నిజాం నిధులెవరికి?

3 Jul, 2019 02:56 IST|Sakshi

తమవంటే తమవంటున్న పాక్, భారత్, నిజాం వారసులు

సాక్షి, హైదరాబాద్‌: నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ దాచుకున్న భారీ నగదు వివా దం త్వరలో తేలిపోనుంది. హైదరాబాద్‌పై సైనిక చర్యకు కొన్ని రోజుల ముందు పాకిస్తాన్‌లోని బ్రిటిష్‌ హైకమిషనర్‌కు బదిలీ అయిన మొత్తం రూ.వందల కోట్లకు చేరటంతో భారత్, పాకిస్తాన్‌తో పాటు నిజాం వారసుల్లోనూ కదలిక మొదలైంది. హైదరాబాద్‌ సంస్థానాన్ని విలీనం చేసే దిశగా భారత సైన్యాలు వస్తున్నాయన్న సమాచారంతో ఆరో నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ 1948లో 1.7 లక్షల పౌండ్లను పాకిస్తాన్‌లోని బ్రిటిష్‌ హైకమిషనర్‌కు బదిలీ చేశారు. అయితే ఈ నిధులపై అప్పటి నుంచి భారత్, పాకిస్తాన్‌లు న్యాయ పోరాటం చేస్తుండగా, ఇందులో నిజాం వారసులు ముకర్రంజ, ముఫకంజ కూడా నిధులు తమకే చెందుతాయంటూ వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలు విన్న బ్రిటన్‌ హైకోర్టు వచ్చే నెలలో తీర్పు ఇవ్వనుందని నిజాం వారసులు పేర్కొంటున్నారు. లండన్‌లోని నాట్‌వెస్ట్‌లో బ్యాంక్‌లో జమ అయిన నిధులు.. ప్రస్తుత లెక్కల ప్రకారం సుమారు రూ.304 కోట్లకు చేరాయి. ఈ నిధులు మావంటే, మావేనని ఇరు దేశాలు నాలుగున్నర దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తున్నాయి. 
కుమారుడు ఆజంజా, కోడలు దుర్రేషెవార్, మనుమలు ముకర్రం, ముఫకంజాలతో ఉస్మాన్‌ అలీఖాన్‌. చిత్రంలో అప్పటి గవర్నర్‌ భీంసేన్‌ సచార్‌ 

ఆయుధాల కోసమన్న పాకిస్తాన్‌.. 
హైదరాబాద్‌ విలీనానికి ముందు ఉస్మాన్‌ అలీఖాన్‌ వద్ద ప్రధానమంత్రిగా ఉన్న లాయక్‌ అలీ నగదును పాకిస్తాన్‌లోని బ్రిటిష్‌ హైకమిషనర్‌కు బదిలీ చేశారు. దేశ విభజన అనంతరం లాయక్‌ అలీ పాకిస్తాన్‌ పౌరసత్వం పొందటంతో ఈ నిధులు తమకే చెందుతాయని పాకిస్తాన్‌ వాదించింది. దీనికి తోడు భారత్‌ దాడిని ఎదుర్కొనేందుకు ఉస్మాన్‌ అలీఖాన్‌ ఆయుధాల సరఫరా కోసం ఆ మొత్తాన్ని తమకు పంపాడని కూడా పేర్కొంది. తీర్పు భారత్, నిజాం వారసులకు అనుకూలంగా వస్తే ఎవరి వాటా ఎంత అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. నిజాం అసలు వారసులతో పాటు మరో 4 వేల మంది వరకు క్లెయిమ్‌ చేసుకుంటున్నారని నిజాం పాలనపై పరిశోధన చేసిన ఇజాస్‌ ఫారుఖీ ‘సాక్షి’కి తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయవాది వెంకటరమణ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ రాష్ట్ర ప్రజల ఆస్తినే నిజాం పంపారని పేర్కొన్నారు. అందుకే ఈ మొత్తాన్ని తెలంగాణకు వచ్చేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

ముకర్రంజ పరివారం: భార్యలు: ఎస్త్రా(టర్కీ)హెలెన్, మనోలియా ఒనూర్, జమీల (మొరాకో), ఒర్చిడ్‌ (టర్కీ), వీరందరికీ ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరంతా ఇప్పుడు టర్కీ, ఆస్ట్రేలియా, లండన్‌లో స్థిరపడ్డారు.  
ముఫకంజ: భార్య ఏసెస్‌(టర్కీ), పిల్లలు: రఫత్‌ జా, ఫర్హత్‌ జా 
వీరు కాకుండా నిజాం వారసులుగా మరో 3,600 మంది చలామణి అవుతున్నారు. ప్రస్తుతం ముకర్రంజ ఆస్ట్రేలియా, టర్కీలలో, ముఫకంజ లండన్, హైదరాబాద్‌లలో నివసిస్తున్నారు. 

మరిన్ని వార్తలు