Insulin: ఇక రోజూ ఇన్సులిన్‌ అవసరం లేదు!

3 Nov, 2023 15:01 IST|Sakshi

మధుమేహం అనేది ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. ఈ వ్యాధి ఒకసారి వస్తే ఎప్పటికీ నయం కాదు. ఎందుకంటే దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. అందుకే మధుమేహం రాకముందే అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇక షుగర్‌ వ్యాధి వచ్చిందంటే ప్రతిరోజూ మందులు, ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు వాడాల్సిందే.

అయితే ఇకపై ఆ కష్టాలు కొంతవరకు తీరనున్నాయి. ప్రతిరోజూ కాకుండా వారంలో ఒకసారి మాత్రమే ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ తీసుకుంటే సరిపోతుందట. సైంటిస్టులు జరిపిన క్లినికల్‌ ట్రయల్స్‌లో ఈ విషయం వెల్లడైంది. 


భారత్‌లో మధుమేహం దూకుడు పెంచుతోంది. ఏటా మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోంది. దాదాపుగా 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ‘లాన్సెట్‌’లో పబ్లిష్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది. కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన ఈ అధ్యయనంలో దాదాపు 13.6 కోట్ల మందికి ప్రీడయాబెటిస్‌ ఉందని అంచనా వేశారు. మనుషుల్లో తగినంత ఇన్సులిన్, హార్మోన్ తయారుకాకపోవడం లేదా ఆ పరిస్థితిలో సరిగ్గా ప్రతిస్పందించలేకపోవటం వల్ల హై బ్లడ్ షుగర్‌ వస్తుంది.

లైఫ్ స్టైల్లో మార్పులు, ఫ్యామిలీ హిస్టరీ వల్ల ఈమధ్య కాలంలో తక్కువ వయసులోనే పలువురు మధుమేహం బారిన పడుతున్నారు. డయాబెటిస్‌ను నియంత్రణలో పెట్టకపోతే ప్రాణానికే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు కిడ్నీ ఫెయిల్యూర్, కంటిచూపు పోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.  అందుకే మధుమేహం రాకముందే పరిస్థితిని అదుపులో ఉంచుకోవడం మంచిది. మధుమేహం రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో టైప్‌-2 డయాబెటిస్‌ సాధారణమైంది. ప్రతిరోజూ మందులు వాడితే సరిపోతుంది.

ఇక టైప్‌-1 డయాబెటిస్‌ వారు మాత్రం జీవితాంతం ప్రతిరోజూ ఇన్సులిన్‌ తీసుకోవాల్సిందే. ఒకరోజూ ఇన్సులిన్ తీసుకోకపోయినా  పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వీరికి కాస్త ఉపశమనం లభించనుంది. శాస్త్రవేత్తలు తాజాగా రూపొందించిన 'ఐకోడెక్‌' అనే ఇన్సులిన్‌తో కేవలం వారానికి ఒకసారి మాత్రమే ఇంజెక్షన్‌ తీసుకుంటే సరిపోతుంది. ఇది డైలీ తీసుకునే ఇన్సులిన్‌ షాట్స్‌కి సమానంగా ఉంటుందని క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైంది. 'ఐకోడెక్‌' ఇన్సులిన్‌ రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడుతుందని తేలింది. 

టైప్‌-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న 582 మంది రోగులపై ఈ ట్రయల్స్‌ నిర్వహించారు. వీరిలో సగం మందికి 'ఐకోడెక్‌' అనే ఇంజెక్షన్‌ను ఇవ్వగా, మిగతా సగం మందికి 'డెగ్లుడెక్‌' అనే సాధారణ ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌(రోజూ వాడేది)ను ఇచ్చారు. దాదాపు 26 వారాల తర్వాత వీరి  HbA1C(గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్)లెవల్స్‌ను పరిశీలించగా.. ఊహించని మార్పులను కనుగొన్నారు.

డెగ్లుడెక్‌ ఇన్సులిన్‌తో పోలిస్తే తాజాగా శాస్త్రవేత్తలు కొనిపెట్టిన ఐకోడెక్‌ ఇన్సులిన్‌ను వాడిన వాళ్లలో హైపోగ్లైసీమిక్ (తక్కువ గ్లూకోజ్ స్థాయిలు) కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ ఇదంత పెద్ద విషయం కాదని, ఈ రకమైన ఇన్సులిన్‌తో వారానికి ఒకసారి మాత్రమే ఇంజెక్షన్‌ తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు