ఎగిరిపోతే ఎంత బావుంటుంది! 

11 Sep, 2019 04:25 IST|Sakshi

గగనయానానికే ఎక్కువ మంది మక్కువ 

‘శంషాబాద్‌’లో గణనీయంగా ప్రయాణికుల వృద్ధి 

2018–19లో 20 శాతం పెరుగుదల 

23 శాతం పెరిగిన విమాన సర్వీసులు 

సామాజిక, ఆర్థిక సర్వే 2019లో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: కారు, బస్సు, రైలు.. ఇవేవీ కాదు. విమానయానానికే ప్రయాణికులు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఎగిరిపోతేనే ప్రయాణం బావుంటుందని భావిస్తున్నారు. గగనయానమే బెస్ట్‌ అని విమానాలు అలవోకగా ఎక్కి దిగేస్తున్నారు. హైదరాబాద్‌ శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. 2018–19లో శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్యలో 20% వృద్ధి నమోదు కావడం విశేషం. విమానాల రాకపోకలు తెలిపే ఎయిర్‌ ట్రాఫిక్‌ మూవ్‌మెంట్‌ (ఏటీఎం)తోపాటు కార్గో ట్రాఫిక్, ఎయిర్‌ రూట్‌ కనెక్టివిటీలోనూ ఆర్జీఐఏ దూసుకెళ్తోంది. ఫ్లైనాస్‌ సంస్థ హైదరాబాద్‌ నుంచి సౌదీ అరేబియాకు నేరుగా సర్వీసులు నడుపుతుండగా.. స్పైస్‌జెట్‌ సంస్థ బ్యాంకాక్‌కు ప్రతిరోజూ విమానం సర్వీసు అందిస్తోంది.

ఇక ప్రభుత్వ ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్‌సీఎస్‌) కింద హైదరాబాద్‌ నుంచి హుబ్లీ, కొల్హాపూర్, నాసిక్‌తోపాటు అమృత్‌సర్, వడోదర, పోర్ట్‌బ్లెయిర్, ఉదయ్‌పూర్, డెహ్రాడూన్, ఇంఫాల్, కన్నూర్, భోపాల్‌ నగరాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ మీదుగా 18 అంతర్జాతీయ సర్వీసులు.. దేశంలోని 48 నగరాలను కలుపుతూ దేశీయ సర్వీసులు ఆర్జీఐఏ విమానాశ్రయం ద్వారా అందుబాటులో ఉన్నాయి. తాజాగా వెలువడిన సామాజిక ఆర్థిక సర్వే–2019లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. విమాన సేవల్లో శంషాబాద్‌ విమానాశ్రయం దక్షిణమధ్య భారతావనికి ముఖద్వారంగా అవతరించిందని సర్వే అభిప్రాయపడింది. 

ఆర్జీఐఏ మరికొన్ని ఘనతలివీ.. 
2017–18లో శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 1.32 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా.. 2018–19లో ఆ సంఖ్య 1.58 కోట్లకు చేరింది. 
2017–18లో 1.05 కోట్ల మంది దేశీయ ప్రయాణాలు చేయగా.. 2018–19లో 22 % వృద్ధి నమోదై వారి సంఖ్య 1.29 కోట్లకు చేరింది.  
2017–18లో 26.7 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులకు సేవలందించగా.. 2018–19లో ఆ సంఖ్య 29.6 లక్షలకు చేరి 11% పెరుగుదల రికార్డయింది.  
2017–18లో 1,08,773 విమానాలు శంషాబాద్‌ నుంచి రాకపోకలు సాగించగా.. 2018–19లో 23% పురోగతి తో ఆ సంఖ్య 1,33,755కు చేరుకుంది.  
2017–18లో 1,03,120 మెట్రిక్‌ టన్నుల రవాణా జరగ్గా.. 2018–19లో 8% వృద్ధి నమోదై 1,33,775 మెట్రిక్‌ టన్నులకు పెరిగింది.  

మరిన్ని వార్తలు