‘సిర్పూర్‌’పై మళ్లీ ఆశలు

8 Jan, 2018 00:53 IST|Sakshi

పేపర్‌ మిల్లు పునరుద్ధరణ దిశగా పడిన ముందడుగు

దివాలా వ్యాపార పరిష్కార ప్రక్రియ చేపట్టిన కంపెనీ

లా ట్రిబ్యునల్‌.. టేకోవర్‌కు ముందుకొచ్చిన 8 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు

మేలోగా పూర్తికానున్న ప్రక్రియ

మరో 8 నెలల్లో పునరుద్ధరణ

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ప్రఖ్యాత కాగితపు తయారీ పరిశ్రమ, దశాబ్దాల చరిత్రగల ‘ద సిర్పూర్‌ పేపర్‌ మిల్స్‌ లిమిటెడ్‌’ పునరుద్ధరణపై ఆశలు చిగురిస్తున్నాయి. మూడున్నరేళ్లుగా మూతబడి ఉన్న ఈ పరిశ్రమ తిరిగి తెరుచుకునే దిశగా అడుగులు పడ్డాయి. ముంబైలోని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్సీఎల్టీ) చేపట్టిన దివాలా వ్యాపార పరిష్కార ప్రక్రియ (కార్పొరేట్‌ ఇన్సాల్వెన్సీ రిసల్యూషన్‌ ప్రాసెస్‌–సీఐఆర్‌పీ) ఓ కొలిక్కి వచ్చింది. 80 ఏళ్ల చరిత్రగల ఈ కంపెనీని సొంతం (టేకోవర్‌) చేసుకుని పునరుద్ధరించేందుకు 8 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి.

దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా ట్రిబ్యునల్‌ నియమించిన రిసల్యూషన్‌ ప్రొఫెషనల్‌ (ఆర్పీ) కె.రామ్‌ రతన్‌ ఈ కంపెనీ పునరుద్ధరణ కోసం గతేడాది డిసెంబర్‌ 11న ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)కు ఆహ్వానించగా జేకే పేపర్‌ మిల్స్, వెస్ట్‌కోస్ట్‌ పేపర్‌ మిల్స్‌ (కోల్‌కతా), రిద్ధి సిద్ధి పేపర్‌ మిల్స్‌ (అహ్మదాబాద్‌), పాప్సెల్‌ (జర్మనీ), సెంచురీ పేపర్, ఐటీసీ పేపర్‌ మిల్స్, కోహినూర్‌ గ్రూప్‌ తదితర 8 కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. అయితే డిసెంబర్‌ 22తో ముగిసిన ఆసక్తి వ్యక్తీకరణ గడువును ఈ నెల 5 వరకు పొడిగించారు.

180 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని గతేడాది నవంబర్‌ 20న ట్రిబ్యునల్‌ ఆదేశించగా మే నెలతో ఈ గడువు ముగియనుంది. ఆసక్తి వ్యక్తీకరణకు ముందుకొచ్చిన 8 కంపెనీల్లో నిబంధనల ప్రకారం అధిక అర్హతలుగల కంపెనీకి గడువులోగా సిర్పూర్‌ పేపర్‌ మిల్లును ట్రిబ్యునల్‌ అప్పగించనుంది. అన్నీ సవ్యంగా జరిగి మరో 6–8 నెలల్లో పునరుద్ధరణ ప్రక్రియ పూర్తయితే పరిశ్రమ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశాలున్నాయి.

మిల్లును ముంచిన అప్పులు..
చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1936లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సిర్పూర్‌ పేపర్‌ మిల్లు దేశంలోనే అత్యంత పురాతన పేపర్‌ మిల్లుగా ఖ్యాతిగాంచింది. 1950లో బిర్లా కుటుంబం ఈ మిల్లును టేకోవర్‌ చేసుకోగా అనంతర కాలంలో ఇది పొద్దార్‌ గ్రూప్‌ చేతికి వెళ్లింది. అయితే మిల్లు అవసరాల కోసం యాజమాన్యం 2007లో వివిధ బ్యాంకుల నుంచి రూ. వందల కోట్ల రుణాలు తీసుకొని చెల్లించలేకపోయింది. 2014 నాటికి ఈ రుణాలు వడ్డీలతో కలుపుకుని రూ. 425 కోట్లకు పెరిగిపోయాయి.

పరిశ్రమ నిర్వహణకు చేసిన మరో రూ. 150 కోట్ల అప్పులు దీనికి జత కావడంతో మొత్తం రుణాలు రూ.600 కోట్లకు ఎగబాకాయి. ఈ సమయంలో మరమ్మతుల పేరుతో యాజమాన్యం 2014 సెప్టెంబర్‌ 27 నుంచి రెండు నెలల కోసం మిల్లును షట్‌డౌన్‌ చేసింది. ఈ కాలంలో విధులకు హాజరైనా కార్మికులకు జీతాలు చెల్లించలేకపోయింది. అలాగే మరమ్మతుల తర్వాత మిల్లును పునఃప్రారంభించకుండా చేతులెత్తేసింది. దీంతో 1,350 మంది రెగ్యూలర్‌ కార్మికులు, 400 మంది ఉద్యోగులతోపాటు మరో 1,200 తాత్కాలిక కార్మికులు, వారి కుటుంబాలు వీధిన పడ్డాయి.

ఫలిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు...
సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. మిల్లు పునరుద్ధరణ అంశంపై చర్చలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 8 సార్లు పిలిచినా మిల్లు యజమాని ఆర్కే పొద్దార్‌ స్పందించలేదు. దీంతో ఐడీబీఐ బ్యాంకు నేతృత్వంలో ఏర్పడిన బ్యాంకుల కన్సార్షియం మిల్లును స్వాధీనం చేసుకొని వేలం నిర్వహించింది. మిల్లులోని యంత్రాలకు కాలం చెల్లడం, మిల్లు విలువతో పోల్చితే అప్పులే ఎక్కువగా ఉండటంతో వేలానికి స్పందన లభించలేదు.

ఇదే కారణంతో తొలుత రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సైతం పారిశ్రామికవర్గాల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఈ క్రమంలో మిల్లును పునఃప్రారంభించేందుకు ముందుకొస్తే రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌–ఐపాస్‌ కింద అందించే అన్ని రకాల రాయితీలు, ప్రోత్సాహకాలతోపాటు మెగా పరిశ్రమలకు అందించే ప్రత్యేక రాయితీలను కూడా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే బ్యాంకులకు యాజమాన్యం బకాయిపడిన రుణాలపై మారటోరియం విధించడంతోపాటు విద్యుత బిల్లుల బకాయిల భారాన్ని భరిస్తామని హామీ ఇచ్చింది.

కాగితపు వ్యాపారంలో ఉన్న ఐటీసీ, రిద్దిసిద్ది, పాప్సెల్‌ తదితర కంపెనీలతో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కె. తారకరామారావు స్వయంగా చర్చలు జరిపి ఒప్పించే ప్రయత్నాలు చేశారు. ఐటీసీ, పాప్సెల్‌ యాజమాన్యాలు సిర్పూర్‌ మిల్లును సందర్శించి పరిస్థితులను అంచనా వేశాయి. మరోవైపు పొద్దార్‌ గ్రూప్‌ విజ్ఞప్తి మేరకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యూనల్‌ ఈ మిల్లుకు సంబంధించిన దివాలా వ్యాపార పరిష్కార ప్రక్రియను చేపట్టింది. 

మరిన్ని వార్తలు