తాగునీటి సమస్యను పరిష్కరిద్దాం

29 Nov, 2015 00:05 IST|Sakshi

 ఇబ్బందులున్న గ్రామాల వారీగా నివేదికలు ఇవ్వండి
 సాక్షి, రంగారెడ్డి జిల్లా :
యుద్ధప్రాతిపదికన తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ రఘునందన్‌రావు మండల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల వివరాలను తక్షణమే సమర్పించాలని స్పష్టం చేశారు.
 
 గ్రామాల వివరాలను సమర్పించిన వెంటనే నివారణ చర్యలు చేపడతామని, ఈ మేరకు గ్రామీణ నీటి సరఫరా అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వారంలోపు తాగునీటి సరఫరాకు పరిష్కారం చూపుతామని చెప్పారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల అమలులో జాప్యం జరుగుతోందని, లబ్ధిదారులకు ఫలితాన్ని అందించడంలో ఇబ్బందులుంటే వెంటనే ప్రత్యేకాధికారులు జోక్యం చేసుకుని తగిన సూచనలివ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు.
 
 జాతీయ జనాభా రిజిస్టర్ నమోదు ప్రక్రియను పర్యవేక్షించాలని ప్రత్యేకాధికారులకు సూచించారు. కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రాయితీ రుణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగిరం చేయాలన్నారు. ప్రీమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలకు సంబంధించి దరఖాస్తుల అప్‌లోడ్‌పై శ్రద్ధ తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 33 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించినందున అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి, ఆర్డీఓలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు