ఘట్‌కేసర్‌–మౌలాలి మధ్య ఫోర్‌లేన్‌

13 Mar, 2020 01:07 IST|Sakshi

అందుబాటులోకి వచ్చిన ఎంఎంటీఎస్‌–2 ప్రాజెక్టు కొత్త డబుల్‌ మార్గం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ప్రధాన రవాణా మార్గాల్లో ఒకటిగా ఉన్న ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు రెండో దశలో కీలక మార్గంలో కొంత భాగం అందుబాటులోకి వచ్చింది. సనత్‌నగర్‌–ఘట్‌కేసర్‌ మధ్య ఎంఎంటీఎస్‌ రైళ్లు నడిపే లక్ష్యంతో ఆ ప్రాజెక్టు రెండో దశలో పనులను చేర్చారు. ఘట్‌కేసర్‌ నుంచి మౌలాలి మీదుగా మౌలాలి హౌసింగ్‌బోర్డు కాలనీ, ఫిరోజ్‌గూడ, సుచిత్ర కూడలి, నేరెడ్‌మెట్‌ మీదుగా 35 కిలోమీటర్ల మేర ఈ మార్గం కొనసాగుతుంది.కీలకమైన ఘట్‌కేసర్‌–మౌలాలి మధ్య తాజా గా  డబుల్‌ లేన్‌ నిర్మించారు. ఇప్పటికే ఆ మార్గంలో డబుల్‌ లేన్‌ ఉండగా, దానికి అదనంగా కొత్తగా రెండు వరసల మార్గం అందుబాటులోకి వచ్చింది. దానికి ఎలిక్ట్రిఫికేషన్, ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ అనుసంధానం పూర్తి కావటంతో సాధారణ రైళ్లు నడిపేందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్‌ పచ్చజెండా ఊపటంతో బుధవారం నుంచి రైళ్లను నడుపుతున్నారు.

మౌలాలి నుంచి సనత్‌నగర్‌ వరకు ఎంఎంటీఎస్‌ మార్గం పూర్తి కావాల్సి ఉన్నందున వాటిని నడిపేందుకు ఇంకా సమయం పట్టనుంది. ఎంఎంటీఎస్‌ రైళ్ల కోసం నిర్మించిన ఈ కొత్త డబుల్‌లేన్‌ మీదుగా రైళ్లు దూసుకెళ్లేందుకు కొంతకాలం నిరీక్షించక తప్పని దుస్థితి నెలకొంది. ఘట్‌కేసర్‌ నుంచి మౌలాలి వరకు రూపుదిద్దుకున్న కొత్త డబుల్‌లేన్, అక్కడి నుంచి సనత్‌నగర్‌కు మళ్లాల్సి ఉంది. ఆ డైవర్షన్‌ మౌలాలి హౌసింగ్‌బోర్డు కాలనీ మీదుగా అమ్ముగూడ మార్గంలో ప్రస్తుతం ఉన్న సింగిల్‌ లేన్‌తో అనుసంధానం కావాల్సి ఉంది. సనత్‌నగర్‌ మీదుగా సుచిత్ర, రామకృష్ణాపురం, నేరెడ్‌మెట్‌ మీదుగా ప్రస్తుతం సాగుతున్న ఆ సింగిల్‌లేన్‌ను కేవలం గూడ్సు రైళ్లు నడిపేందుకే పరిమితం చేశారు. దానిని అనుసంధానిస్తూ కొత్తగా డబుల్‌లేన్‌ రూపొందించాల్సి ఉంది. కానీ మధ్యలో కొంత భాగం రక్షణ శాఖ స్థలాలున్నాయి. వాటిని స్వాధీనం చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.

ఎంతో ఊరట 
సికింద్రాబాద్‌–కాజీపేట ప్రధాన మార్గంలో ఉన్న ఘట్‌కేసర్‌–మౌలాలి స్టేషన్ల మధ్య అందుబాటులోకి వచ్చిన కొత్త డబుల్‌ లేన్‌ ఇప్పుడు రైళ్ల రద్దీతో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఎంతో ఊరటనివ్వబోతోంది. సికింద్రాబాద్, కాజీపేట, నడికుడి (గుంటూరు), సనత్‌నగర్‌ (బైపాస్‌)లను అనుసంధానిస్తుంది. ఈ 12.2 కి.మీ. మేర రెండు వరసలతో ట్రాక్‌ నిర్మాణానికి రూ.200 కోట్లు ఖర్చయింది.

మరిన్ని వార్తలు