రౌడీషీటర్లు పద్ధతి మార్చుకోవాలి

3 Nov, 2014 04:25 IST|Sakshi

వరంగల్ క్రైం : రౌడీషీటర్లు తమ పద్ధతి మార్చుకోవాలని, లేదంటే సహించేది లేదని వరంగల్ రూరల్ ఎస్పీ, అర్బన్ ఇన్‌చార్జ్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. వరంగల్ అర్బన్, రూరల్ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలపై దాడులు చేయడమేగాక, హత్యలు చేస్తున్న రౌడీషీటర్లను అదుపుచేయడంతోపాటు వారి పై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

జిల్లాలో రౌడీయిజానికి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో అర్బన్, రూరల్ పరిధిలో రౌడీషీటర్లకు జిల్లా పోలీసు కార్యాలయంలోని రాణిరుద్రమదేవి ప్రాంగణంలో ‘రౌడీషీటర్ల పరివర్తన’ సదస్సు నిర్వహించారు. రౌడీషీటర్లతో ఎస్పీ ముందుగా మాట్లాడించారు. ఈ సందర్భంగా రౌడీషీటర్లు మాట్లాడుతూ తప్పుడు స్నేహాలతో ద్వేషాలకుపోయి నేరాలకు పాల్పడి పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్లుగా పేరు నమోదు కావడంతోపాటు శత్రువుల నుంచి ప్రాణ భయం ఉందన్నారు. సమాజంలో తమ కుటుంబాలను చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రౌడీషీటర్ల పద్ధతిలో మార్పు వస్తుంద ని ఆశిస్తున్నామన్నారు. ఆర్నెళ్లలో తిరిగి సదస్సు నిర్వహిస్తామని, ఈ లోగా రౌడీషీటర్లలో మార్పు వస్తే పోలీసులు పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు. రౌడీషీటర్లు వారి కుటుంబ సభ్యుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని తమ పద్ధతి మార్చుకోవాలని, లేదంటే రాష్ట్రంలో మరోమారు జిల్లా సంచలనాలకు వేదిక అవుతుందని ఎస్పీ రౌడీషీటర్లను హెచ్చరించారు. సదస్సుకు రూరల్ అదనపు ఎస్పీ కె.శ్రీకాంత్, స్పెషల్ బ్రాంచ్, వరంగల్, హన్మకొండ, మామునూర్ డీఎస్పీ లు జనార్దన్, హిమవతి, దక్షిణామూర్తి, సురేష్‌కుమార్‌తోపాటు అర్బన్, రూరల్, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐ, సబ్‌ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు