ఏ మొహంతో ఓట్లు అడుగుతుండ్రు

5 Mar, 2016 02:13 IST|Sakshi
ఏ మొహంతో ఓట్లు అడుగుతుండ్రు

  విపక్షాలపై మంత్రుల ధ్వజం
 
అచ్చంపేట: రాష్ట్రంలో 65ఏళ్ల పాలన సాగించిన కాంగ్రెస్, టీడీపీలు ప్రజలను కష్టాల్లోకి నెట్టాయని, ఇప్పుడు ఏ మొహంతో ఓట్లు అడుగుతున్నారని మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విపక్ష నాయకులపై ధ్వజమెత్తారు. అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చివరిరోజు పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ జిల్లా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. ఏడాదిన్నర పాలన చేసిన తమను నీళ్లు లేవని అడుతున్నారని.. ఇన్నేళ్లు అధికారంలో ఉండి మీరు ఎందుకు తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు.

మీరు ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ గతి ఉండేదికాదన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఏప్రిల్, మేలో అలంపూర్, గద్వాల, జూన్, జూలైలో అచ్చంపేటకు తాగునీళ్లు వస్తాయని చెప్పారు. అచ్చంపేటలో తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు 60బోర్లు వేసి 30సింగిల్‌ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు బిగించామని, 10 ట్యాంకర్ల ద్వారా ప్రతివార్డులో తాగునీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. అచ్చంపేటకు 1900 డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు మంజూరుచేసినట్లు చెప్పారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నందుకే ఓట్లు అడుగుతున్నామని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు