నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం 

4 Aug, 2019 02:55 IST|Sakshi

రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 

సాక్షి, హైదరాబాద్‌: వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌ తీర ప్రాంతాలలో 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉంది. మరోవైపు ఆదివారం ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా ఆది, సోమవారాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌ జిల్లా బజర్హతనూర్‌లో 13 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. మల్కాజిగిరి మండలం దిండిగల్‌లో 12 సెం.మీ., జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం, పేరూరులలో 11 సెం.మీ., ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో 10 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.

కామారెడ్డి జిల్లా జుక్కల్, ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరులలో 9 సెం.మీ., నాగారెడ్డిపేట, కాళేశ్వరం, పినపాక, రంజల్, లింగంపేట, సారంగాపూర్, బాన్సువాడ, యల్లారెడ్డిలలో 8 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులుగా ముసురు వాతావరణం నెలకొని ఉంది. దీంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోయాయి. రాష్ట్రంలో వర్షపాతం లోటు గణనీయంగా తగ్గింది. జూన్‌ ఒకటో తేదీ నుంచి శనివారం నాటికి సాధారణంగా కురవాల్సిన వర్షపాతం 390.7 మిల్లీమీటర్లు (మి.మీ.) కాగా, ఇప్పటివరకు 381.4 ఎంఎంలు నమోదైంది.

వరంగల్‌ అర్బన్‌లో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 30 శాతం అధిక వర్షపాతం రికార్డు కావడం గమనార్హం. ఒక్క శనివారమే రాష్ట్రంలో సాధారణం కంటే 397 శాతం అధిక వర్షపాతం నమోదైందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం సాధారణంగా 7.5 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఏకంగా 37.3 మి.మీ. నమోదైంది. ఒక్క సిద్ధిపేట జిల్లాలోనే 1,248 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అక్కడ శనివారం 3.1 మి.మీ. కురవాల్సి ఉండగా, ఏకంగా 41.8 మి.మీ. నమోదైంది.  

మరిన్ని వార్తలు