రైళ్లలో నేరాలపై ప్రత్యేక దృష్టి

21 Mar, 2014 02:50 IST|Sakshi

ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: వేసవిలో రైళ్లలో నేరాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు రైల్వే ఎస్పీ సిహెచ్.చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రైల్వే ఎస్పీగా విధులు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారిగా గురువారం ఖమ్మం రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ముందుగా, రెండోనంబర్ ప్లాట్‌ఫామ్ పరిశీలించారు. అనంతరం, జీఆర్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. గత ఏడాది వేసవిలో జరిగిన నేరాలను దృష్టిలో ఉంచుకుని రైళ్లలో రక్షణ సిబ్బందిని అదనంగా నియమిస్తామన్నారు. గతంలో నేరాలు జరిగిన పాపటపల్లి, మోటమర్రి వద్ద ఆర్‌పీఎఫ్, జీఆర్ పోలీసులతో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. మాహబూబాబాద్ నుంచి విజయవాడకు కృష్ణా ఎక్స్‌ప్రెస్ సాధారణ బోగీల్లో బెల్లం, సారా, గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్టుగా సమాచారం ఉందన్నారు. దీనిని అరికట్టేందుకు ప్రత్యేకంగా అదనపు సిబ్బందిని కూడా నియమిస్తున్నామన్నారు.

 ప్రత్యేక అలవెన్స్ ఉండదు..
 ‘జిల్లాలోని పోలీసులందరికీ 15 శాతం అల వెన్స్ ఇస్తామని ఎస్పీ చెప్పారు. ఇది, జీఆర్ పోలీసులకు వర్తిస్తుందా..?’ అని, కొందరు విలేకరులు ప్రశ్నించారు. ఇది తమకు వర్తించదని రైల్వే ఎస్పీ సమాధానమిచ్చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలీసులకు ప్రత్యేక అలవెన్సును కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని, పట్టణాలు.. నగరాలలోని సిబ్బందికి ఇవ్వడం లేదని అన్నారు. ‘ఒకవేళ జిల్లాలో ఇచ్చినప్పటికీ.. కొంతకాలం తరువాత ప్రభుత్వం సదరు సిబ్బంది వేతనం నుంచి రికవరీ చేస్తుంది.

గతంలో వరంగల్, కరీంనగర్ జిల్లాలోని పోలీసులకు అక్కడి ఎస్పీలు 15 శాతం అలవెన్స్ ఇచ్చారు. ఆ తరువాత, వాటిని సదరు సిబ్బంది వేతనం నుంచి ప్రభుత్వం రికవరీ చేసింది’ అని చెప్పారు. ఇటీవల విశాఖపట్నం లో జరిగిన 47వ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్ జూడో పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచిన టి.ఇందిరను రైల్వే ఎస్పీ అభినందించారు. సమావేశంలో రైల్వే డీఎస్పీ ఎస్.శ్రీనివాసరావు, సీఐ బి.రాజ్‌గోపాల్, ఎస్‌ఐ రవిరాజు, హెడ్ కానిస్టేబుల్ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు