‘రెడ్‌ కేటగిరీ’తో అనర్థాలు

20 Oct, 2019 11:13 IST|Sakshi
ఆకుపచ్చగా మారిన పడకల్‌ పెద్ద చెరువు నీరు

కాలుష్య పరిశ్రమల అనుమతులపై ప్రజల్లో భయాందోళనలు

అధికారుల ఉదాసీనత  

సాక్షి, నిజామాబాద్‌: జిల్లాలో రెడ్‌ కేటగిరి పరిశ్రమలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కాలుష్య పూరితమైన పరిశ్రమలు సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. గ్రామీణ, పట్టణ, నగర శివారులలో వెలిసిన పరిశ్రమలతో జనం ఆందోళన చెందుతున్నారు. ఓవైపు ప్రభుత్వం కాలుష్యం వదిలే వాటిని ప్రజా నివాసాలకు దూరంగా తరలించే ఆలోచన చేస్తున్నా వాటి యాజమాన్యాలు మాత్రం ఉలుకూపలుకూ లేకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నాయి. జిల్లాలో రెడ్‌ కేటగిరి పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్య కారకాలపై ప్రత్యేక కథనం.. 

నియంత్రణ కరువు.. 
కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతుల ప్రకారం ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో 111, కామారెడ్డి జిల్లాలో 32 పరిశ్రమలు ఉన్నాయి. వాటిని నాలుగు కేటగిరీలుగా విభజించింది. కాలుష్యం తక్కువగా వెదజల్లే వాటిని ఆరెంజ్, కాలుష్య రహిత పరిశ్రమలను ఆకుపచ్చ, తెలుపు రంగులోకి మార్చింది. సీఎఫ్‌వో అనుమతి లేని పరిశ్రమలలో రైస్‌ మిల్లులు, కంకర క్వారీలు, నూనె మిల్లులు, చక్కర ఫ్యాక్టరీలు ఉన్నాయి. పీపీటీ నిబంధన ప్రకారం ప్రతి పరిశ్రమలో నీటి శుద్ధి కేంద్రం, గాలి, కాలుష్య నివారణ యంత్రాలు, మురుగు నీటి శుద్ధి చేయు యంత్రాలు అందుబాటులో ఉండాలి. అయితే ఇవేమి పట్టించుకోకుండా అధికారులు ఇష్టానుసారంగా సీఎఫ్‌వో అనుమతులు(కాన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌) ఇచ్చేస్తున్నారు. అధికారులు తమ ఉనికిని చాటుకునేందుకు నోటీసులు అందించి చేతులు దులుపుకుంటున్నారు.

జిల్లాలోని పరిస్థితి ఇదీ.. 
రెడ్‌ కేటగిరి పరిశ్రమల కారణంగా జిల్లాలో గాలి, నీరు ఎక్కువగా కలుషితమవుతోంది. నిజామాబాద్‌ నగర శివారులో, రూరల్‌ మండలాల్లో వెలిసిన రైస్‌ మిల్లుల ద్వారా వచ్చే ఊకదమ్ముతో పారిశ్రామిక వాడల ప్రజలు బెంబేలెత్తుతున్నారు.  
జక్రాన్‌పల్లి మండలంలోని పడకల్‌ పెద్ద చెరువు సమీపంలో నిర్మించిన బయో మెడికల్‌ వేస్టేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు నుంచి వెలువడుతున్న కలుషిత రసాయనాల కారణంగా పెద్ద చెరువు నీరు ప్రతి ఏటా వర్షాకాలంలో ఆకుపచ్చగా మారుతున్నాయి. 
జక్రాన్‌పల్లి, డిచ్‌పల్లి, ధర్పల్లి, మాక్లూర్‌ మండలాల్లో జాతీయ రహదారి వెంట వెలిసిన కంకర క్వారీల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా అనారోగ్యాల పాలవుతున్నారు. 
నిజామాబాద్‌రూరల్, మోపాల్‌ మండలాల్లో కొన్ని నూనె మిల్లులు సరైన కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడం లేదు. 

సామర్థ్యం మించి ఉత్పత్తి.. 
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రెడ్, ఆరెంజ్‌ కేటగిరి పరిశ్రమలల్లో సామర్థం మేరకు అనుమతులు పొంది ఉత్పత్తి మాత్రం సామర్థ్యానికి మించి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల అనుమతి ఒకటైతే ఉత్పత్తి మరొకటి అన్నట్లుగా తయారయ్యాయి. ఫలితంగా ఆయా పరిశ్రమలు చుట్టు పక్కల వారిని కాలుష్య కాటకం వేధిస్తోంది.   

మరిన్ని వార్తలు