ఆర్టీసీ రెండు ముక్కలు

4 Jun, 2015 02:09 IST|Sakshi
ఆర్టీసీ రెండు ముక్కలు

* టీఎస్ ఆర్టీసీ - ఏపీఎస్ ఆర్టీసీ ఇక వేరువేరుగా
* పరిపాలన సౌలభ్యం కోసం అధికారుల పంపిణీ
* తేలని ఉమ్మడి ఆస్తులు, అప్పుల వ్యవహారం
* షీలాభిడే కమిటీ పరిధిలో ఈ అంశం
* మరో రెండు నెలల్లో పరిష్కారమయ్యే అవకాశం

 
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఆర్టీసీ రెండుగా విడిపోయింది. పరిపాలన సౌలభ్యం కోసం ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీగా మారాయి. ఇక నుంచి ఏ కార్పొరేషన్ అధికారులు ఆ కార్పొరేషన్ పరిధిలోనే పనిచేస్తారు. దీనికి వీలుగా ఆర్టీసీలోని సీనియర్ స్కేల్ ఆఫీసర్లు, జూనియర్ స్కేల్ ఆఫీసర్లను రెంటి మధ్య పంపిణీ చేశారు. 4 నుంచి పదో తరగతి చదివిన ప్రాంతం ప్రకారం ‘స్థానికత’ ఆధారంగా ఈ పంపకాలు జరి గాయి. 2 నెలల క్రితం ఈ కసరత్తు ప్రారంభించిన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు స్థానికత ఆధారంగా ఈ పంపకాలు చేస్తూ ప్రొవిజినల్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఆప్షన్లకూ అవకాశం ఇవ్వటం వివాదాస్పదమైంది. ఎక్కడివారు అక్కడే పనిచేయాలని తెలంగాణ అధికారులు పట్టుపట్టడంతో... తొలుత జారీ చేసిన ప్రొవిజినల్ ఉత్తర్వులనే అమలు చేస్తూ బుధవారం నిర్ణయించారు. దీంతో ఆప్షన్ల ప్రమేయం లేకుండా స్థానికత ఆధారంగా ఎక్కడి వారు అక్కడే విధులు నిర్వహించేలా ఆదేశాలు వెలువడ్డాయి.
 
 ఆంధ్రాకి చెందినవారు ఏపీఎస్ ఆర్టీసీ పరిధిలో, తెలంగాణకు చెందినవారు టీఎస్ ఆర్టీసీ పరిధిలో విధులు నిర్వహిస్తారు. ఉమ్మడి ఆర్టీసీ ఎండీ సాంబ శివరావు ఇక ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా, టీఎస్ ఆర్టీసీ జేఎండీ రమణరావు టీఎస్ ఆర్టీసీ ఎండీగా (హోదా జేఎండీ)గా వ్యవహరిస్తారు. బస్‌భవన్‌లోని ‘ఎ’ బ్లాకును ఏపీఎస్ ఆర్టీసీకి, ‘బి’ బ్లాక్‌ను టీఎస్‌ఆర్టీసీకి ఇప్పటికే కేటాయించారు. ప్రస్తుత ఎండీ సాంబశివరావు తన చాంబర్ ఖాళీ చేసి ఆర్టీసీ చైర్మన్ పేరుతో ఉన్న చాంబర్ నుంచి విధులు నిర్వహిస్తారు. డిపోల వారీగా నమోదయ్యే ఆదాయ వ్యయాలను ఇప్పటికే ఏ రాష్ట్రానివి ఆ రాష్ట్రం ఖాతాలోనే జమ చేస్తున్నారు. నగరంలోని ఆర్టీసీ ఉమ్మడి ఆస్తులు, అప్పుల విభజన షీలాభిడే కమిటీ పరిధిలో ఉంది. మరో 2 నెలల్లో అది కూడా తేలిపోనుంది. బస్సుల పర్మిట్ల లెక్కలు కూడా తేలాలి. అప్పటివరకు బస్సు లు ఏపీఎస్‌ఆర్టీసీ పేరుతోనే కొనసాగుతాయి. ప్రపంచంలో ఎక్కువ బస్సులు నిర్వహిస్తున్న సంస్థగా ఏపీఎస్‌ఆర్టీసీ పేర ఉన్న గిన్నిస్ రికార్డు బస్సుల పంపకం జరిగితే మహారాష్ట్ర ఆర్టీసీ పరమవుతుంది.
 
 ఈడీల కేటాయింపు ఇలా...
 టీఎస్ ఆర్టీసీ జేఎండీ రమణరావు ఎండీ విధులతోపాటు ఆపరేషన్స్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం బస్‌భవన్‌లో విధులు నిర్వహిస్తున్న ఈడీ రవీందర్‌ను అక్కడే కొనసాగించాలని నిర్ణయించారు. మరే అధికారికి హెడ్ ఆఫీసు ఈడీ పోస్టింగ్ ఇవ్వనందున ఈ ఇద్దరే ప్రధాన బాధ్యతలను పంచుకుని నిర్వహించే అవకాశం ఉంది. కరీంనగర్ జోన్, గ్రేటర్ హైదరాబాద్ జోన్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈడీ పురుషోత్తమ్ నాయక్ నుంచి కరీంనగర్ బాధ్యత తప్పించారు. సికింద్రాబాద్ ఆర్‌ఎంగా ఉన్న సత్యనారాయణకు ఈడీగా పదోన్నతి కల్పించి కరీంనగర్ జోన్ ఈడీ బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ జోన్ బాధ్యతను మరో ఈడీ నాగరాజు చూస్తారు. ఇక ఏపీఎస్ ఆర్టీసీలో ఈడీ వెంకటేశ్వరరావుకు పరిపాలన, ఈడీ జయరావు ఆపరేషన్స్, కోటేశ్వరరావు ఇంజనీరింగ్‌తో పాటు కడప జోన్ బాధ్యతలు చూస్తారు. బస్ చాసిస్, బాడీ యూనిట్ సీఎంఈగా ఉన్న రవీంద్రబాబుకు ఈడీగా పదోన్నతి కల్పించి విజయవాడ జోన్‌కు కేటాయించారు.

>
మరిన్ని వార్తలు