45మందితో మోడీ టీం | Sakshi
Sakshi News home page

45మందితో మోడీ టీం

Published Tue, May 27 2014 1:29 AM

45మందితో మోడీ టీం - Sakshi

*  23 కేబినెట్, 22 సహాయ మంత్రులు
*   సహాయమంత్రుల్లో 10 మందికి స్వతంత్ర హోదా
ఏడుగురు మహిళలకు అవకాశం
8 పదవులతో యూపీకే అత్యధిక ప్రాతినిధ్యం
తెలంగాణను కరుణించని మోడీ
*   ప్రాతినిధ్యమే లేని పశ్చిమబెంగాల్
 
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో 45 మంది సభ్యుల మంత్రివర్గం కొలువుతీరనుంది. వారిలో 23 మంది కేబినెట్ మంత్రులు కాగా, 10 మంది స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రులు, 12 మంది సహాయ మంత్రులు ఉన్నారు. మొత్తంమీద మోడీ తాను కోరుకున్నట్లుగా చిన్న కేబినెట్‌నే ఏర్పరుచుకున్నారు. ఊహించినట్లే బీజేపీ సీనియర్ నేతలకు కేబినెట్ బెర్త్‌లు లభించాయి. వారిలో రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కారీ, వెంకయ్యనాయుడు, ఉమాభారతి, రవిశంకర్ ప్రసాద్ తదితరులున్నారు. ఎన్‌డీఏ మిత్రపక్షాలకు కూడా ప్రాతినిధ్యం లభించింది. వాటిలో శివసేన, టీడీపీ, ఎల్జేపీ, శిరోమణి అకాలీదళ్(ఎస్‌ఏడీ), రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ సమతా పార్టీ ఒక్కో మంత్రిపదవిని దక్కించుకున్నాయి. వారిలో టీడీపీ నుంచి అశోక్ గజపతి రాజు, ఎల్‌జేపీ నుంచి రామ్‌విలాస్ పాశ్వాన్, ఎస్‌ఏడీ నుంచి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్.. తదితరులున్నారు.
 
 మోడీ మంత్రివర్గంలో మహిళలకు సముచిత ప్రాధాన్యత లభించింది. ఏడుగురు మహిళలకు మోడీ అవకాశం కల్పించారు. సుష్మాస్వరాజ్, నజ్మా హెప్తుల్లా, ఉమాభారతి, మనేకా గాంధీ, హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్, స్మృతి ఇరానీలకు కేబినెట్ హోదా లభించగా.. నిర్మల సీతారామన్‌ను సహాయమంత్రిగా నియమించారు. జల వనరుల శాఖతో పాటు ప్రత్యేకంగా గంగానది ప్రక్షాళన బాధ్యతను ఉమాభారతికి అప్పగించారు. మోడీ మంత్రివర్గంలోని అత్యంత చిన్న, అత్యంత వృద్ధ మంత్రులు కూడా మహిళలే కావడం విశేషం. 38 ఏళ్ల సృ్మతి ఇరానీ అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రి కాగా.. 74 ఏళ్ల నజ్మా హెప్తుల్లా అత్యధిక వయసు కలిగిన మంత్రిగా ఉన్నారు. వీరిద్దరూ రాజ్యసభ సభ్యులే కావడం విశేషం. నజ్మా హెప్తుల్లా మోడీ మంత్రివర్గంలోని ఏకైక ముస్లిం కావడం గమనార్హం. పురుషుల్లో వృద్ధ మంత్రిగా 74 ఏళ్ల  కల్‌రాజ్ మిశ్రా నిలిచారు.
 
