నరకయాతన

14 Sep, 2014 03:41 IST|Sakshi
నరకయాతన
  • ‘గాంధీ’లో అందని వైద్యం
  • అల్లాడుతున్న రోగులు
  • వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత
  • మొరాయిస్తున్న వైద్య పరికరాలు
  • అందుబాటులో లేని వీల్‌చైర్లు, స్ట్రెచర్లు
  • నేడు గాంధీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ రాక
  • గాంధీ ఆస్పత్రి: గాంధీ ఆసుపత్రిలో వైద్యం అందని ద్రాక్షగా మారింది. మెరుగైన వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచే వచ్చే వారు నరకయాతన అనుభవి స్తున్నారు. వైద్యులు, సిబ్బంది కొరత, యంత్రాలు మొరాయించడం వంటి సమస్యలతో రోగులు సతమతమవుతున్నారు.
     
    మూలనపడ్డ వైద్యపరికరాలు...

    ఆస్పత్రిలోని పలు విభాగాల్లో అత్యవసర వైద్యయంత్రాలు మూలనపడ్డాయి. సుమారు 70 వెంటిలేటర్లు ఉండగా వాటిలో అత్యధికం పనిచేయడం లేదు. కార్డియాలజీ విభాగంలో యాంజియోగ్రఫీ, ఈసీజీ యం త్రాలు వారం రోజులుగా పనిచేయడంలేదు. రేడియాలజీలో ఎంఆర్‌ఐ, సీటీ తదితర యంత్రాలు తరచూ మొరాయిస్తున్నాయి. నెఫ్రాలజీ వార్డులోని మూడు డయాలసిస్ యంత్రాలు మూలనపడి ఏళ్లు గడుస్తున్నాయి. వార్డుల్లో ఏసీలు, ఫ్యాన్‌లు పనిచేయడం లేదు.  
     
    భర్తీకాని పోస్టులు...

    ఆసుపత్రిలో ప్రస్తుతం 1,849 పడకలు ఉన్నాయి. తదనుగుణంగా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో వైద్య సేవల్లో జాప్యం జరుగుతోంది. 908 పోస్టులకు గాను వివిధ కేటగిరీల్లో  237 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  పెరిగిన పడకలకు అనుగుణంగా మరో వేయి పోస్టులు మంజూరు చేయాలని ఆసుపత్రి అధికారులు పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. 36 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కార్డియాలజీ విభాగాన్ని ఒక ప్రొఫెసర్, మరో పీజీతో ఏడాదిగా నెట్టుకొస్తున్నారు. అనస్తీషియా వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. హెచ్‌ఐవీ బాధితులకు వైద్యసేవలందించే ఏఆర్‌టీ సెంటర్‌లో వైద్యులు, సిబ్బంది కొరత ఉంది. ఆస్పత్రిలో సుమారు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిఘా వర్గాలు హెచ్చరించగా, ఎట్టకేలకు నెలరోజుల క్రితం కేవలం 14 కెమెరాలు ఏర్పాటు చేశారు.
     
     వైద్య విద్యార్థులకు వసతి కొరత


     గాంధీ మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వసతి సౌకర్యం కొరత తీవ్రంగా ఉంది. ఇదే కారణంతో ఎంసీఐ గత ఏడాది పెంచిన 50 ఎంబీ బీఎస్ సీట్లను రద్దు చేసింది. రెండు రాష్ట్రాల ఏర్పాటు వల్ల వసతి సౌకర్యాల కల్పనలో జాప్యం జరిగిందనే ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రద్దు చేసిన సీట్లను తిరిగి కేటాయించింది. ఈ నేపథ్యంలో  యూజీ, పీజీ, హౌస్‌సర్జన్, సూపర్‌స్పెషాలిటీ పీజీలు చదువుతున్న సుమారు 700 మంది విద్యార్థులకు వసతి కల్పించాల్సి ఉంది.
     
     సీఎం రాకతోనైనా..

     ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం గాంధీ ఆసుపత్రిని సందర్శించనున్నారు. ఆయన ఇక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు. ఇక్కడి సమస్యలను ఆలకించి పరిస్థితులను మెరుగు పరచాలని వారు వేడుకుంటున్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసి, యంత్ర పరికాలను సమకూర్చి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నారు.
     
    జయశంకర్ విగ్రహానికి తుదిమెరుగులు

    తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని టీజీజీడీఏ ప్రతినిధులు శ్రవణ్‌కుమార్, సిద్దిపేట రమేశ్ తెలిపారు.
     
    కార్యక్రమాలు ఇలా..

    ఆసుపత్రి నిర్వహణ కమిటీ నేతృత్వంలో 60 వసంతాల వేడుకలు ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. వేడుకల కమిటీ, పూర్వవిద్యార్థుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేస్తారు.
     
    అనంతరం వివేకానంద ఆడిటోరియంలో జరిగే వేడుకలకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరవుతారని కమిటీ ప్రతినిధులు టి. రాజయ్య, కె.లింగయ్య, పి.శ్రీనివాస్, కె,.రమేశ్‌రెడ్డి తెలిపారు. 2కే10 బ్యాచ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఫ్రెషర్స్‌డే ఫెస్టివల్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారని ఫెస్ట్ నిర్వాహకులు మనోజ్ తెలిపారు.
     

మరిన్ని వార్తలు