ఇసుక అక్రమంగా తరలిస్తే పీడీ యాక్టు

21 Feb, 2015 04:56 IST|Sakshi

తాండూరు రూరల్: కాగ్నా నది పరీవాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని  కలెక్టర్ రఘునందన్‌రావు హెచ్చరించారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన శుక్రవారం తాండూరు నియోజకవర్గంలో పర్యటించారు. బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం తాండూరు ఎంపీడీఓ అతిథి గృహాంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేస్తామని, యజమానులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

ఇకనుంచి ఇసుక అక్రమ రవాణాపై నిఘాపెంచుతామని, రాత్రి వేళ తనిఖీలను ముమ్మరం చేయాలని సిబ్బందికి సూచించామని కలెక్టర్ వెల్లడించారు. తాండూరు పరిసరాల్లో అక్రమంగా నాపరాతి తవ్వకాలు చేపడితే యజమానులపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో అధికారులు తాండూరులో పేదలకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చారని, కానీ వాటికి స్థలాలు చూపలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో మట్లాడి వివరాలు సేకరిస్తానన్నారు.
 
క్రమబద్ధీకరణలో 42 వేల దరఖాస్తుల పరిశీలన
జిల్లాలో ఇప్పటి వరకు 42,462 క్రమబద్ధీకరణ దరఖాస్తులను పరిశీలించామని, జిల్లా వ్యాప్తంగా లక్షా 50 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. మిగతా దరఖాస్తులను త్వరలోనే విచారిస్తామన్నారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్-2 ఆమ్రపాలి, వికారాబాద్ సబ్‌కలెక్టర్ అలుగు వర్షిణి ఉన్నారు.
 
ఆకస్మిక తనిఖీ
బషీరాబాద్: బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ రఘునందన్‌రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  రెవెన్యూ సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. సిబ్బంది కొరతపై ఆరా తీశారు. అనంతరం రెవెన్యూ, మండల పరిషత్, ఉపాధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బషీరాబాద్ ఎంపీపీ కరుణ, జెడ్పీటీసీ సభ్యురాలు సునిత, బషీరాబాద్ సర్పంచ్ జయమ్మలు కలెక్టర్‌ను మండల సమస్యలను విన్నవించారు. బషీరాబాద్- తాండూరు రోడ్డు మార్గం పనులు కొనసాగడం లేదని, పనులను త్వరగా పూర్తి చేయించాలని కోరారు. మండల పరిధిలోని కొర్విచెడ్, నవల్గ, క్యాద్గిరా గ్రామాలకు చెందిన నాపరాతి కార్మికులకు నాపరాతిని తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ రవికుమార్, ఏపీఓ వీరాంజనేయులు తదితరులున్నారు.

>
మరిన్ని వార్తలు