 యూపీనే టాప్
 రాష్ట్రాలవారీగా బీజేపీకి అత్యధిక స్థానాలిచ్చిన ఉత్తరప్రదేశ్‌కు అదే స్థాయిలో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించారు. ప్రధానమంత్రి కాకుండా ఉత్తరప్రదేశ్‌కు కేబినెట్, ఇండిపెండెంట్, సహాయక మంత్రిపదవులు కలిపి మొత్తంగా 8 దక్కాయి. ఆ తరువాత మహారాష్ట్రకు 6, బీహార్‌కు 5, మధ్యప్రదేశ్‌కు 4 పదవులు దక్కాయి. మధ్యప్రదేశ్‌కు మొత్తం 4 కేబినెట్ పదవులు దక్కాయి. ఆ తరువాత కర్ణాటకకు 4, గుజరాత్‌కు 3, హర్యానాకు 2 మంత్రిపదవులు లభించాయి. అరుణాచల్ ప్రదేశ్, అసోంలకు మినహా ఈశాన్య రాష్ట్రాలకు మోడీ టీంలో ప్రాతినిధ్యం లభించలేదు. అసోం, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,  ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, జమ్మూకాశ్మీర్, జార్ఘండ్, గోవా, ఢిల్లీ రాష్ట్రాలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రిపదవులు లభించాయి.

కొత్త రాష్ట్రం తెలంగాణకు ప్రాతినిధ్యం లభించలేదు. విద్యుత్తు, ఉపాధి రంగాల్లో కేంద్రం నుంచి భారీ సహాయాన్ని ఆశిస్తున్న తెలంగాణ ప్రజలకు తాజా మంత్రివర్గ కూర్పు నిరాశ కలిగించింది. తెలంగాణ నుంచి కేబినెట్ పదవి ఆశించిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు అవకాశం లభించలేదు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ నుంచి అశోక్‌గజపతి రాజుకు కేబినెట్ పదవి లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకయ్యనాయుడుకు కర్నాటక కోటాలో కేబినెట్ మంత్రి పదవిని కేటాయించారు. కాగా పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కేరళ, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలకు కూడా మోడీ మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. మొత్తం 25 లోక్‌సభ స్థానాలను బీజేపీకే కట్టబెట్టిన రాజస్థాన్‌కు ఒకే ఒక మంత్రి పదవి లభించడం గమనార్హం.
 
 వీరికి చోటు లేదు
 బీజేపీ అగ్రనేత, వాజ్‌పేయి ప్రభుత్వంలో ఉపప్రధానిగా, హోమంత్రిగా వ్యవహరించిన ఎల్‌కే అద్వానీకి మోడీ టీంలో చోటు దక్కలేదు. మోడీ పెట్టిన 75 ఏళ్ల కటాఫ్ కారణంగానే ఆయనకు అవకాశం లభించలేదని సమాచారం. అలాగే, గత ఎన్‌డీఏ ప్రభుత్వాల్లో కీలక శాఖలు నిర్వహించిన బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ, బీసీ ఖండూరి, శాంతకుమార్‌లకు కూడా అదే కారణంతో అవకాశం లభించలేదని తెలుస్తోంది. గుజరాత్ భవన్‌లో సోమవారం ఉదయం మోడీ ఇచ్చిన తేనీటి విందుకు కూడా జోషీకి పిలుపు లేదు. కేవలం కాబోయే మంత్రులనే ఆయన ఆహ్వానించారు. అయితే, అరుణ్ శౌరీకి అవకాశం లభించకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. మోడీ టీంలో అవకాశం దక్కని వారిలో సుబ్రమణ్యస్వామి, రాజీవ్ ప్రతాప్ రూడీలు కూడా ఉన్నారు.
 
 పార్లమెంటు సభ్యులు కాకుండానే..: ఇక తాజా మంత్రివర్గంలో బీజేపీ నేతలు నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జవదేకర్, రాధామోహన్‌లు అటు లోక్‌సభకు గానీ, ఇటు రాజ్యసభకు కానీ సభ్యులుగా లేకుండానే మంత్రిపదవులు దక్కాయి. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన రాజ్యసభ సభ్యులు అరుణ్‌జైట్లీ, స్మృతి ఇరానీలకు కేబినెట్ పదవులు దక్కడం విశేషం. ఇంకా పలువురు రాజ్యసభ సభ్యులకు మంత్రిపదవులు దక్కాయి. మంత్రిపదవులు దక్కిన రాజ్యసభ సభ్యుల్లో వెంకయ్యనాయుడు, నజ్మాహెప్తుల్లా, స్మృతిఇరానీ, అరుణ్‌జైట్లీ, ధర్మేంద్ర ప్రధాన్,  పీయూష్‌గోయల్, రవిశంకర్‌ప్రసాద్ తదితరులు ఉన్నారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ మంత్రులుగా సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన 45 మందిలో అత్యధికులు జాతీయ భాష హిందీలోనే ప్రమాణం చేశారు. కేవలం 10 మంది మాత్రమే ఇంగ్లిష్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో మేనకా గాంధీ, నిర్మలా సీతారామన్, నజ్మా హెప్తుల్లా, వెంకయ్య నాయుడు, అశోక గజపతి రాజు(టీడీపీ), హర్సింరాత్ కౌర్ బాదల్(అకాలీదళ్) ఉన్నారు.
 
కొత్త మంత్రులు వీరే...
న్యూఢిల్లీ: అధికారికంగా ప్రకటించనప్పటికీ.. సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఈ శాఖలను కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం.
 పేరు                             శాఖ
 1) నరేంద్రమోడీ    ప్రధానమంత్రి
 2) రాజ్‌నాథ్ సింగ్    హోం
 3) సుష్మా స్వరాజ్    విదేశీ వ్యవహారాలు
 4) అరుణ్ జైట్లీ    ఆర్థిక(అదనంగా రక్షణ శాఖ)
 5) ఎం. వెంకయ్యనాయుడు    పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు
 6) నితిన్ గడ్కారీ    ఉపరితల రవాణా, షిప్పింగ్
 7) డీవీ సదానంద గౌడ    రైల్వే
 8) నజ్మా హెప్తుల్లా    మైనారిటీ వ్యవహారాలు
 9) ఉమాభారతి    జల వనరులు
 10) గోపీనాథ్ ముండే    గ్రామీణాభివృద్ధి
 11) రామ్‌విలాస్ పాశ్వాన్    ఆహార, పౌర సరఫరాలు
 12) కల్‌రాజ్ మిశ్రా        -
 13) మేనకా గాంధీ    మహిళ, శిశు సంక్షేమం
 14) అనంత్‌కుమార్         -
 15) అశోక్ గజపతి రాజు     పౌర విమానయానం
 16) అనంత్ గీతె    భారీపరిశ్రమలు
 17) హర్‌సిమ్రత్‌సింగ్ కౌర్ బాదల్    ఫుడ్ ప్రొసెసింగ్
 18) రవిశంకర్ ప్రసాద్    న్యాయ, టెలికం
 19) నరేంద్ర సింగ్ తోమర్        -
 20) జువల్ ఓరామ్    గిరిజన వ్యవహారాలు
 21) రాధామోహన్ సింగ్    వ్యవసాయం
 22) తావర్ చంద్ గెహ్లాట్        -
 23) స్మృతి జుబిన్ ఇరానీ మానవ వనరులు
 24) హర్షవర్ధన్    ఆరోగ్యం
 సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)
 1) జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్    -
 2) ఇందర్జిత్‌సింగ్ రావు        -    
 3) సంతోష్‌కుమార్ గంగ్వార్        -
 4) శ్రీపద్ యశోనాయక్        -
 5) ధర్మేంద్ర ప్రధాన్        -
 6) సర్బానంద సోనోవాల్        -
 7) ప్రకాశ్ జవదేకర్    సమాచార ప్రసార శాఖ
 8) పియూష్ గోయల్    విద్యుత్
 9) జితేంద్ర సింగ్        -
 10) నిర్మల సీతారామన్    వాణిజ్యం
 సహాయ మంత్రులు
 1) జీఎం సిద్ధేశ్వర        -
 2) మనోజ్ సిన్హా        -
 3) నిహాల్‌చంద్        -
 4) ఉపేంద్ర కుష్వాహ        -
 5) పీ రాధాకృష్ణన్        -
 6) కిరణ్ రాజు        -
 7) కృష్ణన్ పాల్        -
 8) సంజీవ్ కుమార్ బాల్యన్        -
 9) మన్సుఖ్‌భాయి ధన్జీభాయి వాసవ    -
 10) రావు సాహెబ్ దాదారావు దాన్వే    -
 11) విష్ణుదేవ్ సాయి        -
 12) సుదర్శన్ భగత్        -

Advertisement
Advertisement