ఫిబ్రవరిలో సెట్‌ నోటిఫికేషన్‌

29 Oct, 2017 02:16 IST|Sakshi

జూన్‌/జూలైలో రాత పరీక్షలు

సెట్‌–2017 ఫలితాలు విడుదల.. 3,726 మందికి అర్హత

ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్టు(సెట్‌)–2018 నోటిఫికేషన్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వంటి పోస్టులకు పోటీ పడేందుకు కావాల్సిన తప్పనిసరి అర్హతల్లో సెట్‌ ఒకటని తెలిపారు. రాత పరీక్షలు జూన్‌/జూలైలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సెట్‌–2017 ఫలితాలను శనివారం ఇక్కడ మండలి కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. దీనిలో 6.64 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు చెప్పారు. 29 సబ్జెక్టుల్లో పరీక్ష రాసేందుకు 68,381 మంది దరఖాస్తు చేసుకోగా, జూలై 11న జరిగిన పరీక్షలకు 56,111 మంది హాజరయ్యారు. అందులో 3,726 మంది (6.64 శాతం) అర్హత సాధించారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిబంధనల ప్రకారం పరీక్షకు హాజరైనవారిలో 6 శాతం మందికే అర్హత కల్పించాలి.

అయితే, యూజీసీ ఆమోదం తీసుకొని రాష్ట్రంలో 6.64 శాతం మందికి అర్హత కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. అర్హత సాధించిన వారికి త్వరలో యూనివర్సిటీల్లో భర్తీ చేయనున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడే అవకాశం లభిస్తుందని పాపిరెడ్డి వెల్లడించారు. సాధారణంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడేవారికి పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులు సాధించడంతోపాటు సెట్‌ లేదా నెట్‌లో అర్హత సాధించి ఉండాలని లేదా 2009 జూలై 11కు ముందు పీహెచ్‌డీ చేసి ఉండాలని పేర్కొన్నారు.

కోర్టుకు వెళ్లడం వల్ల జాప్యం...
అర్హుల శాతం ఎంపిక విషయంలో పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించినందున ఫలితాల వెల్లడి ఆలస్యమైందని, కోర్టు స్టే ఎత్తివేసిన తరువాత ఫలితాలను ప్రకటిస్తున్నామని ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ రామచంద్రం తెలిపారు. గతంలో సెట్‌లో మార్కులను బట్టి 15 శాతం మందిని అర్హులుగా ప్రకటించే వారని, అయితే యూజీసీ ఆ నిబంధనను 6 శాతానికి కుదించిందన్నారు.

ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చాక మొదటిసారిగా ఈసెట్‌ను నిర్వహించినట్లు తెలిపారు. సెట్‌ అర్హత సాధించిన వారి హాల్‌ టికెట్‌ నంబర్ల జాబితాను, రిజర్వేషన్‌ కేటగిరీలు, సబ్జెక్టులవారీగా అర్హుల కటాఫ్‌ మార్కుల జాబితాను తమ వెబ్‌సైట్‌లో (http://www. telanganaset.org) అందుబాటులో ఉంచినట్లు సెట్‌ కన్వీనర్‌ ప్రొ.యాదగిరి స్వామి తెలిపారు.

>
మరిన్ని వార్తలు