ఏకపక్షంగా ఆర్డినెన్స్ తెచ్చారు: చాడ

16 Jun, 2014 17:19 IST|Sakshi

నల్లగొండ: తెలంగాణ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు గుదిబండగా మారిందని, అధికారం చేతిలో ఉంది కదా అని ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఏకపక్షంగా ఆర్డినెన్స్ తెచ్చారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు.

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఆర్డినెన్స్‌లు తెచ్చి తెలంగాణలో ఉండాల్సిన గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేశారని విమర్శించారు. దీనిని వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. వ్యవసాయ రుణాలను రూ. లక్ష వరకు మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టిందని, ఇప్పుడు రూ. లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని చెబుతున్నారని తెలిపారు.

ఎలాంటి కాలపరిమితి, షరతులు లేకుండా రూ.లక్ష వరకు అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.దీనిపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. వర్షాకాలం ముంచుకొస్తున్నందున కొత్త రుణాలిచ్చేలా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. మద్యం మాఫియాపై ఉన్న కేసులపై టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు