రోల్ మోడల్‌గా సిద్దిపేట

6 Oct, 2014 23:40 IST|Sakshi
రోల్ మోడల్‌గా సిద్దిపేట

 జిల్లాలోని 46 మండలాల్లో ఉన్న సమస్యల్లో రెవెన్యూ పరమైన ఇబ్బందుల వల్ల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిని పరిష్కరించుకునేందుకు ఏళ్ల తరబడి చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. దీనికి చెక్ పెట్టాలని భావించిన మంత్రి హరీష్ సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో సరైన ప్రణాళిక తయారు చేసుకుని అధికారులు రంగంలోకి దిగారు. ప్రతీ రైతుకు పట్టాదారు పాస్‌బుక్‌లు అందించేందుకు కలెక్టర్, జేసీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.

 రైతులకు సరిపడా పాస్‌బుక్‌లు మండలానికి వచ్చేలా చూశారు. రెవెన్యూ సదస్సులు, గ్రామదర్శినితో పాటు ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పట్టాపాసు పుస్తకాలను మంత్రి చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఇలా చేయడం వల్ల పైసలిస్తేనే పాస్‌బుక్‌లు వస్తాయనే భావనను పోగొట్టారు.     

 సమస్యలు పరిష్కారం ఇలా...   
 సిద్దిపేట రెవెన్యూ అధికారులు భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. రెవెన్యూ చట్టాల ప్రకారం 45 రోజుల్లో వాటిని పరిష్కారం చేస్తున్నారు. ఈ సమయంలో ఏవైనా ఇతర పత్రాలు అవసరమైతే దరఖాస్తుదారులకు ఫోన్ చేసి వాటిని తెప్పించుకుంటున్నారు. స్థానిక మంత్రి హరీష్‌రావును సంప్రదిస్తూ నిబంధనల మేరకు చకచకా సమస్యలు పరిష్కరిస్తున్నారు. 2012 నుం చి ఇప్పటి వరకు 6,197 రెవెన్యూ సమస్యలు పరిష్కరించి ప్రజల మెప్పు పొందుతున్నారు.  
 
 అన్ని శాఖల్లో సాధ్యమయ్యేనా..!  
 సిద్దిపేట తహశీల్దార్ కార్యాలయంలో సమస్యలు పరిష్కారం అవుతున్న తీరును ఇతర శాఖల్లో పని చేస్తున్న సిబ్బంది గుర్తించి ఆయా శాఖల్లో ఈ విధంగా సమస్యలు పరిష్కరించడం పట్ల దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే రాష్ట్రంలోనే సిద్దిపేటకు ప్రత్యేక గుర్తింపు దక్కే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు