రేషన్‌కు వీడని ఆధార్ ముడి

27 May, 2014 01:19 IST|Sakshi
రేషన్‌కు వీడని ఆధార్ ముడి
  •  ఆధార్ అనుసంధానమైతేనే సరుకుల పంపిణీ
  •   హైదరాబాద్, రంగారెడ్డిజిల్లాల్లో అమలు
  •   దీంతో 3 నెలలుగా సుమారు 11 లక్షల మంది తెల్లకార్డుదారులకు రేషన్ నిల్
  •  సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రేషన్ సరుకులకు ఆధార్ ముడి కొనసాగుతూనే ఉంది. సంక్షేమ పథకాలను ఆధార్‌తో ముడి పెట్టొద్దన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ అవుతున్నాయి. ఆధార్ అనుసంధానం లేకపోతే రేషన్ సరుకులు ఇచ్చేది లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు నిబంధన పెట్టడం విస్మయానికి గురి చేస్తోంది.  

    మూడు నెలల క్రితం ఆధార్ నుంచి ‘వంటగ్యాస్’ కు విముక్తి లభించినా... పేదల రేషన్ సరుకులకు మాత్రం ఇంకా మోక్షం లభించడం లేదు.  ఫలితంగా హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 11 లక్షల యూనిట్ల వరకు రేషన్ సరుకులు అందడంలేదు. కొందరి తెల్ల రేషన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానం కాలేదన్న సాకుతో ప్రతీనెలా డైనమిక్ కీ రిజిస్ట్రార్ ద్వారా వారి (ఆ యూనిట్లకు) సరుకులకు కత్తెరపెడుతున్నారు.

    రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో నిత్యావసర సరుకుల పంపిణీని ఆధార్‌తో ముడిపెట్టే ప్రయోగానికి హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల పౌసరఫరాల శాఖ అధికారులు శ్రీకారం చుట్టి పేదలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. తెల్లరేషన్ కార్డు హోల్డర్లకు (యూనిట్లు)  ఆధార్ నంబర్‌తో అనుసంధానం ప్రక్రియకు కొంత గడువు ఇచ్చిన అధికారులు.. ఆ తర్వాత అనుసంధానం కానీ వారి సరుకులను నిలిపివేశారు.
     
    మూడు నెలల నుంచి...


    హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆధార్ లేని సుమారు 11 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులకు  రేషన్ సరుకుల సరఫరా నిలిచిపోయింది.  ఆధార్ అనుసంధానం ఆధారంగా మార్చి నెల నుంచి ఆన్‌లైన్ ద్వారా యూనిట్ల వారీగా అధికారులు రేషన్ కోటాను కేటాయించి, డైనమిక్ కీ సేల్స్ రిజిస్ట్రర్‌లను రేషన్ డీలర్లకు అందిస్తున్నారు.  ఫలితంగా ఆధార్ నంబర్లు అనుసంధానం కాని కార్డు హోల్డర్లకు సరుకుల పంపిణీ జరగడంలేదు.
     
    లబ్ధిదారులు ఆధార్ కార్డు కోసం పేర్లు నమోదు చేసుకొని, ఫొటోలు దిగినప్పటికీ అధిక శాతం మందికి ఇంకా కార్డులు జారీ కాలేదు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 74 శాతం, రంగారెడ్డి జిల్లా పరిధిలో 44 శాతం మాత్రమే ఆధార్‌తో అనుసంధానమైనట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆధార్ అనుసంధానం కాని లబ్ధిదారులు గత మూడు నెలలుగా రేషన్ అందకపోవడంతో గగ్గొలు పెడుతున్నారు. రే షన్ కార్డుకు ఆధార్ అనుసంధానం నిబంధనను తొలగించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
     

>
మరిన్ని వార్తలు