పీవీ సింధుకి వేధింపులు

4 Nov, 2017 14:18 IST|Sakshi

ముంబై : బ్యాడ్మింటన్‌ స్టార్‌, రియో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు చేదు అనుభవం ఎదురైంది. ఇండిగో ఎయిర్‌లైన్‌ సిబ్బంది ఒకరు ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని పీవీ సింధునే తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ట్వీట్లు వైరల్‌ అయ్యాయి. ''చెప్పడానికి చాలా బాధకరంగా ఉంది. శనివారం(నవంబర్‌ 4న) హైదరాబాద్‌ నుంచి ముంబైకి 6ఈ 608 విమానంలో బయలుదేరడానికి వెళ్లిన నాకు, గ్రౌండ్‌ స్టాఫ్‌ అజితేష్‌ నుంచి చాలా చేదు అనుభవం ఎదురైంది'' అని సింధు పేర్కొన్నారు.

 '' అజితేష్‌ చాలా అనాగరికంగా ప్రవర్తించాడు. ఎయిర్‌హోస్టస్‌ అషిమా ప్రయాణికులతో మంచిగా ప్రవర్తించాలని పలు మార్లు సూచించింది. అయినప్పటికీ ఆమెతో కూడా ఆయన అమర్యాదపూర్వకంగా ప్రవర్తించాడు. దాన్ని చూసి నేను చాలా షాక్‌ అయ్యా. ఇలాంటి వ్యక్తులను ఇక్కడ పనికి పెట్టుకుంటే, ఇండిగో ఎయిర్‌లైన్స్‌ గౌరవ మర్యాదలు దెబ్బతింటాయి'' అని మరో ట్వీట్‌ చేశారు. విమాన ప్రయాణాల్లో దేశీయ క్రీడాకారులకు ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావడం ఇదే తొలిసారి కాదు. గతంలో సచిన్‌ టెండూల్కర్‌, హర్భజన్‌ సింగ్‌లు చేదు అనుభవాలను చవిచూశారు.

మరిన్ని వార్తలు