సమస్యతో వచ్చి... చిరునవ్వుతో ఇంటికి...

26 May, 2018 10:13 IST|Sakshi

కూకట్‌పల్లి/కేపీహెచ్‌బీ: తడబడుతూ ‘మన నగరం’ కార్యక్రమానికి వచ్చిన ఓ వృద్ధ మహిళ చిరునవ్వులతో ఇంటికి తిరుగుముఖం పట్టారు. మన నగరం కార్యక్రమానికి వచ్చిన వారిలో కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డుకు చెందిన శేషానవరత్నం అనే 85 ఏళ్ల వృద్ధురాలు మంత్రి కేటీఆర్‌ దృష్టిలో పడ్డారు. ఆమె నేరుగా  తన సమస్యను మంత్రికి తెలిపేందుకు వచ్చాననడంతో మంత్రి ఆమెను స్వయంగా తనవద్దకు పిలిపించుకొని మాట్లాడారు. స్టేజిపైన తన పక్కనే కూర్చొబెట్టుకొని ఆమె సమస్య శ్రద్ధగా విన్నారు.

తాను నివాసం ఉంటున్న అపార్ట్‌ మెంట్‌ కింది భాగంలో ఒక రెస్టారెంట్‌ వారు అక్రమంగా కిచెన్‌ నడుపుతున్నారని, కోర్టు కేసులతో దాన్ని కొనసాగిస్తున్నారని వివరించారు. దాని నుంచి వచ్చే వేడి వల్ల తమకు ఇబ్బందిగా ఉందని, దానికి ఫైర్‌ ఎన్‌ఓసీ కూడా లేదని తెలిపారు.  తమకు న్యాయం చేయాలని కోరారు. వేంటనే స్పందించిన  కేటీఆర్‌ జోనల్‌ కమిషనర్‌ హరిచందనతో పాటు సీసీపీ దేవేందర్‌రెడ్డికి ఈ అంశంలో తగిన  చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్యను పరిష్కరిస్తామని ఆమెకు  హమీ ఇచ్చిన మంత్రి, శేషా నవరత్నంను జాగ్రత్తగా వాహనంలో ఆమె ఇంటి వద్ద దింపాలని అధికారులకు చెప్పారు. దాంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు.

మరిన్ని వార్తలు