ప్రచారం, ప్రసారాలపై నిఘా

18 Mar, 2020 02:11 IST|Sakshi

‘కోవిడ్‌’వదంతులపై పోలీసు కేసులు 

అవసరమైతే ప్రధాన మీడియాపైనా ఆంక్షలు... విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వైరస్‌ విస్తరిస్తున్న దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ప్లాన్‌–బీలో భాగంగా జనం రద్దీ అధికంగా ఉండే విద్యా సంస్థలు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, బార్లు, జిమ్‌లు తదితరాలను మూసివేయమని ఆదేశించింది. అవసరమైతే ప్లాన్‌–సీని అంటే కర్ఫ్యూ తరహా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (ఎన్‌డీఎంఏ)–2005 ప్రకారం.. ప్రభుత్వం ఈ విషయంలో అన్ని చర్యలు తీసుకుంటోంది. ఓవైపు నివారణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు చూసుకుంటూనే మరోవైపు వదంతులు, పుకార్లపైనా దృష్టి సారించాలని పోలీసుశాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.  

ఏయే సెక్షన్ల కింద చర్యలంటే... 
ఏదైనా విపత్తు తలెత్తినప్పుడు కొందరు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా తప్పుడు వార్తలు, వదంతులు ప్రచారం చేస్తుంటారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఎన్‌డీఎంఏ–2005 (సెక్షన్‌ 54) చట్టం వీలు కల్పిస్తుంది. 2005లో ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో పలు విపత్తులు సంభవించినా.. వదంతులు పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు. కానీ, సోషల్‌ మీడియా, ఉచిత డేటా అందుబాటులోకి వచ్చాక.. స్మార్ట్‌ ఫోన్ల సాయంతో కొందరు వదంతులను ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా ప్రజల్లో ఆందోళనలను పెంచుతున్నారు. 2018లో వాట్సాప్‌ గ్రూపుల్లో చిన్నపిల్లలను ఎత్తుకుపోతున్న ముఠాలు అంటూ పలువురి మరణాలకు వదంతులు కారణమైన సందర్భంలో ఈ చట్టం ప్రకారం దేశంలో పలుచోట్ల కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కోవిడ్‌ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సోషల్‌ మీడియాల్లో వదంతులు ప్రచారం చేసేవారిపై రాష్ట్ర పోలీసులు నిఘా పెట్టారు. 

వాట్సాప్‌ అడ్మిన్‌ కూడా బాధ్యుడే.. 
తెలిసో తెలియకో కొందరు ప్రజల్లో భయాందోళనలు కలిగించే తప్పుడు పోస్టులను షేర్‌ చేస్తుంటారు. తాజాగా సోమవారం ఈ ఆరోపణలపై భువనగిరిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అందులో వాట్సాప్‌ అడ్మిన్‌ కూడా ఉండటం విశేషం. కాబట్టి, ఇలాంటి పోస్టుల పట్ల గ్రూప్‌ అడ్మిన్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే అడ్మిన్‌ మాత్రమే పోస్టులు పెట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

ప్రధాన మీడియాపైనా... 
విపత్తుల సమయంలో ప్రధాన మీడియాపైనా ఆంక్షలు విధించే అధికారాన్ని ఎన్‌డీఎంఏ–2005 కల్పిస్తోంది. ఈ చట్టంలోని సెక్షన్‌ 67 ప్రకారం.. విపత్తులకు సంబంధించి ప్రజల్ని భయభ్రాంతులకు, ఆందోళనలకు గురిచేసే సమాచార విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి. 

మరిన్ని వార్తలు