భారీ ప్రాజెక్టుల్లోనూ పూడికతీత

21 Jan, 2016 11:30 IST|Sakshi
భారీ ప్రాజెక్టుల్లోనూ పూడికతీత

♦ తొలిసారి ఎస్సారెస్పీ, నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టుల్లో పనులు
♦ దాదాపు 30 టీఎంసీల మేర వాస్తవ నిల్వ సామర్ధ్యం తగ్గిన ఎస్సారెస్పీ
♦ నీటి నిల్వ డెడ్‌స్టోరేజీకి చేరడంతో పూడిక  తీయడంపై ప్రతిపాదన
♦ ఉపాధిహామీతో అనుసంధానంపై ప్రభుత్వం సానుకూలం
 
 సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ’ ద్వారా చెరువుల్లో పూడికతీత చేపట్టిన నీటి పారుదల శాఖ ప్రస్తుతం భారీ సాగునీటి ప్రాజెక్టుల్లోనూ ఈ చర్యలు చేపట్టే ఆలోచనలు చేస్తోంది. గత రెండేళ్లుగా సరైన వర్షాలు లేక నీటి నిల్వలు పడిపోయి నిర్జీవంగా మారిన ప్రాజెక్టుల్లో సారవంతమైన పూడిక(మట్టి) ఉందని, దాన్ని తరలించుకునేందుకు రైతులు సైతం ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుల్లో పూడికతీత అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ పనులను ‘ఉపాధి హామీ’తో అనుసంధానించి, కరువు మండలాల్లోని రైతు కూలీలకు సాయపడాలని ప్రభుత్వం భావిస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల్లో పూడికతీతపై కలెక్టర్ నుంచి నీటి పారుదల ముఖ్య కార్యదర్శికి ప్రతిపాదన రాగా, దాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.

 రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో పూడిక సమస్య పెరిగిపోయింది. కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఇప్పటికే పూడిక కారణంగా భారీగా నిల్వ సామర్ధ్యం తగ్గిపోగా, గోదావరి పరిధిలోని ప్రాజెక్టుల్లోనూ అదే పరిస్థితి ఉంది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, పోచారం ప్రాజెక్టుల్లోనూ పూడిక సమస్య తీవ్రంగా ఉంది. ఇక ఎస్సారెస్పీని 112 టీఎంసీల సామర్ధ్యంతో చేపట్టగా పూడిక కారణంగా అది ప్రస్తుతం 90 టీఎంసీలకు పడిపోయింది. 2014లో చేపట్టిన హైడ్రాలిక్ సర్వేలో మరో 10 టీఎంసీల మేర తగ్గి 80.10 టీఎంసీలకు చేరినట్లు అధికారులు తేల్చారు.

ఇక నిజాంసాగర్‌ను 1931లో 28 టీఎంసీల సామర్ధ్యంతో చేపట్టగా భారీ పూడిక కారణంగా 1973 నాటికి అది 11.8 టీఎంసీలకు చేరింది. తర్వాతి కాలంలో నిల్వ సామర్ధ్యాన్ని పెంచడంతో 6 టీఎంసీల మేర పెరిగి ప్రస్తుతం 17.8 టీఎంసీల సామర్ధ్యంతో ఉంది. ప్రస్తుతం ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ డెడ్‌స్టోరేజీకి చేరింది. వీటిలోని సారవంతమైన పూడికను తరలించడం ద్వారా రైతులకు, రైతు కూలీలకు, ప్రాజెక్టులకు మేలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

 నిజామాబాద్ నుంచి అందిన ప్రతిపాదన..
 ఎస్సారెస్పీ, నిజాంసాగర్, పోచారం, రామడుగు, కౌలాస్‌నాలా ప్రాజెక్టుల్లో పూడికతీతకు సంబంధించి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నుంచి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి ప్రతిపాదన వచ్చింది. నిజాంసాగర్‌లో 2,670, శ్రీరాం సాగర్‌లో 13,546.95, పోచారం 273, రామడుగులో 144.90, కౌలాస్‌నాలాలో 185.70 మిలియన్ క్యూబిక్ ఫీట్‌ల మేర పూడిక ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. ఎస్సారెస్పీలో ఉన్న 13,546 ఎంసీఎఫ్‌టీల పూడిక దాదాపు 13 టీఎంసీలకు సమానం కాగా, నిజాంసాగర్ లోని పూడిక 2 టీఎంసీలకు సమానమని నీటి పారుదల అధికారులు చెబుతున్నారు.
 
 ఉపాధిహామీతో అనుసంధానం..
  ప్రాజెక్టు ల్లో పూడికతీత పనులను ఉపాధిహామీతో అనుసంధానించాలని జిల్లా కలెక్టర్ ప్రతిపాదించారు. పూడిక మట్టిని తరలించే విషయంలో గ్రామీణాభావృద్ధి శాఖ కొంత సహకారం అందిస్తోందని, నీటి పారుదల శాఖ సైతం మిషన్ కాకతీయ నిధుల నుంచి మరికొంత సహకారం ఇవ్వాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. ఈ ప్రతిపాదన సానుకూలమైనదేనని, దీనిద్వారా అన్ని వర్గాలకు మేలు జరుగుతుందనే భావనను నీటి పారుదల శాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు