రంగయ్య మృతిపై రాజకీయం.. రాష్ట్రస్థాయి నాయకుల క్యూ

5 Jun, 2020 09:17 IST|Sakshi
రంగయ్య కుటుంబసభ్యులతో టీఆర్‌ఎస్‌ నేతలు

ఠాణాలో ఆత్మహత్యపై టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య రగడ

న్యాయ విచారణకు కాంగ్రెస్‌ డిమాండ్‌

వేధింపులు లేవంటూ టీఆర్‌ఎస్‌ నేతల కౌంటర్‌

ఇప్పటికే విచారణకు హైకోర్టు ఆదేశం

మంథనిలో మళ్లీ రాజకీయ దుమారం

సాక్షి, పెద్దపల్లి : కస్టడీలో ఉన్న నిందితుడు మంథని ఠాణాలో ఆత్మహత్య చేసుకున్న ఉదంతం రాజకీయరంగు పులుముకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మంథని పోలీసు స్టేషన్‌లో ఉరేసుకున్న రంగయ్య వ్యవహారం మంథనిలో రాజకీయ దుమారం లేపుతోంది. ఇప్పటికే ఈ సంఘటనపై హైదరాబాద్‌ సీపీని విచారాణాధికారిగా హైకోర్టు నియమించింది. మరో వైపు రంగయ్య కుటుంబసభ్యులకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నేతల పరామర్శల పరంపర కొనసాగుతోంది. 

కస్టడీలో ఆత్మహత్య..
విద్యుత్‌ తీగలు అమర్చి వన్యప్రాణులను వేటాడుతున్నారనే అభియోగంపై గత నెల 24న రంగయ్యతోపాటు మరో ముగ్గురిని మంథని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంథని మండలం లక్కేపూర్‌ శివారులో విద్యుత్‌ తీగలు అమర్చిన సమయంలో ఎస్సై ఓంకార్‌ ఈ నలుగురిని పట్టుకున్నారు. రామగిరి మండలం బుధవారంపేట పంచాయతీ పరిధిలోని రామయ్యపల్లికి చెందిన శీలం రంగయ్య(52) కేసులో ఏ3గా ఉన్నాడు. కాగా, కస్టడీలో ఉండగానే 26వ తేదీన తెల్లవారుజామున ఠాణా ఆవరణలోని  బాత్‌రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  చదవండి: పోలీస్‌స్టేషన్‌లో నిందితుడి ఆత్మహత్య

విచారణకు హైకోర్టు ఆదేశం
పోలీసు స్టేషన్‌లో రంగయ్య ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కస్టడీలో ఉన్న రంగయ్య ఆత్మహత్యపై అనుమానాలున్నట్లు మంథనికి చెందిన న్యాయవాది నాగమణి హైకోర్టుకు లేఖ రాశారు. లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు సమగ్ర విచారణకు ఆదేశించింది. హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ను విచారణాధికారిగా నియమించింది. మంథని ఎస్సై నుంచి ప్రభుత్వ సీఎస్‌ వరకు నోటీసులు జారీ చేసింది. కాగా ఇప్పటి వరకు మంథనికి విచారణాధికారి రాకపోవడంతో.. కోర్టును మరింత గడువు కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

పరామర్శిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
రాజకీయ దుమారం
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే వర్గపోరుకు మంథని నియోజకవర్గం పెట్టింది పేరు. ఇక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఆధిపత్య పోరుకు రెండు గ్రూపులు రంగంలోకి దిగుతున్నాయి. రంగయ్య మృతి ఘటన కూడా సహజంగానే రాజకీయాలకు వేదికగా మారింది. రంగయ్య మృతిపై న్యాయ విచారణ జరిపించాలని, ప్రభుత్వం స్పందించాలని స్థానిక ఎమ్మెల్యే, పీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క స్వయంగా రామయ్యపల్లికి వచ్చి రంగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. చదవండి: మళ్లీ గ్యాంగ్‌‘వార్‌’

కాగా, ఈ సంఘటనను అనవసరంగా రాజకీయం చేస్తున్నారని జెడ్పీ చైర్మన్, టీఆర్‌ఎస్‌ నేత పుట్ట మధు కాంగ్రెస్‌ నేతల తీరును తప్పుపట్టారు. ఈ క్రమంలోనే రంగయ్య కుమారుడు అనిల్‌ స్పందించాడు. తన తండ్రిని పోలీసులు వేధించలేదని, మృతిని రాజకీయానికి వాడుకోవద్దని కోరారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నేతల నడుమ మాటల యుద్ధం తీవ్రమైంది. భట్టివిక్రమార్క పరామర్శించి వెళ్లిన మరుసటి రోజు గురువారం పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్‌నేత సైతం రంగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కావాలనే రాజకీయం చేస్తున్నారని భట్టివిక్రమార్కపై విమర్శలు గుప్పించారు. 

ఖాకీల రాజీ!
పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్న రంగయ్య వివాదం సద్దుమణిగేలా కొంతమంది పోలీసులు కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన రాజకీయరంగు పులుముకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే పరిస్థితి కనిపించడంతో ముందు జాగ్రత్తపడినట్లు సమాచారం. గతంలో ఇక్కడ పనిచేసి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న పోలీసు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో రాజీ కుదిర్చి, వాస్తవాలను వెలుగు చూడకుండా చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా రంగయ్య మృతి ఉదంతంపై హైకోర్టు విచారణకు ఆదేశించడం...హైదరాబాద్‌ సీపీ విచారణాధికారిగా నియమించడం.. సీఎల్పీ నేత న్యాయవిచారణకు డిమాండ్‌ చేస్తుండడంతో ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారింది. 
 

మరిన్ని వార్తలు