‘చట్టసభల్లో బీసీ ప్రతినిధుల సంఖ్య పెరగాలి’

10 Jul, 2018 13:06 IST|Sakshi
జస్టిస్‌ ఈశ్వరయ్య(పాత చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌ : చట్టసభల్లో బీసీ ప్రతినిధుల సంఖ్య పెరగాలని జస్టిస్‌ ఈశ్వరయ్య అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగిన జాతీయ ఓబీసీ ఫెడరేషన్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బండారు దత్తాత్రేయ, పొన్నాల లక్ష్మయ్య, ఎల్‌ రమణ, దేవేందర్‌ గౌడ్‌లతో పాటు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. చైతన్యం ద్వారానే మార్పు సాధ్యమని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల్లో శాస్త్రీయత లేకుండా గత ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని విమర్శించారు.

జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు ఆ దిశలో చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బీసీలంతా ఒకేతాటి పైకి రావాలని పిలుపునిచ్చారు. బీసీలకు రాజ్యాధికారం రావాలన్నారు. ఓటుకు నోటు ఇస్తున్నారు.. అయినా బీసీ సామాజిక వర్గానికే ఓటు వేయాలని కోరారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒత్తిడి పనిచేస్తోంది.. ఒత్తిడితోనే మన హక్కులు సాధించుకోవాలన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా బీసీలు ఎదగాలని అకాంక్షించారు.

మరిన్ని వార్తలు