించనున్నారు. దీనిపై కిషన్‌ గురువారం ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ జగన్నాథరెడ్డితో చర్చించారు. ఒకటి రెండు రోజుల్లో ఉన్నత స్థాయి కమిటీని ప్రకటించే అవకాశముంది.

జాతీయ ఉపాధ్యాయ నిబంధనల మేరకే..
జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారమే పోస్టుల భర్తీకి అర్హతలను నిర్ణయిస్తామని ఈ సందర్భంగా కిషన్‌ వెల్లడించారు. ఇప్పటికే కేటగిరీల వారీగా పోస్టులకు ఉండాల్సిన అర్హతలను ఎన్‌సీటీఈ స్పష్టంగా నోటిఫై చేసిందని, వాటి ప్రకారం రాష్ట్రంలో నిబంధనలు రూపొందిస్తామని తెలిపారు.

డెమో బోధన, ఇంటర్వూ్య?
టీచర్‌ నియామకాల్లో తరగతి బోధనపై డెమో (ప్రత్యక్షంగా బోధించి చూపడం) విధానం ఉంటే బాగుంటుందని విద్యాశాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు టీచర్లకు బోధించడం సరిగా రావడం లేదని విద్యాశాఖ ఇప్పటికే గుర్తించింది. అయితే రాష్ట్రంలో సుమారు 8 వేల వరకు పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని అంచనా. రాతపరీక్ష తర్వాత ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున ఎంపిక చేసి డెమో నిర్వహించా లనుకున్నా.. వేల మంది అభ్యర్థులకు డెమో నిర్వహించాల్సి ఉంటుంది. ఇది ఆచరణ సాధ్యమేనా, కాదా అన్న సందేహాలూ తలెత్తుతున్నాయి. మరోవైపు డెమో కాకపోతే ఇంటర్వూ్యలైనా నిర్వహించాలన్న యోచన చేస్తున్నారు. ఈ అంశాలన్నింటిని ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది.

నియామకమైన తర్వాతా శిక్షణ!
టీచర్లుగా నియమితులైన వారికి జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్‌) ఆరు నెలల పాటు ఇండక్షన్‌ ట్రైనింగ్‌ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో పొందుపరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పరిశీలించాలన్న యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ఇండక్షన్‌ ట్రైనింగ్‌ నిర్వహించాలా, వద్దా? అన్న అంశాన్నీ ఉన్నత స్థాయి కమిటీ తేల్చనుంది. మొత్తంగా అర్హతలు, నిబంధనలపై ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదనలు ఇచ్చిన అనంతరం.. వాటిపై తుది నిర్ణయం తీసుకున్నాకే టీచర్ల భర్తీ నోటిఫికేషన్‌ జారీ కానుంది.

టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నిర్ణయించిన మేరకు ఉపాధ్యాయ ఖాళీల భర్తీని టీఎస్‌ పీఎస్సీకే అప్పగించనున్నారు. గతంలో జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) ద్వారా టీచర్‌ పోస్టులను భర్తీ చేసేవారు. ఇప్పుడు టీఎస్‌పీ ఎస్సీకి అప్పగిస్తున్నందున కొత్త నిబంధనలు రూపొందించాల్సిన అవసరముంది. అందు వల్లే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు విద్యా శాఖ వర్గాలు తెలిపాయి.
 

మరిన్ని వార్తలు