ఒకే చికిత్సతో రెండు సమస్యలకు పరిష్కారం 

28 Aug, 2018 01:53 IST|Sakshi
లియల్‌ ఇంటర్‌ పొజిషన్‌ సర్జరీ చికిత్స వివరాలు వెల్లడిస్తున్న విరించి ఆస్పత్రి వైద్యులు

అరుదైన ‘లియల్‌ ఇంటర్‌ పొజిషన్‌ సర్జరీ’ 

టైప్‌–2 డయాబెటిస్,అధిక బరువుకు చెక్‌

విరించి ఆస్పత్రి వైద్యులు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: టైప్‌–2 డయాబెటిస్‌ సహా అధిక బరువుతో బాధపడుతున్న బాధితులకు శుభవార్త. ఒకే చికిత్సతో రెండు రకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందే అవకాశం ఉంది. క్లిష్టమైన ఈ అరుదైన చికిత్స ‘లియల్‌ ఇంటర్‌ పొజిషన్‌ సర్జరీ’ని బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా అందిస్తున్నారు. తాజాగా ల్యాప్రోస్కోపిక్‌ ప్రక్రియలో నలుగురు బాధితులకు ఈ తరహా చికిత్స చేశారు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా ఈ తరహా చికిత్సలు వెయ్యికి పైగా నిర్వహించగా, 80 శాతానికి పైగా సక్సెస్‌ రేటు సాధించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

సోమవారం ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ రియోడిపౌలా, డాక్టర్‌ సురేంద్ర ఉగాలా, డాక్టర్‌ అమర్‌.వి, డాక్టర్‌ అభిషేక్‌ కటక్‌వార్, డాక్టర్‌ నాగేశ్వర్‌రావు, డాక్టర్‌ దీపక్‌తంపి, డాక్టర్‌ ఆయూస్‌ కౌగాలేల బృందం చిన్నపేగు మార్పిడి చికిత్స ‘లియల్‌ ఇంటర్‌ పొజిషన్‌ సర్జరీ’కి సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఈ తరహా చికిత్సలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉండవని, పెద్దపేగు సైజును తగ్గించడం వల్ల ఆహారం తీసుకోవడం తగ్గి అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. దేశంలో చాలా తక్కువ మంది వైద్యులు మాత్రమే ఈ తరహా చికిత్స చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే మందులు, ఇన్సులిన్‌ వాడుతున్న వారు లియల్‌ ఇంటర్‌ పొజిషన్‌ సర్జరీ తర్వాత ఆ మందులు వాడాల్సిన అవసరం ఉండదని వైద్యులు స్పష్టం చేశారు. 

సర్జరీ ఎలా చేస్తారంటే? 
పెద్దపేగు కింద చిన్నపేగు మధ్యలో పాంక్రియాస్‌ ఉంటుంది. తీసుకున్న ఆహారం పెద్దపేగు నుంచి చిన్నపేగుకు చేరుకునే మార్గం మధ్య(పెద్దపేగు, చిన్నపేగు కలిసే ప్రదేశం)లో బీటాసెల్స్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఆ తర్వాత చిన్నపేగు చివరి భాగంలో అంతే మొత్తంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా మధుమేహుల్లో పాంక్రియాస్‌ నుంచి విడుదలయ్యే ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతిలో చిన్నపేగు చివరి భాగాన్ని కట్‌ చేసి, దాన్ని పెద్దపేగు చివరి భాగంలో అమర్చడం వల్ల ఇన్సులిన్‌ ఉత్పత్తి వేగంగా జరిగి శరీరానికి అందిస్తుంది. టైప్‌–1 మధుమేహులకు ఈ చికిత్స పనికిరాదు. కేవలం టైప్‌–2 మధుమేహం సహా అధిక బరువుతో బాధపడుతున్న వారికి మాత్రమే ఈ చికిత్స చేస్తారు. పెద్దపేగు సైజును కూడా తగ్గిస్తారు. దీని వల్ల తిన్న వెంటనే కడుపు నిండిపోయి చాలా తక్కువ ఆహారం తీసుకుంటారు. ఫలితంగా బరువు కూడా తగ్గుముఖం పడుతుంది. ఒక చికిత్సతో రెండు రకాల ప్రయోజనాలు పొందవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ఈ తరహా చికిత్సకు రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు